
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామంలో ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థాన్ని చెప్పే అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కొలువురు సుజాత, అదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సుజాత భర్త శ్రీను గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అనుకోకుండా మృతి చెందారు. ఆ కష్ట సమయంలో జీవనాధారం కోల్పోయిన సుజాతను గ్రామస్తులే అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉద్యోగం కల్పించారు. కాలం గడిచే కొద్దీ ఆమె కష్టపడి పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ రావడంతో, కాంగ్రెస్ పార్టీ తరపున సుజాత ఎన్నికల బరిలోకి దిగారు. నిరాడంబరమైన ప్రచారం, ప్రజలతో నేరుగా మమేకమవడం ఆమెకు కలిసొచ్చింది. ఫలితంగా ఏ గ్రామానికి ఐతే పారిశుద్ధ్య కార్మికురాలు అయిందో అదే పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైంది.

