ప్రతి ఏడాది బడ్జెట్‌కు ముందు సమగ్ర ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం పరిపాటి. దేశ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని అందించే ఈ సర్వే, బడ్జెట్ రూపకల్పనకు మార్గదర్శిగా ఉండాలి. కానీ, వాస్తవంలో ఆర్థిక సర్వే ఒక అధికారిక లాంఛనంగా మిగిలిపోతోంది. అందులోని హెచ్చరికలు, సూచనలు బడ్జెట్‌లో ప్రతిఫలించకపోవడం వల్ల దేశపురోభివృద్ధి కుంటుపడుతోంది. పట్టాలెక్కాల్సిన ప్రగతి, ఆ పట్టాలు తప్పుతోంది. దేశావసరాలకనుగుణమైన దిశానిర్దేశాన్ని మన బడ్జెట్ లు ప్రతిఫలించలేకపోతున్నాయి.
ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించాలన్న లక్ష్యాన్ని మన పాలకులు పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే ఆ మాటలకు, చేతలకు పొంతన కనిపించడం లేదు. గణాంకాల ద్వారా వృద్ధిరేట్లు, ఆశావహ అంచనాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది, పేదరికం పేరుకుపోతోంది. ధరల భారం ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ఇవన్నీ బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న వాస్తవాలు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో మందగమనం స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్ ఆధిపత్యం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ట్రంప్ అధిక సుంకాల విధానాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు భారత్‌పై పడుతోంది. అయినప్పటికీ, దేశీయంగా ముందస్తు దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందా? మందడుగు పడుతోందా?
ముఖ్యంగా యువత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతుండగా, విదేశాల్లో ఉపాధిపై ఆశలు కూడా గల్లంతవుతున్నాయి. అమెరికా వీసా కట్టడులు భారత యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ ఉద్యోగాల కల్పన కూడా భ్రమగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఉపాధి అవకాశాలు సృష్టించడం ఒక్కటే మార్గం. కానీ, బడ్జెట్ ప్రతిపాదనల్లో యువతకు చేతినిండా పని కల్పించే స్పష్టమైన వ్యూహం కనిపించడం లేదు.
ఇటీవలి ఆర్థిక సర్వే ఆశావహ అంచనాలతోపాటు, తీవ్రమైన హెచ్చరికలను చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్, వ్యవసాయ రంగం, గ్రామీణ వినియోగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో కూడా కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పింది.
ఈ సర్వే మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు జరుగుతున్నాయి. భారత్‌లో అమెరికా తర్వాత అత్యధిక ఏఐ పరిజ్ఞానం కలిగిన యువత ఉన్నప్పటికీ, ఇదే విప్లవం ఉద్యోగాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరించింది. ఏఐ అమల్లోకి వచ్చిన 2022 నుంచే రొటీన్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో కోతలు మొదలయ్యాయని, ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తే భారత ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేసి, ఉద్యోగాలను రక్షించే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని సర్వే సూచించింది. కానీ ఈ కీలక సూచనలు బడ్జెట్‌లో ప్రతిఫలిస్తాయా అన్నది ప్రశ్నార్థకమే.
వ్యవసాయ రంగానికీ సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం మరో పెద్ద సమస్య. దిగుబడులు పెరుగుతున్నా, రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఉత్పత్తి–మార్కెట్ మధ్య అనుసంధానం అత్యంత బలహీనంగా ఉంది. ‘మన ఉత్పత్తులను మనమే వినియోగించుకోవాలి’ అన్న స్వదేశీ విధానం నినాదంగానే మిగులుతోంది.
ఆర్థిక సర్వే గణాంకాలు సానుకూల సంకేతాలను సూచిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అది పూర్తిగా ప్రతిబింబించడంలేదు. గణాంకాల వెనుక దాగి ఉన్న నిరుద్యోగ యువత, కష్టాల్లో ఉన్న రైతులు, పెరుగుతున్న పేదరికం పాలకుల దృష్టికి రావాల్సిన అవసరం ఉంది.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఈ వాస్తవాలను గుర్తించి, సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందా? ఆర్థిక సర్వే గణాంకాలు, కాకి లెక్కలుగా మిగిలిపోనున్నాయా? అని యావత్తు దేశం ఎదురుచూస్తున్నది. సహజ వనరులు, మానవ వనరులను సమర్థంగా మేళవించి వినియోగించుకునే స్పష్టమైన ప్రణాళిక లేకుండా మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం అసాధ్యం. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే బడ్జెట్‌నే దేశం ఆశిస్తోంది.

