ఎన్నికలంటే రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లకు కూడా పండగగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదైనా, అది నేడు డబ్బుతో ముడిపడిపోవడం ఆందోళనకరం. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు ఖజానాపై భారీ భారం మోపుతుండగా, ఆ భారాన్ని చివరికి ప్రజలే పన్నుల రూపంలో భరిస్తున్నారు.
తెలంగాణలో పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి ఉంటే ప్రభుత్వ ఖర్చు గణనీయంగా తగ్గేది. ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం, భద్రత, సిబ్బంది, పరిపాలనా యంత్రాంగం శ్రమ తగ్గేది. కానీ రాజకీయ లెక్కలు వేరేలా ఉన్నాయి. అధికార పార్టీలకు విడతలుగా ఎన్నికలు జరగడం అనుకూలంగా కనిపిస్తోంది.‘జమిలి ఎన్నికలు’ జరిగితే ప్రజల మనోభావాలు ఒక్కసారిగా ప్రతిబింబిస్తాయి. ఫలితాలు అనుకూలంగా రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అధికార పార్టీలకు ఉంటుంది. అందుకే విడతలుగా ఎన్నికలు జరుపుతూ, ఓటర్ల మనోగతాలను తమకనుకూలంగా మలుచుకుంటూ, పరిస్థితులను చక్కబెట్టుకోవడమే మెరుగని భావిస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత మార్చిలో జడ్పీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల ఖజానా గుల్లవుతున్నా, రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష నష్టం ఏమీ లేదు. ఆ భారమంతా చివరికి ప్రజలపైనే పడుతుంది. ఎన్నికల ఖర్చు ప్రభుత్వ ఖర్చుగానే కనిపించినా, అది ప్రజల పన్నుల నుంచే వస్తుందన్న సత్యాన్ని మనం మరిచిపోతున్నాం.
రాష్ట్రంలో మున్సిపల్ రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరిలో ఈ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఏ క్షణంలోనైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో పట్టణాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు ఏ వార్డు ఎవరికీ రిజర్వ్ అవుతుందోనన్న టెన్షన్‌తో ఉన్న ఆశావహులు ఇప్పుడు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధాన రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాల’పై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల బాధ్యతను సంబంధిత మంత్రులకు అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిగా నియమిస్తూ, మున్సిపల్–కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరగనున్నందున అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న పొరపాటు కూడా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఎలాంటి లోపాలు లేకుండా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఈ రాజకీయ హడావుడిలో ఒక చేదు నిజం మరుగున పడుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు గెలుస్తున్నాయి. కానీ ప్రజలు ఓడిపోతున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో కొందరు ఓటర్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని, కొందరు అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను నిలదీసిన సంఘటనలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి నిదర్శనం. ఇలాంటి సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? నిజాయితీగల నాయకత్వం ఎలా వస్తుంది?
ఈ వరుస ఎన్నికలు ఖజానాపై భారం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు కూడా సవాల్‌గా మారుతున్నాయి. ఎన్నికల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖర్చు, రాజకీయ స్వార్థం, ఓటర్ల ప్రలోభాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరం. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల ఖర్చును నియంత్రించడం, ఓటర్లలో చైతన్యం పెంపొందించడం అత్యవసరం. ఎన్నికల పండగలో రాజకీయ పార్టీలు లబ్దిపొందుతూంటే, ప్రజలు మాత్రం ఎప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.

