వెనెజువెలా ఉదంతం ఒక దేశపు సంక్షోభం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల ప్రతిబింబం. ఈ మార్పులను అణచివేయాలనే ప్రయత్నాలే రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను మరింత అస్థిరంగా మార్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపు దశలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండిపడుతోంది. చైనా, రష్యా, భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలర్ ను కాదని, తమ స్థానిక కరెన్సీలో వాణిజ్యాలు చేస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగం, వస్తుమార్పిడి ఒప్పందాలు, చమురు లావాదేవీల్లోనూ స్థానిక కరెన్సీ ప్రాధాన్యమే పెరగడం వంటివన్నీ కలిపి ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల్లో మార్పును సూచిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కొనసాగడం అమెరికా ఆర్థిక, రాజకీయ శక్తికి మూలస్తంభం. డాలర్‌లోనే చమురు లావాదేవీలు జరిగే ‘పెట్రోడాలర్’ వ్యవస్థ అమెరికాకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై అపారమైన ఆధిపత్యాన్ని అందించింది. ఈ వ్యవస్థకు సవాల్ విసురుతున్న ప్రయత్నాలు అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పుగా మారుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ నిల్వలు కలిగిన దేశంగా వెనెజువెలా ఎప్పటినుంచో భౌగోళిక ప్రాధాన్యం సంతరించుకుంది. హ్యూగో చావెజ్ కాలం నుంచి వెనెజువెలా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడుతూ, చైనా, రష్యా వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంది. చమురు రంగంలో జాతీయీకరణ విధానాలు చేపట్టడం వల్ల అమెరికన్ ఆయిల్ కంపెనీల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. దీనికి ప్రతిఫలంగా అమెరికా విధించిన ఆంక్షలు వెనెజువెలా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచాయి. నిరుద్యోగం, కరెన్సీ విలువ పతనం, ఆహార కొరత, వలసల పెరుగుదల వంటి సమస్యలు వెనెజువెలాను సంక్షోభంలోకి నెట్టాయి.
ఇదే సమయంలో వెనెజువెలాలో చైనా ప్రభావం వేగంగా పెరిగింది. చమురు ఎగుమతులు, మౌలిక సదుపాయాల నిర్మాణం, విద్యుత్, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు..ఇలా అనేక రంగాల్లో చైనా కీలక భాగస్వామిగా మారింది. ఇక వెనెజువెలా దిగుమతులతో, చైనా 170కి పైగా ప్రాజెక్టులను నిర్మించుకుంది. వెనెజువెలాలో చైనా 26 శాతం కంటే ఎక్కువ విద్యుత్, మైనింగ్ ఇతర సంబంధిత పరిశ్రమల వంటి కీలక రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లు గణాంకాలు తెలిపాయి.
ముఖ్యంగా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యువాన్‌లో లావాదేవీలు జరపడం అమెరికాకు అసహనాన్ని కలిగించింది. లాటిన్ అమెరికా మొత్తం మీద చైనా రుణాలు, పెట్టుబడులు గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగాయి. వెనిజులా ఈ చైనా వ్యూహంలో కీలక స్థానం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై తీవ్ర ఆరోపణలు చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగాలతో మదురోను అమెరికా కిడ్నాప్ చేసింది.
వెనెజువెలా విషయంలో అమెరికా లక్ష్యం కేవలం చమురు మాత్రమే కాదు. లాటిన్ అమెరికాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవడం, ‘అమెరికా పక్కనే, పక్కలో బల్లెంలా వెనెజువెలాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కూడా ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా చైనా, రష్యా, ఇరాన్, అలాగే భారత్ వంటి దేశాలపైనా టారిఫ్‌లు, ఆంక్షలు, వాణిజ్య ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
ప్రపంచం ఇప్పుడు ఒక బహుళ ధ్రువ ఆర్థిక వ్యవస్థ వైపు కదులుతోంది. డాలర్ ఆధిపత్యం ఒక్కసారిగా కూలిపోయేదేమీ కాదు. గానీ, దాని ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పును అడ్డుకోవడానికి అమెరికా దూకుడైన విధానాలను అవలంబిస్తే, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
వెనెజువెలా ఉదంతం ఒక దేశపు సంక్షోభం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల ప్రతిబింబం. ఈ మార్పులను అణచివేయాలనే ప్రయత్నాలే రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను మరింత అస్థిరంగా మార్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

