ఇండియన్స్ కి అమెరికా డ్రీమ్ ల్యాండ్. ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనావకాశాలు, ఉద్యోగావకాశాలు అమెరికాను ముఖ్య గమ్యస్థానంగా మార్చాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా వీసాల జారీని క్లిష్టంగా, భయానకంగా మార్చేశాయి. కఠిన నిబంధనలు, అర్థంలేని ఆంక్షలు, సోషల్ మీడియా వెట్టింగ్, విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న అనుమానాలు భారతీయ విద్యార్థుల ఆశలను అడియాశలు చేశాయి.
అమెరికాలో చదవాలన్న ఆశతో లక్షలాది మంది విద్యార్థులు అర్హత పరీక్షలు రాస్తారు. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో కరోనా టైమ్ ని మించి విద్యార్థులు చరిత్రలో అతి తక్కువ స్థాయిలో దరఖాస్తులు చేసుకున్నారు. సాధారణంగా మార్చి నుంచి జూలై వరకు అమెరికా వీసా సీజన్ అత్యంత కీలకం. ఫాల్ సెమిస్టర్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ సమయంలో వీసాల కోసం పెద్ద ఎత్తున అప్లై చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో ఎఫ్–1 వీసాల జారీ 27 శాతం తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయంలో 14,987 వీసాలు ఇవ్వగా, ఈ ఏడాది కేవలం 9,906 మాత్రమే జారీ చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రయాణాలు పునః ప్రారంభమైన 2022లో జారీ చేసిన 10,894 వీసాలతో పోల్చినా ఈ ఏడాది సంఖ్య దానికంటే కూడా తక్కువే. ఒకప్పుడు కలల సౌధమైన అమెరికా, ఇప్పుడు భారతీయ విద్యార్థుల కల్లల సౌధంగా మిగిలిపోయింది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకుంటున్న విదేశీ విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలే. పాలస్తీనా కలహాలకు మద్దతుగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పబ్లిక్ చేయాలని ఆదేశించడం, వీసా అప్లికేషన్‌లకు రెండు వారాలు పూర్తిగా బ్రేక్ వేయడం వంటి చర్యలు అంతర్జాతీయ విద్యార్థుల్లో అనిశ్చితిని పెంచాయి. ముఖ్యంగా ‘సోషల్ మీడియా వెట్టింగ్’ పేరుతో విద్యార్థుల వ్యక్తిగత జీవితం, భావ వ్యక్తీకరణలను పరిశీలించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య దేశానికి అసమంజసం. మే 27 నుండి జూన్ 18 వరకు వీసా దరఖాస్తులను నిలిపివేయడం వల్ల అప్లికేషన్ల సంఖ్య మరింత తగ్గిపోయింది.
అమెరికా యూనివర్సిటీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కోతలు విధించడం మరో కోణం. అంతర్జాతీయ విద్యార్థులతో వచ్చే ఆదాయం తగ్గుతుందనే భయంతో యూనివర్సిటీలు కూడా అస్పష్టంగా ఉన్నాయి. విదేశీ విద్యార్థుల ఫీజులపై అమెరికా యూనివర్సిటీలు ఎక్కువగా ఆధారపడతాయి. కానీ ప్రభుత్వమే వారికి అడ్డంకులు పెడుతుండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతోంది.
ఒకప్పుడు చైనాను మించి అమెరికాలో అత్యధికులుగా ఉన్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. 2023–24 అకడమిక్ ఇయర్‌లో అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో అదే వీసా సంఖ్య భారీగా పడిపోయింది. 2023లో 1.03 లక్షల ఎఫ్–1 వీసాలు ఇవ్వగా, 2024లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 మాత్రమే జారీ చేశారు.
ఈ పరిణామాలు అమెరికాలో చదవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు గట్టి హెచ్చరిక. వీసా నిరాకరణలు పెరగడం, ఇంటర్వ్యూలలో కఠిన ప్రశ్నలు, కొత్త ఆంక్షలు వంటివన్నీ విద్యార్థుల మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. అర్హత ఉన్నా, అడ్మిషన్ ఉన్నా వీసా లభిస్తుందనే హామీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం విదేశీ విద్యాభ్యాసం కోసం అమెరికా మీద ఆధారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ఇండియన్ యూనివర్సిటీల్లో గ్లోబల్ స్థాయికి దగ్గరగా ఉండే కోర్సులు, పరిశోధన వాతావరణం, అంతర్జాతీయ ప్రమాణాలు పెంచాలి. విశాల ప్రపంచంలో దేశాల మధ్య దూరం, అంతరం తగ్గిపోతున్న తరుణంలో అమెరికా కుత్సిత ఆలోచనలు మానాలి. విద్యను వ్యక్తిగత, రాజకీయాల బారిన పడనీయకూడదు. విద్యార్థులు దేశాల మధ్య సామాజిక, సాంస్కృతిక సారథులు, వంతెనలు. వారిపై ఆంక్షలు విధించడం అమెరికా సహా, భవిష్యత్ తరాలకు తీరని నష్టం. విద్యకు కావాల్సింది ఆటంకాలు కాదు, అవకాశాలు.

