పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా, అంతకు మించిన అనుమానాలను కూడా రేకెత్తించింది. బెంగాల్ గవర్నర్‌గా ఆయన పనితీరును ప్రశంసించిన మోడీ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియగానే పొడిగించమో లేదా రాష్ట్రపతిగా ప్రమోట్ చేయడమో జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అవేవీ జరగలేదు. ఒకప్పుడు అద్వానీని రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. కానీ రామ్‌నాథ్ కోవింద్‌ను తెరపైకి తెచ్చి అద్వానీని అవమానించారు. ఈ దేశానికి ప్రధాని కావాలని ప్రగాఢంగా విశ్వసించి పార్టీ కోసం కృషి చేసిన అద్వానీకి మోడీ మెండి చేయి చూపాడు. దాంతో అద్వానీ శకం ముగిసింది. మురళీమనోహర్ జోషి జోష్ లేకుండా పోయింది. పాతతరంలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు మాత్రమే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఉన్నారు. వెంకయ్యను పార్టీ నుంచి తప్పించే క్రమంలో ఉపరాష్ట్రపతిని చేసి, ఆ పదవి ముగిసిన వెంటనే ఆయనను వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఆ వంతు ధన్‌ఖడ్ కు వచ్చినట్లుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్ ఖడ్ రాజీనామాను రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఈ ఆమోదమే పలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ధన్ ఖడ్ పేర్కొన్నప్పటికీ, రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని, మరేవో ఉన్నాయన్న అనుమానాలను పలువురు రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను తన పదవిని వదులుకుంటున్నట్లు ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.
అయితే మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా అన్న చర్చ సాగుతోంది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకు 528 ఓట్లు పొంది 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇదిలావుంటే, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్.వెంకటరామన్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేవిూ లేకుండానే ధన్‌ఖఢ్ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ధన్ ఖడ్ నిర్ణయం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ యశ్వంత్ వర్మ అనే న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు లభ్యం కావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ సంఘటన తర్వాత విపక్ష పార్టీలు రాజ్యసభలో జస్టిస్ వర్మను తొలగించేందుకు ఒక నోటీసును ప్రవేశపెట్టాయి. రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఈ నోటీసును ఆమోదించి, రాజ్యసభ కార్యదర్శికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తోంది. విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ నోటీసును ఆమోదించడం ద్వారా, న్యాయవ్యవస్థలో అవినీతిపై కేంద్రం నేరుగా చర్యలు తీసుకునే అవకాశాన్ని ధన్‌ఖడ్ తప్పించారని కేంద్రం భావించినట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్రంతో విభేదాలు వచ్చాయని పుకార్లు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత ధన్‌ఖడ్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదల య్యాయని తెలిసింది. ఆరు నెలల క్రితం కూడా విపక్షాలు ధన్‌ఖడ్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. అయితే, ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా, ధన్‌ఖడ్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సోమవారం రాత్రి 9:25 గంటలకు ఉప రాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు- లేఖలో తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో తన పదవీ కాలంలో సహకరించిన వారికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఇవన్నీ బయటకు కనిపిస్తున్న కారణాలు మాత్రమే. ఇంకా ఇతరత్రా ఏ కారణాలు ఉన్నాయన్నది కాలక్రమంలో తెలుస్తుంది. అయితే ధన్‌ఖడ్ మోడీకి ఇష్టమైన వ్యక్తిగా అనూహ్యంగా దూసుకుని వచ్చి, అంతకంటే అనూహ్యంగా రాజీనామా చేసి వెళ్లిపోవడమే విధి వైపరీత్యమో? లేక రాజకీయ వైచిత్రమో?

