అమెరికా 39వ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యుల ప్రకటన ప్రకారం, అనారోగ్య కారణాలతో అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఆయన మృతి చెందారు. 1924 అక్టోబర్ 1న జార్జియా రాష్ట్రంలోని ప్లెయిన్స్‌లో జన్మించిన కార్టర్, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పురోగతి, ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం చేసిన కృషికి 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
జలాంతర్గామి నౌకా అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించిన కార్టర్, 1963లో జార్జియా రాష్ట్ర సేనేటరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1971-75 మధ్య గవర్నర్‌గా సేవలందించిన ఆయన, 1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. క్యాంప్ డేవిడ్ ఒప్పందాలు, పౌర హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన కార్టర్, తన పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రజారోగ్య, మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన సెంటర్ ద్వారా సేవలందించారు.
అంతర్జాతీయ సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనడంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడంలో ఆయన పాత్రను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. జిమ్మీ కార్టర్ మానవతావాదిగా, అసాధారణ నాయకుడిగా ప్రపంచానికి చిరస్మరణీయం.

