ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు రానురున తీవ్ర నిరాశగా మారుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ, పార్టీల, ప్రభుత్వాల ప్రయాణాలు సాగించినప్పటికీ, పాలనల ఫలితాలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలే కేంద్రంగా పాలన సాగుతోందన్న భావన బలపడుతోంది. అప్పుడు కేంద్రీకృతంగా, ఇప్పుడు వీకేంద్రీకరణ అవినీతి సాగుతున్నట్లుగా ఉంది. అధికార మార్పులు జరిగినా, పాలన ధోరణిలో మార్పు లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.
తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అప్పులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అభివృద్ధి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్న ఆరోపణలు నేటికీ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతి అజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవలి నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బొగ్గుగని కోసం ఇద్దరు మంత్రులు కోట్లాడుకుంటున్నారని విమర్శలు చెలరేగాయి. కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, భట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారని చివరకు తేలింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వచ్చిన ఆరోపణలు, ఆపై సింగరేణి నైనీ బొగ్గు టెండర్ల ప్రక్రియ రద్దు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అవినీతి జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తే, మరి టెండర్లు ఎందుకు రద్దయ్యాయి? ప్రజాపాలనలో పారదర్శకతంటే ఇదేనా?
ఒక్క నైనీ టెండర్లే కాదు, రాష్ట్రంలో పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, వీడియోల యుద్ధం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, లాభదాయకమైన శాఖలు, కాంట్రాక్టుల కోసం జరుగుతున్న కుమ్ములాటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుక్కాని లేని నావలా మారుస్తున్నాయి. పాలన కంటే రాజకీయ అంతర్గత పోరాటాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నది.
మేడారం అభివృద్ధి పనుల టెండర్ల కాంట్రాక్టులపై మంత్రుల మధ్య విభేదాలు ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాయి. దేవాదాయ శాఖ పనుల్లో ఇతర శాఖల మంత్రుల జోక్యంపై ఎఐసీసీ వరకు ఫిర్యాదులు వెళ్లడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉండాల్సిన దేవాలయాల అభివృద్ధి కూడా రాజకీయ లాభనష్టాల లెక్కల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కణతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్ను గురిపెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సష్టించిన విషయం తెలిసిందే.
మంత్రుల బాధ్యత కేవలం విమర్శలు చేయడం, గత ప్రభుత్వాన్ని నిందించడమే కాదు. తమ శాఖల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షించడం కూడా. అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే విచారణకు ఆదేశించాలి. మంత్రులే ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం, అనుకూల మీడియా ద్వారా ఆరోపణలు చేయించుకోవడం, అధికారులను బలిపశువులుగా మార్చడం పరిపాటిగా మారింది.
ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పుకుంటున్న రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, పెన్షన్లు, ఉచిత బస్సు సౌకర్యాలు సంక్షేమంలో భాగమే కానీ, అవి సంపూర్ణ అభివృద్ధికి ప్రత్యామ్నాయాలు కావు. పాలనలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాల్లో స్పష్టమైన దృక్పథం కనిపించడం లేదు. అప్పులు చేసి సంక్షేమం చూపించడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం ఎప్పటికీ కాదు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అదే తప్పులు పునరావృతం చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ‘కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగి’తే ఎవరికీ కనిపించకుండా పోదు. అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చకుండా, రాజకీయ కుమ్ములాటలతో కాలం గడిపితే తెలంగాణ మరింత భ్రష్టు పట్టడం ఖాయం.
చివరికి నష్టపోయేది ప్రజలే. అభివృద్ధి పక్కకు పోయి, అప్పుల భారం పెరిగితే భవిష్యత్ తరాలకు భారమవుతుంది. అవినీతిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది తీర్పు చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని, పారదర్శక పాలన దిశగా అడుగులు వేయకపోతే, ప్రజల చేతిలో పరాభవం తప్పదన్నది రాజకీయ సత్యం.

