మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు

నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన వ్యోమగాములు ఆ అనుభూతిని “అద్భుతం” అని వర్ణించారు. పైలట్ విక్టర్ గ్లోవర్ హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్తో మాట్లాడుతూ.. చంద్రుడిపై వెలుతురు, చీకటిని వేరు చేసే ‘టెర్మినేటర’ లైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వెనుక భాగాన్ని మానవులు నేరుగా చూడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక యాత్ర భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగడానికి బలమైన పునాది వేయబోతోంది. చందమామ ఉపరితలం మీదుగా నీలిగోళంలా కనిపించే భూమిని.. సూర్యగ్రహణాన్ని.. చంద్రుడిపై దాదాపు 950 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ ఉల్కాపాతబిలం (ఓరియంటేల్ ఇంపాక్ట్ బేసిన్) వంటివాటిని వేయి కళ్లు చేసుకుని చూశారు. నలుగురు వ్యోమగాములూ ఇద్దరిద్దరుగా విడిపోయి.. ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ కిటికీల వద్ద చేరి..నరమానవులెవరూ చూడని దృశ్యాలను కన్నులారా తిలకించి పులకించిపోయారు. ఆ దృశ్యాలన్నింటినీ కెమెరా కళ్లతో చిత్రీకరించారు. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడి చెంతకు వెళ్లిన తొలి మహిళ క్రిస్టినా కోచ్.. “చంద్రుడిని అంత దగ్గర్నుంచీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా గాఢమైన భావోద్వేగం కలిగింది.” అని పేర్కొన్నారు. దీపపు సెమ్మెలోని రంధ్రాల నుంచి వచ్చే కాంతిలా.. చందమామపై కనిపించిన ప్రకాశవంతమైన బిలాలను చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. కాగా.. సోమవారం అర్ధరాత్రి దాటాక చంద్రుడి ఆవలివైపునకు చేరుకున్న ఈ వ్యోమనౌక మళ్లీ భూమి దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 40 వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించి.. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.07 గంటలకు.. శాన్‌డియోగో తీరానికి సమీపాన సముద్రంలో దిగనుంది.


