తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం అశోక్ నగర్‌లో వారి ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కోతలపాలన, ఎగవేతల ప్రభుత్వంగా వుందన్నారు. ఆయన, రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి ప్రామిసులు అన్ని ఎగవేతలు మాత్రమేనని అన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా రూ. 15 వేలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రూ. 12 వేలకు కోత పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండిపడ్డారు.
అలాగే, రైతు భరోసా కౌలు రైతులకు వర్తించకపోవడాన్ని, గతంలో సంక్రాంతి సమయంలో రూ. 12,000 ఇవ్వాలని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు జనవరి 26 అంటోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని, రైతుల డేటా ఉన్నా మళ్లీ సర్వేలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు.
రైతుల హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల హామీలను అమలు చేసే వరకు వెంటాడుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

