దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ, అమిత్ షా ఎత్తుల ముందు చిత్తవుతోందా? నాయకత్వ లోపమా? సమన్వయ శాపమా? మేధోమథనం లేకపోవడమా? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ కు ఏమైంది? ఇవి ఆ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. అంతర్మథనాలు.
కాంగ్రెస్ వరుస వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను ఎజెండా చేయడంలో, వాటిపై పోరాటడంలో, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ బాగా వెనుకబడిపోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ చేపట్టిన బాధ్యతల్లో ఈ స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై, అధికారాన్ని సాక్షాత్కారం చేసే సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన లేదన్న విమర్శలు నిరంతరాయంగా వినిపిస్తునే ఉన్నాయి. మోదీ లాంటి ఉద్ధండ నేతను, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీయాలంటే స్పష్టమైన ఎజెండా అవసరం. కానీ రాహుల్ చేతిలో అలాంటి దిశా నిర్దేశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. పార్లమెంట్‌లో గడువు లేకుండా రచ్చ చేయడం, నినాదాలతో రాజకీయాలు నడపడం, వంశపారంపర్య నాయకత్వంపై ఆధారపడటం వంటి చర్యలు కాంగ్రెస్‌ను మరింత బలహీన స్థితికి నెడుతున్నాయి.
గత పుష్కరకాల యూపీఏ పాలనలో జరిగిన పొరబాట్లను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్రలు చేసినా, రాజ్యాంగ ప్రతిని ఎత్తిచూపినా, ‘సర్’ని ఎత్తుకున్నా, మహా గఠ్ బంధన్ కూటములు కట్టినా పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. మేలు జరగలేదు. ప్రధానంగా పార్టీకి కేంద్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభం, నిర్ణయాత్మక, స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం లేకపోవడం వల్ల ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గింది. తీవ్రమైన అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లోపించడం, ఎన్నికల వ్యూహాల్లో వైఫల్యాలు వంటివన్నీ పార్టీ ప్రభావాన్ని నీరుగారుస్తున్నాయి. ప్రధానంగా 2014, 2019, 2024 సాధారణ ఎన్నికలలో పార్టీ సాధించిన బలహీన ఫలితాలు, ఆ పార్టీని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టలేకపోయాయి. అదనంగా, యువ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవడం ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి.
కర్నాటకలో సీఎం పదవి విషయంలో సిద్దరామయ్య–డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కూడా హైకమాండ్ బలహీనంగా మారింది. ఖర్గే అధ్యక్షుడైనా, రాహుల్ మార్గనిర్దేశం ఉన్నా స్పష్టమైన నిర్ణయాలను సమర్థంగా తీసుకునే వేగం, ధైర్యం కనిపించడం లేదు. గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ అంతర్గత కలహాలే కాంగ్రెస్, కాంగ్రెస్ కూటముల ఓటములకు కారణమయ్యాయి.
పార్టీ కార్యకలాపాలను నాయకత్వం స్వయంగా పర్యవేక్షించడం తగ్గిపోయింది. నిర్ణయాలు విధేయుల చేతుల్లోకి వెళ్లాయి. కేసీ వేణుగోపాల్ వంటి నేతల సూచనలతో ముఖ్యమైన పరిణామాలు జరుగుతుండటం, పెద్ద నేతల మధ్య సమస్యలను పరిష్కరించలేకపోవడం పార్టీ నాయకత్వ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాహుల్ నిజమైన నాయకుడిగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటం చేయాలి. నినాదాలకంటే విధానాలు, పదవుల కేటాయింపులకంటే నైతిక నిర్ణయాలు ముఖ్యం.
కాంగ్రెస్‌కు మరో అవకాశం దక్కాలంటే ముందుగా పార్టీ అంతర్గత వ్యవస్థను బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలను సమర్థంగా సమసేట్లు చేయాలి. ప్రజలతో, ప్రజా సమస్యలతో, ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాజకీయాలు చేయాలి. అధికారంలో లేకపోయినా పటిష్టమైన వ్యూహాలతో ముందుకు సాగగలిగితేనే కాంగ్రెస్ తిరిగి ప్రజల్లో నమ్మకం పొందగలదు.
కానీ, ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది, దృఢమైన నాయకత్వం, సమర్థవంతమైన వ్యూహం, ప్రజలతో సన్నిహిత సంబంధాల పరురుద్ధరణ. ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ బలహీనతలతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ, పూర్వవైభవం దూరమైన స్వప్నంగానే మిగిలిపోతుంది.

