నేరమే రాజకీయమై, చట్టాలు చుట్టాలై, నేరగాళ్ళే రాజ్యమేలుతున్న రోజులివి. నేరగాళ్ళు ఒళ్ళు విరుచుకుని, జబ్బలు చరుచుకుని, తలెత్తుకుని ఊరేగుతుంటే, మంచివాళ్ళు తల దించుకుని తరించిపోతున్న దుర్నీతిలో, దౌర్భాగ్యంగా బతుకులీడుస్తున్న సమయ, సందర్భాల్లో మనం జీవిస్తున్నందుకు సిగ్గుపడాల్సిన దుస్థితిలో ఉన్నాం. అందుకే రాజకీయాల్లో ఉంటూ, పార్టీల్లో చేరిపోయి, పార్టీలు పెట్టుకుని నేరచరితులు నానా హంగామా చేస్తున్నారు. చివరకు కోర్టులకు వెళ్ళినా, జైళ్ళ నుంచి విడుదలైనా చేస్తున్న ఆర్భాటాలు విస్మయం కలిగించకమానవు. అలాంటి వాళ్ల కోసం పోలీసుల హైరానా, మీడియా హడావుడి అవమానకరంగా మారింది.
తమ బలప్రదర్శన కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేంటి? నేర చరితుల హడావుడి దేనికి సంకేతం? సమాజానికి ఏ విలువలను ఆపాదిస్తున్నాం? ముందు తరాలకు ఈ నైతిక విలువలనే బోధిస్తున్నామా?
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
నేరమే రాజకీయమై, చట్టాలు చుట్టాలై, నేరగాళ్ళే రాజ్యమేలుతున్న రోజులివి. నేరగాళ్ళు ఒళ్ళు విరుచుకుని, జబ్బలు చరుచుకుని, తలెత్తుకుని ఊరేగుతుంటే, మంచివాళ్ళు తల దించుకుని తరించిపోతున్న దుర్నీతిలో, దౌర్భాగ్యంగా బతుకులీడుస్తున్న సమయ, సందర్భాల్లో మనం జీవిస్తున్నందుకు సిగ్గుపడాల్సిన దుస్థితిలో ఉన్నాం. అందుకే రాజకీయాల్లో ఉంటూ, పార్టీల్లో చేరిపోయి, పార్టీలు పెట్టుకుని నేరచరితులు నానా హంగామా చేస్తున్నారు. చివరకు కోర్టులకు వెళ్ళినా, జైళ్ళ నుంచి విడుదలైనా చేస్తున్న ఆర్భాటాలు విస్మయం కలిగించకమానవు. అలాంటి వాళ్ల కోసం పోలీసుల హైరానా, మీడియా హడావుడి అవమానకరంగా మారింది.
తాజాగా ఏపీ సీఎం జగన్, హైదరాబాద్‌లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పది నిముషాల హాజరీ కోసం పెద్ద పటాలాలను, వందిమాగథులను వెంటేసుకుని వచ్చారు. వాళ్ళందరి రక్షణ కోసం పోలీసులు ప్రజల్ని తరిమేశారు. మన ఓట్లతో గెలిచి, వీరు ఊరేగడమేంటని అనిపించకమానదు. అసెంబ్లీకి రావడారంరి బాధ్యతగా ఫీల్ కాని నేతకు ఇంత హంగామా అవసరమా? పైగా ఆయనేమన్నా ప్రజాప్రయోజనం కోసం హైదరాబాద్ వచ్చారా? తనపై ఉన్న నేరారోపణ కేసుల్లో నిందితుడిగా హజరవడానికి వచ్చారు. అదే సాధారణ నిందితుల పట్ల పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా? ఏపీలో జగన్ ఎక్కడికి వెళ్ళినా, మందీమార్బలం వెంట కార్లు బారులు తీరి వస్తుండటంతో తరచూ ప్రమాదాలు సంభవించి అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయినా ఆయన వైఖరిలో మార్పు లేకపోవడం విడ్డూరం,
గతంలో కేటీఆర్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇలాగే చేశారు. ఈ కార్ రేసు కేసులో విచారణకు వచ్చినప్పుడు, ఆయన్ని ఏసీబీ అరెస్టు చేస్తుందన్న సందర్భంలోనూ పార్టీ కేడర్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ హడావుడి చేశారు. ఈ నిందితుల నిరపేక్ష వ్యవహారానికి కోర్టులే బ్రేకులు వేయాలి. కనీసం కోర్టుకు విచారణకు వచ్చే సందర్భంలోనైనా ఆంక్షలు విధిస్తే బాగుంటుంది.
అధికారంలో ఉండగా అడ్డదిడ్డంగా సంపాదించడం, ప్రజలను పురుగుల్లా చూడటం, ఓట్ల కోసం దొంగ దండాలు పెట్టడం, అధికారం దక్కగానే అడ్డంగా మెక్కడం, అడ్డమైన సంపాదనతో అధికారాంతమున కూడా హంగామాలు చేయడం దేశ, రాష్ట్రాల రాజకీయాల్లో పరిపాటిగా మారింది. ప్రత్యర్థులను వేధించడమే అధికారం పరమావధి అన్నట్టుగా రాజకీయాలను మార్చిన ఘనత కేసీఆర్, జగన్‌రెడ్డిలకు దక్కింది. ఓటుకునోటు కేసులో పట్టుకుని, జైలులో వేసిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జీర్ణించుకోలేక పోతున్నారు. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావులు ఒంటికాలి విూద లేస్తున్నారు. అసభ్యంగా వాడు, వీడు అని సంబోధిస్తున్నారు. జగన్ కూడా అప్పుడే ఏపీలో అంతా అయిపోయిందన్న మైకంలో మాట్లాడుతున్నారు. ఈ కారణంగానే ప్రజలు తమను గద్దె దించారన్న సంగతిని జగన్, కేసీఆర్‌లు మరచిపోయారు.
అధికారాన్ని దక్కించుకోవడానికి చాలా తొందరలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వీరిద్దరూ సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాతో ఎన్నికల్లో గెలిచిపోవచ్చునన్న భ్రమల్లో బతుకుతున్నారు. ప్రజల్ని తక్కువ అంచనా వేయడం వల్లే తాము ఓడిపోయామని వాళ్లు ఇంకా గుర్తిచడం లేదు. తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని, ఇతరులు అధికారంలోకి వస్తే, అంతా సర్వనాశనం అయిపోతోందని వగలుపోతున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్‌ఎస్ బోల్తాపడింది. బీజేపీ కూడా అతిగా ఊహించుకుని బొక్కబోర్లా పడింది. అయినా బుద్ధి రావడంలేదు.
తమ బలప్రదర్శన కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేంటి? నేర చరితుల హడావుడి దేనికి సంకేతం? సమాజానికి ఏ విలువలను ఆపాదిస్తున్నాం? ముందు తరాలకు ఈ నైతిక విలువలనే బోధిస్తున్నామా? తలదించుకోవాల్సిన వాళ్ళే తలబిరుసుగా ప్రవర్తిస్తే వారిని నిలువరించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. అహంకారపూరిత పోకడలను, చిల్లరమల్లర అల్లర్లు, హడావుడిలను సమాజం హర్షించదని రాజకీయ నేతలు గుర్తించాలి. ప్రత్యేకించి నేరారోపణలతో నిందితులుగా కోర్టులకొచ్చే రాజకీయ నేతల హంగామాను కోర్టులే కట్టడి చేయాలి. నిర్ణీత ఆంక్షలు విధించి అమాయక ప్రజలను రాజకీయ నాయకుల బారి నుండి రక్షించాలి.

