సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు
చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో వ్యోమగాముల ‘ఒరాయన్’ క్యాప్సూల్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5:38 గంటలకు ల్యాండ్ అయింది. ఈ మిషన్‌లో అమెరికాకు చెందిన రీడ్ వైట్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ పాల్గొన్నారు. గతంలో అపోలో-13 నెలకొల్పిన రికార్డును అధిగమిస్తూ, భూమి నుండి సుమారు 4,06,771 కిలోమీటర్ల సుదూర ప్రాంతానికి ప్రయాణించిన తొలి మానవసహిత మిషన్‌గా ఆర్టెమిస్-2 సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 1న ప్రయోగించిన ఈ నౌక చంద్రుని అవతలి వైపు దృశ్యాలను, అరుదైన ఖగోళ విశేషాలను చిత్రీకరించింది. ఈ విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ, వ్యోమగాములను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. మానవ పరిణామంలో తదుపరి అడుగు అంగారక గ్రహం అని ఆయన ఆకాంక్షించారు. మూడు భారీ పారాచూట్ల సాయంతో జరిగిన ఈ ‘పర్ఫెక్ట్ ల్యాండింగ్’ వీడియోలను నాసా విడుదల చేస్తూ, వ్యోమగాములకు ఘనస్వాగతం పలికింది.


