ఒక ప్రశ్నించే గొంతు మూగబోయింది. ఉద్యమించే హృదయం ఆగిపోయింది. సామాజిక సమస్యలపై స్పందించే సవ్యసాచి తనువు చాలించాడు. ప్రముఖ సామాజిక, బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త, జర్నలిజం ప్రొఫెసర్ యదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ కన్నుమూశారు. ఆయన జర్నలిజం రంగానికి అమూల్యమైన సేవలందించారు. కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీల్లో జర్నలిజం విభాగాలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. బహుజన హక్కుల కోసం సాగించిన ఉద్యమాల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. సామాజిక న్యాయం కోసం జర్నలిజాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించారు. పలు ప్రముఖ పత్రికలతోపాటు విద్యా రంగంలోనూ ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి. వీరి స్వగ్రామం జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామం. ప్రభంజన్ లాంటి ఉన్నతుడిని కోల్పోవడం జర్నలిజం రంగానికి తీరని లోటు అని సోమనాథ కళా పీఠం అధ్యక్షులు రాపోలు సత్యనారాయణ, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ లు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వీరితో పాటు పలువురు జర్నలిస్టులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రభంజన్ గూడ అంజయ్య అన్న కూతురు డాక్టర్ రేఖ ను గూడూరులో ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రభంజన్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


