సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక పోలీసోల్ల లెక్క పట్టుకునుడు కాదుల్లా..! ఏకంగా దొంగలు దొంగతనం శేత్తాంటనే పట్టుకునే కెమెరాల్ని ఎక్కడన్నా సూసిండ్రా? శెప్తా సూడుండ్రి!

ఒక దుకాణంల దొంగలు పడ్డరు. ఇగ దబ్బ దబ్బ లోపల దూరిండ్రు. ఆల్ల పని మొదలు పెట్టిండ్రో లేదో.. గా సీసీ కెమెరాలు గూడ వాటి పని మొదలు పెట్టినయి. గవాళ్ళు లోపలకు రావంగనే గా సీసీ కెమెరాల నుండి ఘాటైన పొగ వచ్చుడు మొదలైంది. సిడెం సేపట్లనే గది గా గదంతా గుప్పుమన్నది. ఇగ గా దొంగల కండ్లు మండి, మూర్చపోయినంత పనైంది. గీ లోగనే గా దుకాణపాయినె రానే వచ్చె! ఇగ గా దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించె!! ఇగో గియి కొత్త రకం సీసీ కెమెరాలన్నట్లు. గయి దొంగల్ని సూడంగనే ఒక రకమైన పొగని సూరిత్తయి. గా పొగతోటి గా దొంగలు మూర్చపోతరు. గీ కెమెరాలు ఎంత మంచిగున్నయో కదా?

