ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం. అలంకరణగా ఉండేది. ఇగ యెనకటికి ముగ్గులను బియ్యప్పిండి, ముగ్గు రాళ్ల పిండి లేకపోతే సుద్దతోటి యేసేటోల్లు. ఇగ రాను రాను గా పిండితోటి యేసుడు మానేసినం. ఇగ సుద్ద దొరకక, శాక్ పీసులతోటి ముగ్గులు గీయబడితిమి. కనీ, గా బియ్యపు పిండితో ముగ్గేస్తే ఎంత మంచిదో తెలుసా?

గా బియ్యపు పిండితోటి వాకిట్ల ముగ్గేస్తిమా అందంగా ఉంటది. ఇగ గా పిండిని గా శీమెలు, శిన్నశిన్న ప్రాణులు, పశు పచ్చాదులు తినేటివి. గవాటికి ఇంత తిండి దొరికేది. ఇగిప్పుడేసే ముగ్గులతోటి ఎవ్వలికి ఏం లాభం లేకపాయె. ఇగో గీ మద్దెల పిండితోటి ముగ్గులేస్తే, ఊరబిశ్కెలు, పిట్టలు, పావురాలు, శీమెలు వచ్చి గా ముగ్గును తినబట్టినయి. ఇగ గయి తింటాంటే ఒకాయినె ఫోటువలు, యీడియోలు తీసి నెట్టింట్ల పెట్టిండు. గవాటికి ఒకటే లైకులు కొట్టబట్టిండ్రు. కనీ, మన ఇండ్లల్ల గూడ పిండితోటి ముగ్గులేయాల్నని మన ఆడోల్లకు శెప్పుండ్రి. పాపం గా శిన్న శిన్న ప్రాణులైనా బత్తయి.

