భారతీయ జీవన, విద్యావిధానం ఒకప్పుడు మనిషి మేధస్సుకు పదును పెట్టి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్లేలా ఉండేది. అన్ని రంగాల్లో విద్యార్థులను ఆరితేరేలా చేసే సమగ్ర విద్యా విధానం మనదే! కానీ, కాలక్రమేణా ఆ వ్యవస్థను మనమే కాల గర్భంలో కలిపేస్తున్నాం. బ్రిటిష్ పాలనలో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం భారతీయ విద్యా తత్వాన్ని దెబ్బతీసింది. ఫలితంగా నైపుణ్యాలు, విలువలు లేని విద్యార్థులు పెద్ద సంఖ్యలో తయారవుతున్నారు. చదువున్నా ఉపాధి లేదు. డిగ్రీలున్నా దిశా దెశా లేదు. ఇదే నేటి దుర్భర వాస్తవం.
దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అవకాశాలు విస్తారంగా ఉన్నప్పటికీ బీటెక్, ఎంటెక్ వంటి డిగ్రీలు చదివిన యువత ఆ రంగాల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. చదువు వేరు, వృత్తి వేరు అన్న దృక్పథం యువతలో బలంగా పాతుకుపోయింది. భారతీయ మేధస్సు అపారమని ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం, సైన్స్ రంగాల్లో మనవాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ అలాంటి మానవ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకునేలా విద్యావిధానం రూపుదిద్దుకోలేదు.
సమాజంలో విలువలు పడిపోవడం, యువతలో నైపుణ్యాల కొరత మన విద్యావిధాన లోపాలే. అత్యాధునిక సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మేధస్సుపై తీవ్రంగా పడుతోంది. ప్రతి చిన్న విషయానికీ గూగుల్‌ను ఆశ్రయించడం అలవాటైంది. గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోయి చదువుకూ, ఆలోచనకూ దూరమవుతున్నారు. యువతలో పోర్న్ వ్యసనం, ఆన్‌లైన్ జూదాలు, మానసిక ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యల వరకూ వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగత సమస్య కాదు. ఇది ఒక సామాజిక రుగ్మతగా మారింది.
ఈ పరిస్థితిని మార్చాలంటే అక్షరాభ్యాసం నుంచే క్రమశిక్షణను అలవర్చాలి. విద్యారంగాన్ని బలోపేతం చేసి విలువలతో కూడిన విద్యను అందించాలి. లేకపోతే సమాజం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేటి తల్లిదండ్రులు చిన్న పిల్లలను బుజ్జగించడానికి, అన్నం పెట్టడానికి కూడా సెల్‌ఫోన్‌ను చేతికిస్తున్నారు. ఫలితంగా పిల్లల్లో మానసిక పరిపక్వత తగ్గి, తరగతి గదుల్లో పరధ్యానంగా మారుతున్నారు. ఆటస్థలాల్లో చురుకుదనం తగ్గి, ఒంటరితనం పెరుగుతోంది.
పాఠశాలల్లో కూడా బోధన యాంత్రికంగా మారింది. స్క్రీన్ల ద్వారా పాఠాలు చెప్పడం పెరిగిపోయింది. పిల్లలు టీచర్లతో సంభాషించడం మానేసి, పరస్పర అవగాహన కోల్పోతున్నారు. పుస్తక పఠనం తగ్గింది. పరిసరాలపై అవగాహన లేకుండా, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా చదువులు పూర్తిచేసి పట్టాలు పుచ్చుకుంటున్నారు. మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుందో, పాలు ఎలా వస్తాయో కూడా తెలియని తరం తయారవుతోంది.
సెల్‌ఫోన్ వ్యసనానికి తోడు జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతోంది. టీనేజర్లలో ఆత్మహత్యా ప్రయత్నాలు పెరిగాయి. అధ్యయనాల ప్రకారం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూ లైట్ ప్రభావం, నిద్రలేమి, ఆటలు ఆడకపోవడం మనమే తెచ్చుకున్న సమస్యలు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ విద్య పిల్లలను మరింతగా ఫోన్లకు బానిసల్ని చేసింది. ఇప్పుడు కోవిడ్ లేకపోయినా ఆ అలవాటు మాత్రం కొనసాగుతోంది.
టెక్నాలజీ అవసరం కాదనలేం. కానీ, దానికీ ఓ పరిమితి ఉండాలి. అదే జీవితం కాకూడదు. చిన్నప్పటి నుంచే పిల్లలను టెక్నాలజీకి అతుక్కుపోయేలా చేయడం వారిని బడి, కుటుంబం, చివరకు స్వతంత్ర ఆలోచనల నుంచే దూరం చేస్తోంది. పిల్లల్లో మానసిక పరివర్తన, పరిపక్వత రావాలంటే సమతుల ఆహారం, వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరి. మన ప్రాచీన జీవన విధానాల్లో ఉన్న సౌలభ్యం, సమతుల్యతను మళ్లీ మనం పాటించాలి.
ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా విద్యను చూడాలి. పాఠశాలల్లో పెరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకోవాలి. కానీ అంతకన్నా ముందు తల్లిదండ్రులే మారాలి. ఈ బిజీ జీవితంలో పిల్లల కోసం సమయం కేటాయించాలి. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. లేదంటే మన పిల్లల భవిష్యత్తే కాదు, మన సమాజపు పునాది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులూ… తస్మాత్ జాగ్రత్త! ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, రేపు పశ్చాత్తాపంతో కూడా పని ఉండదు.

