భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ అసమాన నీటి లభ్యత భవిష్యత్తులో తీవ్రమైన మంచినీటి సంక్షోభానికి దారి తీస్తుందని ఇప్పటికే గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
భారతదేశంలో తలసరి నీటి లభ్యత గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా తగ్గింది. 1951లో తలసరి నీటి లభ్యత 5,177 క్యూబిక్ మీటర్లుగా ఉండగా, 2020 నాటికి అది 1,486 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువగా ఉంటే దాన్ని “నీటి ఒత్తిడి” స్థితిగా, వెయ్యి క్యూబిక్ మీటర్ల కంటే తక్కువగా ఉంటే “నీటి కొరత”గా పరిగణిస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం, భారత్ ఇప్పటికే నీటి ఒత్తిడి దశలోకి ప్రవేశించింది.
దేశంలోని నీటి వినియోగంలో వ్యవసాయానిది అగ్రభాగం. మొత్తం నీటి వినియోగంలో 80% నుండి 85% వ్యవసాయ రంగమే వినియోగిస్తుంది. పరిశ్రమలు 10%, గృహ అవసరాలు 5% మాత్రమే వినియోగిస్తున్నాయి. కానీ వ్యవసాయంలో నీటి వినియోగం సమర్థవంతంగా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అధిక నీరు అవసరమయ్యే పంటలను విస్తృతంగా సాగు చేయడం వల్ల నీటి వనరులు వేగంగా తగ్గుతున్నాయి.
భూగర్భ జలాల వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో 60% సాగునీరు, 85% తాగునీరు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. అయితే, వీటిని తిరిగి నింపే ప్రక్రియలు తగినంతగా లేకపోవడం వల్ల నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. 2030 నాటికి దేశంలోని 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతాయని అంచనాలు ఉన్నాయి.
నీటి కొరతకు ప్రధాన కారణాల్లో పర్యావరణ విధ్వంసం ముఖ్యమైనది. అడవుల నరికివేతలు, చెరువుల దురాక్రమణలు, నదుల కాలుష్యం వంటి అంశాలు నీటి వనరులను నాశనం చేస్తున్నాయి. వర్షపు నీటి సంగ్రహణలో నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ప్రతి సంవత్సరం పడే వర్షపాతం పరిమాణం తక్కువేమీ కాదు. కానీ దానిని నిల్వ చేసుకునే వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ భాగం నీరు సముద్రంలో కలిసిపోతుంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కూడా నీటి సంక్షోభాన్ని పెంచుతున్నాయి. నగరాల్లో జనాభా పెరగడం వల్ల నీటి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు నీటిని కలుషితం చేస్తున్నాయి.
భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది కలుషిత నీటి వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది ప్రజా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సామాజిక పరంగా కూడా నీటి కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో ఇప్పటికీ కోట్లాది మంది తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, బాలికలే ఉండటం గమనార్హం. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొవాలంటే సమగ్ర ప్రణాళిక అవసరం. ముందుగా వర్షపు నీటి సంరక్షణను ప్రతి స్థాయిలో తప్పనిసరి చేయాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి హార్వెస్టింగ్ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేయాలి. చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించాలి. భూగర్భ జలాల రీచార్జ్‌ను పెంచే చర్యలు చేపట్టాలి. వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా మార్చాలి. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాలి. పరిశ్రమలలో నీటి పునర్వినియోగాన్ని తప్పనిసరి చేయాలి. ప్రభుత్వ స్థాయిలో కూడా కఠిన చర్యలు అవసరం. నీటి వనరుల పరిరక్షణకు చట్టాలను కఠినంగా అమలు చేయాలి. నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. “జల్ జీవన్ మిషన్” వంటి పథకాలను వేగవంతంగా అమలు చేయాలి.
ఇక ప్రజల పాత్ర కూడా కీలకం. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. అవగాహన పెంపొందించాలి. ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయాలి. మొత్తానికి, జనాభా పెరుగుదలతో పాటు నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతున్న ఈ సమయంలో, సమగ్ర ప్రణాళికలు, సమర్థవంతమైన అమలు, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మంచినీటి కోసం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. “నీరు జీవం” అనే సత్యాన్ని గుర్తించి, దాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత.

