హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా-ఈ రేస్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి & ప్రభుత్వం చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. దీనిని లాత్కొర్ పని అంటూ విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ పెట్టమని మేము కోరడం వాస్తవానికి నిజాలు చెప్పడమే మా ప్రయత్నమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “గత రెండు రోజులుగా స్పీకర్‌ను అసెంబ్లీలో చర్చకు అనుమతించాలని కోరుతున్నాం. మమ్మల్ని కుంభకోణంలో లాగడమే లక్ష్యమని, కానీ వారి ప్రయత్నాలు ఫలించవని,” తేల్చిచెప్పారు. నాలుగు గోడల మధ్యనే మాట్లాడితే ప్రజలు తెలుసుకోలేరని, 4 కోట్ల మంది ప్రజల ముందే ఈ విషయంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా-ఈ రేస్ పట్ల అప్పటి ప్రభుత్వ దృక్కోణం
ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా చెప్పొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణానికి హాని లేకుండా మెరుగైన రేసింగ్ ప్రోత్సహించడమే కాదు, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.
“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే 2001లో ఫార్ములా-1 రేస్‌ను దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో పర్మనెంట్ ట్రాక్ కోసం గోపన్‌పల్లి ప్రాంతంలో 580 ఎకరాల భూమిని భూసేకరణ చేయడానికి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని,” కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా-1 ట్రాక్ కోసం కేటాయించిన భూముల్లో రేవంత్ రెడ్డికి 15 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఈ వివరాలను 2023 ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు. అయితే, రేసింగ్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు.
ఫార్ములా-ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ద్రవ ఇంధనాలకు ప్రత్యామ్నాయం కోసం ఏర్పాటవుతుండగా, తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి విజయవంతం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. “విశ్వవ్యాప్తంగా రేసింగ్‌లో పెద్ద మార్పు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు చొరవ తీసుకోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణానికి మేలు చేకూర్చడం జరుగుతోంది. ఇలాంటి రేసింగ్ ఈవెంట్ల ద్వారా నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. హైదరాబాద్ ఈ విషయంలో ముందంజ వేసింది,” అన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 14 కీలక రంగాలను గుర్తించిందని, వాటిలో ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రెండింటి కలయికగా ఎలక్ట్రిక్ వాహనాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రం ముందడుగు వేసిందని వివరించారు.
మొనాకో సిటీ గ్రాండ్ ప్రీ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, యూపీలోని నోయిడాలో జేపీ గ్రూప్ నిర్మించిన ట్రాక్‌లో ఫార్ములా-1 రేస్‌లు జరిగినప్పటికీ, అవి మూడేండ్లకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పారు. ఫార్ములా-4 రేసింగ్ ఇటీవల చెన్నైలో, జమ్మూకశ్మీర్‌లో జరిగిన సందర్భాలను గుర్తుచేశారు. అమిత్ షా కూడా ఫార్ములా-4 రేస్‌ను ప్రశంసించారని, ఈ విధమైన ఈవెంట్లు భారత దేశానికి గర్వకారణమని అన్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అసలు వారి ఉద్దేశ్యం కేవలం ప్రజల దృష్టిని మరల్చడమేనని కేటీఆర్ ఆరోపించారు. “ఫార్ములా-ఈ రేస్‌పై ప్రభుత్వం సరిగ్గా సమాధానం ఇవ్వగలదని నమ్మకం లేదు కాబట్టే వారు చర్చకు రావడం లేదు,” అన్నారు.
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మానసికత సాడిస్ట్‌గా ఉందని విమర్శించిన కేటీఆర్, ప్రజల మనోగతాలు గౌరవించకపోవడం వారి వైఫల్యమని అన్నారు. “ప్రజల కోసం ప్రభుత్వ విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తేనే అభివృద్ధి సాధ్యం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నాయి,” అని అభిప్రాయపడ్డారు.