చాచా చాచి, దాదా దాది, భియ్య భాయ్ వరుచోగా….
బంజారా భాషలో ప్రసంగించిన ఎంఎల్ఏ
ఘనంగా పాలకుర్తిలో 286వ సేవాలాల్ జయంతి ఉత్సవాలు
హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి, నియోజకవర్గ గిరిజనులు
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సబ్ స్టేషన్ సమీపంలో 1 ఎకరం స్థలంలో, 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గుడి, మేర మా యాడి గుడి స్థలంలో సేవలాల్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవలాల్ జయంతి ఉత్సవాలు, భోగ్ భండారో పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి హాజరవ్వగా, ఆత్మీయ అతిథులుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పాలకుర్తి చౌరస్తా నుండి గుడి నిర్మించే స్థలం వరకు ట్రాక్టర్, జీపు ఇతర వాహనాల్ని అలంకరించి ఊరేగింపుగా, లంబాడాల సంప్రదాయ పాటలు, నృత్యాలతో, డిజె పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు లంబాడా గిరిజనులతో కలిసి కదం కలిపి, నృత్యం చేసి ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా… ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. సేన రామ్ రామ్, చాచా చాచి, దాదా దాది, భాయి బియ్యా సేనా వరుచోగా… అంటూ బంజారా భాషలో మాట్లాడారు. బంజారుల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని, వాటిని మర్చిపోవద్దు అన్నారు. గిరిజనులు ఎవరికి హాని చేయరని, వారికి వున్నదాంట్లోనే పని చేసుకుంటారని అన్నారు. బంజారా బిడ్డలు మాకు మద్దతు గా నిలిచారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు. మన ప్రాంతంలో గత పాలకుల కారణంగా గిరిజనులు వెనుకబడిపోయారని, వారిని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు. వచ్చే సంవత్సరంలోగా సేవాలాల్ భవనాన్ని పూర్తిచేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను నిర్మించడానికి కావలసిన నిధులు మంజూరు చేయమని సీఎం గారిని కోరినట్లు తెలిపారు. గిరిజనులు మాట ఇస్తే తప్పరన్నారు కొందరు మాటలు చెప్పడానికి వస్తున్నారని వారిని నమ్మొద్దన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మరచిపోలేనివి అన్నారు. తన వద్దకు వచ్చే అమెరికా మిత్రులకు సరైన పల్లె చూపెట్టమని అడిగితే పాలకుర్తి నియోజకవర్గం లోని మన తండాలని చూపెడుతాను అన్నారు. సేవాలాల్ యుగ పురుషుడు అని, సేవ స్ఫూర్తిని చాటి చెప్పిన వ్యక్తిగా కొనియాడారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీని అభినందించారు. ప్రభుత్వమే పండుగలు చేసే, సంప్రదాయం దేశంలో ఎక్కడా లేదు. ఒక్క తెలంగాణ లో మాత్రమే వుందన్నారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, నియోజవర్గం సహా, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన లంబాడా గిరిజనులు, మహిళలు వేలదిగా వచ్చారు. వాళ్ళందరికీ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసిన ఎంఎల్ఏ యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి లకి ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

