తెలంగాణ రాజకీయాలు ప్రజల అవసరాలు, రాష్ట్ర లక్ష్యాలకన్నా, అధికార లాలసకే పాకులాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వలాభం కోసం పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతున్నాయి. ప్రజలకు మేలు చేయాల్సిన రాజకీయ వ్యవస్థ, అదే ప్రజలను తమ రాజకీయ క్రీడలో పావులుగా మార్చే నీచ స్థాయికి దిగజారిందన్న భావన బలపడుతోంది.
బీఆర్‌ఎస్ పాలన ముగిసి రెండేళ్లు దాటుతున్నా, అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణలేమీ తేల్చకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం నుంచి కూకట్ పల్లి భూకబ్జాల వరకు, అక్రమ లావాదేవీలు వంటి తీవ్రమైన అంశాలు ప్రజల చర్చలో ఉన్నప్పటికీ, వాటిపై స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప, అవినీతి రుజువై, న్యాయం గెలిచిందన్న భావన ఎక్కడా కనిపించడం లేదు. పదేపదే బీజేపీ ఆరోపిస్తున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహనేమైనా ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నది విస్తృతంగా వినిపిస్తున్న మరో అంశం. ‘బంగారు తెలంగాణ’ నినాదం, చివరకు ‘బాకీల తెలంగాణ’గా మారిపోయింది. అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు, అవి ఖర్చైన తీరుకు ఏలికలెవరూ బాధ్యత వహించడంలేదు. ఒక ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శంచడానికే పరిమితమవుతే, ప్రజలకు ఒరిగేదేంటి? కేవలం నిరాశ తప్ప.
ఇక బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై దుమ్మెత్తిపోస్తోంది. సరే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర పురోగతికి చేస్తోందేంటి? నిర్దిష్టంగా రాష్ట్రాభివృద్ధికి చేసిందేంటన్నది ఆ పార్టీ పనితీరుకు కొలమానం కానుంది. తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీకి పోరాటమే లేదు.
ఇక బీఆర్‌ఎస్ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసిఆర్ కుమార్తె కవిత, ఆపార్టీ నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి కూకట్‌పల్లి భూకబ్జాల వరకు ఆమె ఎత్తి చూపుతున్న అంశాలు బీఆర్‌ఎస్ పాలనలోని అవినీతి, బంధుప్రీతి, లోపాలను తిరిగి చర్చల్లోకి తెస్తున్నాయి. అయితే కవిత, తాను ‘కడిగిన ముత్యాన్న’ని నిరూపించుకునే ప్రయత్నం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతోంది. లిక్కర్ స్కామ్ కేసు కవిత రాజకీయ భవిష్యత్తుపై మాయని మచ్చగా మిగిలింది. కన్నవారిల్లు కాదన్న ఈ సమయంలో రాజకీయ మార్గమే ఏకైక దారిగా ఆమె ఎంచుకున్నట్లుంది. కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌ను మరింత బలహీనపరుస్తుండగా, కాంగ్రెస్‌కు అనుకోని లాభంగా కలిసివస్తోంది.
ఇదే తరుణంలో వారసత్వ రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీల్లోనూ కొనసాగుతున్నాయి. ఒకే కుటుంబం, ఒకే కుల ప్రాబల్యంతో పాలన సాగితే, ఆ పార్టీకి, ఆ కులానికే నష్టం కలిగిస్తుందనడానికి బీఆర్‌ఎస్ ఉదాహరణగా నిలిచింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా, పాలనలో స్పష్టత, పారదర్శకత, ప్రజల నమ్మకం పెంచే చర్యలు చేపట్టాలి. అప్పులపై శ్వేతపత్రం, అవినీతి ఆరోపణలను కాలపరిమితితో తేల్చే విచారణలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం వంటివి ప్రజలు ఆశిస్తున్న కనీస చర్యలు.
రాజకీయాలు కేవలం అధికారం, నాయకుల కోసమే కాదు, ప్రజల కోసం కూడా. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి, అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకు బలి చేయడాన్ని చరిత్ర క్షమించదు. ప్రజలు కూడా వదలరు. ఈ తరహా రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ప్రజలే చైతన్యవంతులవ్వాలి. ప్రశ్నించాలి. బాధ్యత కోరాలి. అవసరమైతే అలాంటి రాజకీయ పార్టీలను, నాయకులను తిరస్కరించాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ప్రజలే.

