భారతదేశంలో పేదరిక నిర్మూలన నిరర్ధక ప్రయాసగా మారింది. శాస్త్రీయ ప్రమాణాలులేని కాకిలెక్కలుగా మిగిలిపోయింది. పేదరికం, పేదలు రాజకీయాలకు ఇరుసు, ఇంధనంగా నాయకులు గ్రహించారు. పేదల పేరుతో పథకాలు ప్రకటించడం, వాటి అమలు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచేయడం, తద్వారా ఓట్లుగా మలచుకోవడం రాజకీయ క్రీడగా నిరంతరం కొనసాగుతూనే ఉంది.
ఇటీవల ఉపాధి హామీ పథకం పేరు మార్పు చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ తెలిసిందే. ఆ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై అన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. అసలు సమస్య పథకం పేరులో ఉందా? లేక దాని అమలులో ఉందా? అన్న విచక్షణ లేకుండా రాజకీయాలు చేయడం గమనార్హం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిజమైన నిర్మాణాత్మక పనులే జరిగాయా? అంటే దాదాపుగా లేదు. మట్టి ఎత్తిపోసే పనులు తప్ప, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనులు కనిపించలేదు. వేల కోట్లు మట్టిపాలైనా, వ్యవసాయ పనులకు కూలీల కొరత పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇదే పథకంతో కేంద్ర ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని గొప్పగా ప్రకటిస్తోంది. నిజంగా అలా జరిగి ఉంటే, ఉచిత బియ్యం, ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ వంటి పథకాలెందుకు? ఒకవైపు పేదరికం తగ్గిపోయిందని చెబుతూనే, మరోవైపు పేదల పేరుతో పథకాలు సాగిస్తుండటం పాలకుల ద్వంద్వ వైఖరికి పరాకాష్ట.
ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం భారత్‌లో పేదలు కేవలం 5.25 శాతం మాత్రమే! రోజుకు తలసరి ఖర్చు రూ.62 కంటే తక్కువగా ఉన్నవారే పేదలని ఆ సంస్థ నిర్ణయించింది. అలాగే, నీతి ఆయోగ్ కూడా 2022–23 నాటికి దేశంలో నిరుపేదలు 5 శాతం మాత్రమే ఉన్నారని ప్రకటించింది. గ్రామాల్లో రోజుకు రూ.57, పట్టణాల్లో రూ.69 ఆదాయం ఉంటే పేదలు కాదన్నదే వారి ప్రమాణం. ఈ లెక్కన చూస్తే ఆ ఆదాయంతో ఆహారం, వైద్యం, దుస్తులు, రవాణా, అద్దె వంటి అవసరాలు తీర్చుకోవడం అసాధ్యం. ఈ ప్రమాణాల ప్రకారం జీవించగలిగేవారు ఇల్లు లేని బిచ్చగాళ్లే కావాల్సి వస్తుంది.
ఇలాంటి తప్పుడు లెక్కల తక్కెడ ఆధారంగా మరో ఏడాదిలో దేశంలో పేదలేరని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాస్తవంలో పెరుగుతున్న విద్య, వైద్య ఖర్చులు కోట్లాదిమందిని పేదరికంలోకి నెడుతున్నాయి. కనీస పౌష్టికాహారం కూడా అందని పరిస్థితుల్లో ప్రజలు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. పౌష్టికాహార ప్రమాణాలను ఆధారంగా తీసుకుని పేదరిక స్థాయిని నిర్ణయిస్తే, ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మూడింతలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఆ స్థాయికి దిగువన ప్రస్తుతం దాదాపు 65 శాతం ప్రజలు ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి.
ప్రపంచ బ్యాంక్ రోజుకు 3 డాలర్లు పేదరిక స్థాయిగా నిర్ణయించినా, వాస్తవ మారకపు విలువ ప్రకారం లెక్కించకుండా, అధికారిక లెక్కలకు దగ్గరగా ఉండేలా సవరణలు చేస్తోంది. ఈ విధానం అనేక దేశాల్లో పేదరికాన్ని కృత్రిమంగా తగ్గించి చూపించడానికి ఉపయోగపడుతోంది. ఇలాంటి లెక్కలతో ప్రజల జీవన వాస్తవాలను అవహేళన చేయడమే జరుగుతోంది.
పేదరిక నిర్మూలన అంటే కేవలం కూడు, గూడు, గుడ్డ అందించడమే కాదు. బతకడానికి పని ఉండాలి, ఆ పని ద్వారా కుటుంబాన్ని పోషించగలిగే ఆదాయం రావాలి. కానీ ఈ అంశాలు ఏ లెక్కల్లోనూ చోటు దక్కించుకోవడం లేదు. కాలానుగుణంగా మారుతున్న కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పాత ప్రమాణాలతోనే పేదరికాన్ని కొలవడం అర్థరహితం. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో అందిన విద్య, వైద్యం ఇప్పుడు ప్రైవేటు రంగానికి వెళ్లిపోయాయి. వాటి ఖర్చులు సామాన్యుడికి భరించలేనివిగా మారాయి.
జాతీయ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా తలసరి పౌష్టికాహార లభ్యత వేగంగా తగ్గుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించి పేదరికం తగ్గిందని చెప్పుకోవడం ఆత్మవంచనతో సమానం. నిజమైన పేదరిక నిర్మూలన కోసం దుర్భర దారిద్యంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారికి స్థిరమైన ఉపాధి, నాణ్యమైన విద్య, చౌకైన వైద్యం అందించే స్పష్టమైన విధానాలు అవసరం. లెక్కల మాయాజాలంతో పేదరికం అంతరించిందని చెప్పుకోవడం దేశానికి మేలు కంటే కీడే చేస్తుంది.

