LOCAL BODY|‘స్థానికం’పై ‘ప్లాన్ ఏ, బీ, ‘సీ’!?PLAN A B C
స్థానిక ఎన్నికలపై సర్కార్ ప్లాన్స్|GOVERNMENT
అనుకూలమైతే అదే షెడ్యూల్
ప్రతికూలమైతే రీ-షెడ్యూల్|RE SCHEDULE
తీర్పేదైనా సర్కార్ ముందుకే…
‘స్థానిక బంతి’ హై‘కోర్టు’లోకే!|HIGH COURT
రేపు హైకోర్టులో విచారణ
ముందుకే..! కాకపోతే…
కాస్త ముందూ వెనుకా అంతే!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా? బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండింగులో ఉండగా, జీవో నెగ్గేనా? సర్కార్ ముందుకు సాగేనా? దావాలు ఆగేనా? కోర్టులు సానుకూలంగా స్పందించేనా? వంటి అనేక అనుమానాల మధ్య ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. మరోవైపు హై కోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు పడ్డాయి. సుప్రీంలో 6న జరిగిన విచారణ సందర్భంగా, ‘స్థానిక బంతి’ హై‘కోర్టు’లోకే! విసిరింది. పిటిషనర్ ను చివాట్లు పెట్టింది. అక్కడ విచారణ పెండింగులో ఉండగానే సుప్రీంకు వస్తారా? అక్కడి సమస్య అక్కడే తేల్చుకోండంది. మరోవైపు 8న అంటే రేపే హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును బట్టి ఈ కేసు మళ్లీ సుప్రీంకోర్టకు వెళ్ళదన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండనున్నది.? ఆ తీర్పు పర్యవసానాలు ఏంటి? సర్కార్ ఏం చేయనుంది? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీన్నింటినీ పటా పంచలు చేస్తూ కోర్టుల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ ముందుకే వెళ్ళడానికి సర్కార్ సంసిద్ధంగా ఉంది. అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నది. ‘అరు నూరైనా, నూరు ఆరైనా స్థానిక ఎన్నికలు జరుపుడే’ అన్న విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంది.
ఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 6 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
అన్ని సజావుగా జరిగి, కోర్టుల తీర్పులు అనుకూలంగా ఉంటే ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ‘ప్లాన్ ఎ’ గా సర్కార్ నిర్ణయించింది. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఎదురైతే, అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ‘ప్లాన్ బీ’ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. అంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే, ఏం చేయాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దాన్ని ‘ప్లాన్ బీ’ గా అమలు చేయనుంది.
అందరి చూపు కోర్టుల వైపే
పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఆ పిటిషన్‌పై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరపనుంది. నాటి విచారణలో బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయితే, ఈ దశలో రిజర్వేషన్ల పెంపుదలను ఆమోదించలేమని, అదేవిధంగా ఎలాంటి నిలిపివేత ఆదేశాలు కూడా జారీ చేయలేమని తెలిపింది. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా, పిటిషన్లు ముందే దాఖలు చేసినందున మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని తెలిపింది. తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది. దీంతో 8న హై కోర్టు ఏం తేలుస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.
సుప్రీంలో చుక్కెదురైతే, పాత రిజర్వేషన్ల ప్రకారం సిద్ధమే
రాజ్యాంగంలోని 50శాతం రిజర్వేషన్ల సీలింగ్ ను ఉటంకిస్తూ మరో వ్యక్తి సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. ఈ విచారణ 6న జరిగింది. ఆ పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టుల్లో రిజర్వేషన్లకు అననుకూల తీర్పులు వస్తే 50శాతానికి లోబడి, పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్లను ఖరారు చేసినందున, వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సిద్ధంగా ఉంది. తమ పార్టీ ప్రభుత్వమే ఉన్నందున సీఎం ముందుగానే చెప్పినట్లు పార్టీ పరంగా 42శాతం బీసీలకు టికెట్లు ఇవ్వవచ్చు. ఇక ఇప్పటికే అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా గ్రామపంచాయతీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
వారంలోపే రీ షెడ్యూల్?
కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ బీసీ కోటాపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీసీ, అన్ రిజర్వుడ్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈసీ జారీచేసిన ఎన్నికల షెడ్యూల్స్ మార్చి వారం రోజుల తేడాతో నిర్వహించేలా మరోసారి షెడ్యూల్‌ను జారీచేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.
ప్లాన్ బీ అమలైతే తేదీల మార్పు?
అవసరమైన మార్పులు చేశాక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ 9వ తేదీకి బదులు 16న జారీచేసి, ఎన్నికలను 23వ తేదీకి బదులు 30న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మిగతా నాలుగు విడతలకు కూడా వారం రోజుల తేడాతో నోటిఫికేషన్ ఇచ్చి, మిగతా దశల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా గతంలో ప్రకటించిన విధంగా నవంబర్ 11కు బదులు 18న ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్లాన్ సి..అదే వెయిట్ అంట్ సీ…
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉండే అవకాశం ప్రభుత్వ ప్లాన్ సి. అదే వెయిట్ అండ్ సీ. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌లు మూడు నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్టు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, మొదటి రెండు సార్లు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్ లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ వార్త రాసే నాటికి మరో 22 రోజులు గడిస్తే, ఆ బిల్లు గవర్నర్ కు పంపి 90 రోజులు పూర్తవుతుంది. మరో 27 రోజులు వేచి చూస్తే రాష్ట్రపతికి పంపిన బిల్లులకు కూడా 90రోజులు పూర్తవుతాయి. అప్పటి దాకా వేచి చూస్తే పోలా? అనే ఆలోచన అధికారుల్లో, ప్రభుత్వంలోనూ ఉంది.
ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తోంది. అయితే ఎ ప్లాన్ వస్తే ఓకే, రాకపోతే, బీ ప్లాన్ తో వెళ్ళడమా? సీ ప్లాన్ కోసం వెయిట్ అండ్ సీ లా వేచి చూడటమా? అన్నదే తేలాల్సి ఉంది. మొత్తానికి స్థానిక ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనున్నాయి. కాకపోతే, కాస్త ముందూ, వెనుకా అంతే!

