మనిషిలో రాను రాను రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. సమాజంలో అత్యాచారాలు, హత్యలు, హత్యాకాండలు పెచ్చుమీరడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ ఇలా దేశమంతటా అనేక రాష్ట్రాల్లో సభ్యసమాజం తలదించుకునేలా సంఘటనలు జరుగుతున్నాయి. చివరకు చిన్నారి బాలలపైనా కామాంధులు లైంగికదాడులకు పాల్పడడం దారుణం. బాలలపై ఉపాధ్యాయులే లైంగిక దాడికి తెగించడం దుర్మార్గపు చర్య. ఇలాంటి వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదు.
అక్కడక్కడా పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి. వెలుగు చూడనివెన్నో! కులాలు, మతాలు కలవని ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారు. పెళ్ళి కొడుకుల అడ్డు తొలగిస్తున్నారు. భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని, అనైతిక కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని, పిల్లల్ని, పిల్లలు ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని చంపడం వంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయంటే, వాటి పట్ల సమాజంలో భయం లేకపోవడం, చట్టాల్లో లొసుగుల వల్ల ప్రజల్లో ఇలాంటి పైత్యం పరాకాష్టకు చేరుతోంది. సైబర్ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు కొదువే లేదు.
ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయి. అత్యాచార ఘటనపై స్పందిస్తూ, ‘అర్థరాత్రి ఆ అమ్మాయి ఒంటరిగా ఎందుకు బయటకు వచ్చింద?’ని పెడసరంగా ప్రశ్నించారు. ఒక సీఎంగా, అందునా మహిళ అయిన మమత ఇలాంటి విషయాల్లో అలా కనీస ఇంగితం లేకుండా మాట్లాడారు. గత కొన్నేళ్లుగా మహిళలపై నేరాల్లో బెంగాల్, కోల్‌కతా ముందువరసలో ఉంటున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వార్షిక నివేదికలు ఘోషిస్తున్నాయి. దుర్గాపూర్ అత్యాచార దుర్ఘటనను ఖండిస్తూ మహిళలు, విద్యార్థులు, డాక్టర్లు, సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే, దేశమంతా ఆవేదన పెల్లుబికుతుండగా, బాధ్యత కలిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత స్పందన బాధితురాలిని, కుటుంబ సభ్యులను, యావత్ మహిళాలోకాన్ని నివ్వెర పరచింది. ‘రాత్రిపూట క్యాంపస్ నుంచి బయటికి ఎందుకు వెళ్లింది? ఆ సమయంలో ఆమెకు ఏం పని?’ అని సీఎం యక్షప్రశ్నలు సంధించారు. అసహనం వ్యక్తం చేశారు. ‘ఏ సమయంలోనైనా బయటికి వెళ్లడం వ్యక్తుల ప్రాథమిక హక్కు అయినప్పటికీ, స్త్రీలు రాత్రుళ్లు రోడ్లపైకి రాకూడద’ని విరుచుకుపడ్డారు. ‘ప్రతి మహిళ ఇంటి ముందు పోలీసులను కాపలాగా పెట్టలేమం’టూ మహిళా భద్రతపై చేతులెత్తేశారు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ఐక్యూ ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్ పరిసరాల్లో జరిగిన సామూహిక అత్యాచారం బెంగాల్‌లో మహిళా భద్రతా వైఫల్యాన్ని మరొకసారి బట్టబయలు చేసింది. ఒరిస్సాకు చెందిన విద్యార్థిని వైద్య విద్యనభ్యసించేందుకు ఆ కాలేజీలో చేరింది. శుక్రవారం రాత్రి తన స్నేహితునితో కలిసి డిన్నర్‌కు క్యాంపస్ వెలుపలికి వెళ్లగా విద్యార్థినిని మృగాళ్లు అటకాయించి చేతిలోని ఫోన్‌ను లాక్కొని, దగ్గరలోని దట్టమైన చెట్లలోకి బలవంతంగా లాక్కెళ్లి, అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం బయటికి చెబితే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని దుండగులు బాధితురాలిని భయపెట్టారు. ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. కాగా విద్యార్థినిని డిన్నర్‌కు బయటికి తీసుకెళ్లిన యువకుడు మధ్యలోనే పరారయ్యాడని అంటున్నారు. అందుకే అతనిపైనా అనుమానాలు కలుగుతున్నాయి. అత్యాచారంలో ఈ ఫ్రెండ్ పాత్ర తెలియాలంటే పోలీస్ దర్యాప్తు ముమ్మరంగా జరగాలి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని దుర్గాపూర్, కోల్‌కతా, బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్ బెంగాల్‌లో మహిళలకు సరైన భద్రత కల్పించాలని మమత ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిరుడు ఆగస్టులో ఆర్‌జి కర్ హాస్పిటల్లో రాత్రిపూట వైద్య విధుల్లో ఉన్న లేడీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఉదంతం సంచలనమైంది. అయినా బెంగాల్లో మమతా బెనర్జీ పాలనతీరు మారలేదు. మహిళలకు రక్షణ కల్పించడం లేదు. దీనికి తోడు మమత చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ఆటవిక చర్యలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఆర్‌జికర్ హాస్పిటల్ ఘటనలో అసలు నిందితులను వదిలేసి ఓ అమాయకుడిని అందులో ఇరికించేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో సివిక్ పోలీస్ వలంటీర్ సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు పడింది. అసలు నిందితులను వదిలేశారని నేటికీ బాధితురాలి కుటుంబం పోరాడుతూనే ఉంది.
ఆర్‌జి కర్ ఘోరాన్ని మరవకముందే దుర్గాపూర్ దారుణం సంభవించింది. ఈ ఏడాది జులైలో దక్షిణ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థినులపై జరుగుతున్న వరుస అత్యాచారాలు విద్యా సంస్థలు, వాటి పరిసరాల్లో భద్రతా చర్యల డొల్ల తనాన్ని ప్రశ్నిస్తున్నాయి. పటిష్టమైన భద్రత, నిఘా, అప్రమత్తపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
అత్యాచారం వంటి దారుణాలు జరిగినప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసానివ్వాలి. వారిలో ఆత్మవిశ్వాసం కలిగించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలాలి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు భిన్నంగా మాట్లాడటం మాత్రం ఎంతో కాలం అధికారాన్ని నిలపలేవు. పైగా ప్రజల్లో పలచన చేస్తాయి. ఈ మాత్రం మమతకు తెలియవనుకోలేం. కానీ ఆమె మాటలు బాధిత మహిళల్ని మరింతగా బాధకు గురిచేసే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

