ప్రభంజన్ కు అక్షర నీరాజనాలు అర్పిస్తూ,
దివంగత ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ‘అడుగు’ దిన పత్రిక గత పది రోజులుగా అనేక మంది ప్రముఖులు ఆయనపై రాసిన వ్యాసాలను ప్రచురిస్తూ వస్తోంది. అక్షర నివాళులర్పిస్తోంది. ఆ పరంపరలో అక్షర నీరాజనంలో భాగంగా ఆయన 50వ జన్మదినోత్సవం సందర్భంగా ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ రాసిన వ్యాసం
ప్రభం‘జన’ పథం!
ప్రపంచ పటంలో ఓరుగల్లు చరిత్ర చిరస్మరణీయం. సదా రమణీయం. ప్రాత: స్మరణీయం. ఈ గడ్డలో ఏ మహత్మ్యం ఉందో గానీ, ప్రశ్నించడం నేర్పింది. అన్యాయాన్ని ఎదురించడం నేర్పింది. ఉద్యమాల్ని ఉగ్గుపాలతో పట్టింది. పొత్తిల్ల లోనే పోరాటాన్ని పొదివి పట్టింది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డా, దేశం గర్వించే స్థాయిలో ఉన్నరు. తల వంచి దండం పెట్టించుకునే స్థాయిలోనే ఉంటరు. ఆశయమే ఆయుధం, ఉద్యమమే ఊపిరి, చైతన్యమే గీటురాయి.
గిట్లాంటి ఓరుగల్లులోని పాలకుర్తికి కూడా ఇంతకంటే ఘనమైన చరిత్ర ఉంది. తొలి తెలుగు విప్లవ కవి, తొట్టతొలి స్వతంత్ర కవి, ‘కాయకమే కైలాసమ’న్న ప్రజా కవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలం పాలకుర్తి. శ్రీమహాభాగవతాన్ని విరచించి, దాన్ని ‘రాజులకు అంకితమివ్వన పో!’ అంటూ, ‘కలం చేత బట్టి కావ్యంబు రచియించి, హలం చేత బట్టి పొలం దున్ని, కలం, హలం లందు ఘనుడైన’ సహజ కవి పోతన్న జన్మస్థలం బమ్మెర పాలకుర్తికి కేవలం 3 కి.మీ, దూరం. రామాయణ సృష్టికర్త వాల్మీకీ, వాల్మీకీ పురం లో కొంత కాలం తపస్సు చేశాడట. అది కాస్తా కాల క్రమంలో వల్మీడిగా మారింది. వల్మీడి పాలకుర్తికి కేవలం 5కి.మీ. దూరం. విసునూరు దొరల గడీల దాష్టీకాన్ని సంగం సాయంతో ఎదిరించిన చాకలి అయిలమ్మది పాలకుర్తి. విసునూరు పాలకుర్తికి కేవలం 4 కి.మీ. దూరంలో ఉంది. అప్పటి ఆయన గడీ ఇప్పటికీ పదిలంగా ఉంది. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ప్రజలే సాయుధులైన సాగించిన తెలంగాణ సాయుధ పోరాట బీజం పడిన కేంద్రం కూడా పాలకుర్తే. స్వయంభు శివ కేశవ క్షేత్రం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం కూడా పాలకుర్తిలోనే ఉంది. ‘కాలచక్రం’’తో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని పొందిన, నవీన్ గా మారిన దొంగరి మల్లయ్యది పాలకుర్తికి 8 కి. మీ. దూరంలోని వావిలాల. ఇన్ని ప్రత్యేకతలు ఒనగూరిన పాలకుర్తి మండలం బమ్మెరకు నాలుగు కి.మీ. దూరంలోని గూడూరులో పుట్టిండు యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్.
సకల జ్ఞానానికి, ప్రపంచ నూతన ఆవిష్కరణలకి మూలం ‘ప్రశ్న’. ఆ ప్రశ్న ప్రాధాన్యతని తెలుసుకుని, ప్రశ్నించడం వల్లే యాదనాల మల్లయ్య ప్రభంజన్ అయిందు. ప్రశ్నించమని ఎలుగెత్తడం వల్లే ‘ప్రభంజన’మైండు. ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అని ప్రగాఢంగా నమ్మినందునే ‘జర్నలిస్టు’ అయిండు. లక్షలాది మెదళ్ళలో కదలికలు తెచ్చి, సమాజంలో వేలాది ఏళ్ళుగా వేళ్ళూనుకున్న బ్రాహ్మణీయ ‘కుల’ ఆధిపత్యంపై కలం పట్టి సం‘కుల’ సమరం సాగిస్తున్నడు. మనిషి మీద మరో మనిషి, బహుజనుల మీద, బహుకొద్ది జనుల పెత్తనమేందని ప్రశ్నించి, నిగ్గదీసి, నిలదీసి సమర భేరి మోగించిండు.
ప్రభంజన్ చాతుర్వర్ణ ఎగుడుదిగుడు దొంతరల సమాజానికి ఎదురీదిండు. ‘నేను గొల్ల కులంల పుట్టిన.. అయ్యవ్వ సదువుకోలె…’ అని ఎన్ని అవాంతరాలెదురైనా తాను సదువుకున్నడు. సమాజాన్ని సదివిండు. దలిత బహుజనుల సమస్యలను అర్థం చేసుకున్నడు. కానీ ప్రభంజన్ చాలా మందికి అర్థం కాలె. ప్రభంజన్ని ఎవరి ద్రుక్కోణం లోంచి వాళ్ళు అర్థం చేసుకో చూసిండ్రు. ముక్కుసూటిగా మాట్లాడితే చాటుకెళ్ళి ముఖం తిప్పుకున్నరు. ప్రశ్నిస్తే పొగరెక్కువన్నరు. ఉద్యమిస్తే, ‘వీడికెందుకివన్నీ..!?’ అన్నరు. కులాంతర వివావాహాన్ని ఆచరిస్తే, కులం తక్కువవాడిగా కించపరిచిండ్రు. ఊరికింత ఉపకారం చేయాలని ‘సత్యశోధక పీఠం’ పెట్టి, బడి నడిపితే లాభాపేక్షని అంటగట్టిండ్రు. లక్షల పెట్టు‘బడి’ని మూసేసే దాకా కొందరు పట్టుపట్టిండ్రు. జనాన్ని తెలివి పరచ చూస్తే, అతి తెలివైన వాడిగా ముద్ర వేసిండ్రు. బహుజనుల పక్షాన ఉండడాన్ని బలహీనతగా భావించిండ్రు. పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు, ఉద్యోగం చేసిన ఊరు ఎక్కడైనా ప్రభంజన్ అనేక అవమానాలు పడ్డడు. అయినా వెరువలే. వెనుకడుగు వేయలే. ప్రపంచ పోకడల్ని పసిగట్టిండు. న్యూటన్ సిద్ధాంతం లెక్క గోడకు కొట్టిన బంతి లెక్క బలంగా మారిండు. తన పట్టుదలని మొండితనమంటే జగమొండిగా మారిండు. ‘వీడు మహా ముదురు’ అంటే, ‘దేశ ముదురు’ అయిండు. దూషణలను భూషణలనుకున్నడు. ఛీత్కారాలను సత్కారాలను కున్నడు. వైఫల్యాలను, అవమానాలనే గెలుపు సోపానాలు చేసుకున్నడు. దూరం కొట్టిన వాళ్ళనే దగ్గర చేసుకున్నడు. అవమానించిన వాళ్ళనే తన వాళ్ళనుకున్నడు. అలుపెరుగకుండా శ్రమ పడ్డడు. తాను నమ్మిన సిద్ధాంతాన్నే ఆచరణలో పెట్టిండు. ఎవరి కోసమూ తన పద్ధతిని మార్చుకోలేదు. రాజీనామాల కైనా సిద్ధ పడ్డడు కానీ, మరెవ్వరి కోసమూ రాజీ పడలేదు. ఆయన సర్దుకుపోని మనస్తత్వం, రాజీలేని పోరాటమే ప్రభంజన్ ని మిగతా వాళ్ళతో వేరుగా, ప్రత్యేకంగా విలక్షణంగా నిలిపింది.
ప్రభంజన్, సమాజాన్ని సునిశితంగా పరిశీలించిండు. చిన్నప్పుడే, దొరసానికే దానర్థం చెప్పి కళ్ళు తెరిపించిండు. దొర కొడుకు మీద రంగు నీళ్ళు సల్లి, చెంపదెబ్బ తిన్నా, సువ్వూ నేను సమానమేనన్నడు. సదువుకునేటప్పుడు ఎక్కడ చూసినా అగ్రకులపోల్లే కనిపిస్తే, తన బహుజనులు ఎందుకుండొద్దని కుండబద్దలు కొట్టి, తొడగొట్టి ఆతర్వాత ఆచార్యుడై సదవు చెప్పిండు. ‘ఎంత మంచోనికైనా వేపకాయంత వెర్రి ఉంటుందంటే’, అసలా పోలికే తప్పన్నడు. ఉత్పత్తి కులాలని కించ పరిచే కుట్రగా అభివర్ణించిండు. ‘కుల సమాజాన్ని ప్రస్థావించకపోవడమంటే, మనువు ఏర్పరచిన వర్ణాశ్రమ ధర్మాన్ని మరో రూపంలో కొనసాగించడమే’నని కమ్యూనిస్టుల కపట నీతిని కళ్ళకు గట్టిండు. ‘గొర్రె గొల్లోన్నే నమ్ముతది’ అని ప్రజాకవి కాళోజీ అంటే, ‘గొర్రె కటికలనే నమ్ముతద’ని సవరించి, కాళన్న ఎన్నడూ గొర్రెలను కాయలేదు కాబట్టి ఆయనకా విషయం తెలియకపోవచ్చని సుతి మెత్తగా విమర్శించిండు. రామోజీరావు వైఖరిని ఎండగడుతూ బహిరంగ కరపత్రం తీసిండు.
ఇందుకు ప్రభంజన్ సృజనాత్మక, అనుభవపూర్వక రచనా వ్యాసాంగాన్ని ఎంచుకున్నడు. కథ, కథనం, కథానిక, మాట, పాట, వ్యాసం, ఉపన్యాసం, వ్యంగ్యం, ఇంటర్వ్యూలు, ఇన్నర్ వ్యూలు… ఉద్యోగం, ఉద్యమాలు, పోరాటాలు, ఇలా రూపమేదైనా ప్రభంజన్ ఆరాటమంతా దళిత బహుజన చైతన్యం. తన బాధలు ఇంకెవ్వరికీ రావొద్దు. తనకెదురైన అవమానాలు మరెవ్వరికీ ఎదురవ్వొద్దు. జనలోక కళ్యాణానికి నడుం కట్టిన ప్రభంజన్, తన జన లోక కళ్యాణాన్ని స్వప్నించిండు. సాకారం చేయడానికి స్వయంకృషి చేసిండు. ఎవరు చెప్పినా వింటడు. రాస్తడు, చెప్తడు, వినకపోతే వినిపిస్తడు. కాదంటే కాలుదువ్వుతడు, దండుకడతడు. ఉద్యమిస్తడు, పోరాటం చేస్తడు. అన్యాయం ఏ రూపంలో ఉన్నా సరే, ఎదిరిస్తడు. ఎదురొడ్డి నిలబడ్తడు. నిత్య చైతన్య శీలంగా ఉంటడు. ప్రభంజన్ తానే చెప్పుకున్నట్లు సామాజిక ప్రయోజనం లేని రచన చేయొద్దని నమ్మిండు, రాసి నిరూపించిండు. ఒక్కో రచనకు ఒక్కో సామాజిక ప్రయోజనాన్ని సాధించిండు.
అందుకే ‘గొల్ల కురుమల సంస్కృతి గొప్ప సంస్కృతి’ అంటూ సబ్బండ జాతులకు ఆత్మగౌరవ ప్రబోధం చేసిండు. గొల్ల కురుమల ‘డోలుదెబ్బ’ తో అగ్రకులాధిపత్యాన్ని ‘అబ్బా’ అనిపించిండు. ‘నడుస్తున్న చరిత్ర’కు నకలుగా తన ‘పెత్తనం’తో దళిత బహుజనుల రాజ్యాధికారానికి బాటలు వేసిండు. ‘లేబర్ బట్ హిపోక్రైట్’ ద్వారా మూలవాసుల ముతక వాసనని పోగొట్టుకోవాలని చెప్పిండు. తన ‘ఆంతర్యం’ ఏంటో ఎలుగెత్తిండు. ‘కాసుల జ్ఞానం’ ద్వారా బహుజనులకు బతుకు జ్ఞానాన్ని అందించాలనుకున్నడు. ‘బుద్ధిజీవి ఎదురీత’ని ఎదిగి వస్తున్న బహుజన పొల్లగాండ్లకు కెరీర్ గైడెన్స్ గా మలిచిండు.
అంతేకాదు, ప్రభంజన్ నిరంతరాయంగా ‘ది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్’కి ‘గొంతు’ అయిండు. ‘రీచింగ్ ది అన్ రీచ్’ కి తానే ‘చేరువ’ అయిండు. ఎలాంటి సవాల్ నైనా చాలెంజ్ గా తీసుకుని తాను ‘బియాండ్ ఛాలెంజెస్’ అయిండు. కాన్షీరామ్ వివిధ భాషల్లో పెట్టించిన 8 పత్రికలు మూత పడిన విషయాన్ని తెలియపరుస్తూ జర్నలిస్టుగా, బహుజనులకు బలమైన మీడియా ఉండాలని ‘బహుజన్ మీడియా ది నీడ్ ఆఫ్ ది అవర్’ అంటూ తెలివి పరుస్తున్నడు. ‘క్వశ్చన్ ఎవర్’ అంటూ తన ప్రజలందరికీ కర్తవ్య బోధన చేస్తున్నడు. ఎవరేమనుకున్నా, అవాంతరాలు ఎన్ని ఎదరైనా తన పథం ‘ప్రభం’ ‘జన’ ‘పథం’ అంటున్నడు. ఇప్పుడు కచ్చితంగా ప్రభంజన్ మూల వాసుల ఎజెండా అయిండు. ఎర్ర కోటపై రెపరెపలాడాల్సిన దళిత బహుజనుల ‘జెండా’ అయిండు.
‘మేధావిలా ఆలోచించు. సామాన్యుడిలా జీవించ’మనే గిట్లాంటి ప్రభంజనన్నకు జన్మదినం వేడుక కాదు. వేదిక కాదు. కాలగర్భంలో కలిసి పోయే ఓ మైలు రాయి మాత్రమే. జన్మ దినానికి జన్మ దినానినికి మధ్య ఏం సాధించామన్నదే ముఖ్యమనే ప్రభంజన్ ఏదైనా సాధించగల కార్య‘శూర్యుడు’, కార్య శీలుడు. ‘కను తెరిస్తే జననం… కనుమూస్తే మరణం, రెప్పపాటుదే జీవితం’. ఆ రెప్పపాటు జీవితాన్ని ఓ ప్రభంజనం చేసి వెళ్ళిండు. మీకు సాధ్యమైతే ఆ ప్రభంజనంతో కలిసి పోరాడండి. లేదా ఆ ప్రభంజనంలో కలిసి పొండి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప!


