తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దావోస్ పర్యటన ఫలితంగా రాష్ట్రం 1 లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగిందని ఆయన తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ విభేదాలకు తావివ్వకుండా, పెట్టుబడులకు అవసరమైన భూమి కేటాయింపులు చేయడం ద్వారా సంస్థలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసేలా సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈ సంస్థతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం చెప్పారు. ఇది భవిష్యత్ తరగతులకు ఉపయోగకరంగా మారుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి గుర్తుచేస్తూ, ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నందుకు కొందరికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. పెట్టుబడులను అడ్డుకుంటున్నానని తనపై ఫిర్యాదులు చేస్తున్న వారిని బానిస సంకెళ్లు తెంచుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా కొన్ని కుట్రలు జరిగాయని, అపోహలు సృష్టించినప్పటికీ, ఇన్వెస్టర్లు తమ విశ్వాసాన్ని చాటుకున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రణాళికలు పక్కాగా ఉండటంతో 13 నెలల్లో రూ. లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు రావడం సాధ్యమైందని వివరించారు. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి కీలకమని, సమిష్టిగా కష్టపడితేనే తెలంగాణ వృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో అద్భుత మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై పెట్టుబడిదారులు చూపుతున్న నమ్మకంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని ఆయన అభివర్ణించారు.

