ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి గురువారం ఉదయం అనారోగ్య కారణాలతో హైదరాబాద్ హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు సుమారు 80 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ ఓ సీనియర్ నాయకుడిని కోల్పోయింది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజిరెడ్డి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
1945లో నాచారంలో జన్మించిన బండారి రాజిరెడ్డి, మల్లాపూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. బాల్యం నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న ఆయన, యువకుడిగా ఉండగానే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో సేవలందించిన ఆయన, స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై 28,183 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, బస్తీలలో బేసిక్ సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రజలతో నిత్యం కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకుడిగా చరిత్రలికెక్కారు. 2012లో తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా కూడా సేవలందించారు. ఆ హోదాలో దాదాపు ఏడాది పాటు పనిచేశారు.
2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజిరెడ్డి పోటీ చేయకపోయినా, తన సోదరుడు బండారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. అయితే ఆయన ఓటమి చెందారు. అనంతరం లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయంగా కొనసాగారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఉప్పల్ నియోజకవర్గం నుండి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బండారి రాజిరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఆయన మృతి తీరనిలోటు.

