మహిళలు అన్ని రంగాల్లో విప్లవాత్మక విజయాలు సాధిస్తున్న ఈ కాలంలోనూ, భారత మహిళల స్థితి పూర్తిగా మారి, ఆ స్థితికి చేరిందని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరిక్షం నుంచి రాజకీయాల వరకూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, సాధారణ మహిళలు భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. నేటికీ మహిళలు ఒంటరిగా ప్రయాణించలేని పరిస్థితులు, స్వేచ్ఛగా జీవించలేని దుస్థితి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సమాజం సాధించిన అభివృద్ధికి పెద్ద ప్రశ్న మాత్రమే కాదు. పెను సవాల్ కూడా.
సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది. పనిప్రదేశాలు, అన్ని రంగాల్లో పురుషుల పెత్తనమే కనిపిస్తోంది. మహిళలకు అధికారం దక్కినట్టు కనిపిస్తున్నా, అది వాస్తవంలో ఉండటం లేదు. పాలనలో మహిళలు ఉన్నా, మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకునే స్థాయికి ఆ అధికారం ఉపయోగపడడం లేదు. మమతా బెనర్జీ లాంటి మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోనూ నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి అక్కడ కూడా ఉంది. ఇది మహిళలకు అధికారం ఇచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవ్వవని, ఆ అధికారాన్ని ప్రజల తరఫున వినియోగించే దృక్పథం కీలకమని స్పష్టం చేస్తోంది. మహిళలు, చిన్నపిల్లలను గౌరవించే సమాజం ఏర్పడే వరకు, వారికి సంపూర్ణ రక్షణ కల్పించే వరకు ఈ పోరాటం ఆగకూడదు.
ఈ నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత 14వ మహాసభలు జనవరి 24-28 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 1981లో మార్చిలో చెన్నై వేదికగా ఐద్వా స్థాపించబడింది. దేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పోరాడే ఈ సంస్థకు 23 రాష్ట్రాలలో 1.1 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఇది సీపీఐఎం కి అనుబంధంగా పనిచేస్తున్నప్పటికీ స్వతంత్ర మహిళా ఉద్యమ వేదికగా గుర్తింపు పొందింది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహ హింస, వరకట్నం, అత్యాచారాలు, రాజకీయ అణచివేత వంటి సమస్యలపై ఐద్వా నిరంతరం పోరాడుతుంది. అణగారిన వర్గాల మహిళల కోసం గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పనిచేస్తున్న అతిపెద్ద మహిళా సంస్థలలో ఐద్వా ఒకటి.
తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ముందుకు సాగిన రైతు మహిళల నేలలో జరగనున్న మహాసభలు మహిళా ఉద్యమానికి దిశానిర్దేశం చేసే వేదికలుగా మారాలి. ఈ సందర్భంగా ఐద్వా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘మనువాద’ నినాదాన్ని నిర్మూలించే భావనను సగటు మహిళకు అర్థమయ్యేలా వివరించాలి. ఇది కేవలం లెఫ్ట్ పార్టీల మహిళా సంఘం అన్న ముద్రను చెరిపేసి, అన్ని వర్గాల మహిళలకు అండగా నిలవాలి.
‘మహిళలంతా ఒక్కటే’ అన్న సమభావన ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే మహిళల గొంతు మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కాదు, సమాజంలోనూ కలసికట్టుగా నినదించే స్థాయికి రావాలి. అసంఘటిత రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా చేసిన పోరాటాలు ప్రేరణగా నిలవాలి.
సోషల్ మీడియా విస్తరణతో మహిళల వ్యక్తిత్వ హననం మరింతగా పెరిగింది. అశ్లీలత, ట్రోలింగ్, వేధింపులు సాధారణమయ్యాయి. సినిమాల్లో మహిళలను అవమానకరంగా చూపించే సన్నివేశాలపై, సోషల్ మీడియాలో మహిళల హక్కుల దుర్వినియోగంపై ఐద్వా స్పష్టమైన పోరాటం చేయాలి. సమస్య ఏదైనా, మహిళల తరఫున ఐద్వా నిలబడుతుందన్న నమ్మకం కలగాలి.
33 శాతం మహిళా రాజకీయ రిజర్వేషన్లు హక్కుగా తక్షణం అమల్లోకి రావడానికి ఐద్వా నాయకత్వం వహించాలి. పార్లమెంటు, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. కానీ అది కేవలం కార్పొరేట్, ఉన్నత వర్గ మహిళలకే పరిమితం కాకుండా, నిమ్న, బడుగు, బలహీన వర్గాల మహిళల చేతికి అధికారం చేరేలా పోరాటం సాగాలి.
స్త్రీ విముక్తి సమాజ విముక్తితో ముడిపడి ఉందన్న అవగాహన పెరగాలి. మహిళను వంటగదికి, సంతాన ఉత్పత్తికే పరిమితం చేసే ఈ వ్యవస్థపై తిరుగుబాటు రావాలి. అభ్యుదయ ఆలోచనలతో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ, ఐద్వా తన పరిధిని విస్తరించి ప్రతి మహిళకు ఒక బలమైన గొడుగుగా మారాల్సిన అవసరం ఉంది. అదే మహిళా శక్తికి నిజమైన చిరునామా అవుతుంది.

