కాలం గిర్రున తిరుగుతోంది. క్యాలెండర్లు గిరగిరా మారుతున్నాయి. కానీ ప్రజల జీవితాల్లో మాత్రం ఆ కాలానుగుణ మార్పు కనిపించడం లేదు. ఏళ్ళకు ఏళ్ళు గడుస్తున్నా పరిపాలన స్వరూపం, ప్రజల జీవన ప్రమాణాలు, దేశ అభివృద్ధిపై ప్రశ్నలే మిగులుతున్నాయి. 2026లోకి అడుగిడిన ఈ సమయంలో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ పాలన ప్రజల జీవన ప్రమాణాల ఉన్నతికి ఏమేరకు దోహదపడిందనేది నిజాయితీగా నిర్ధారించుకోవాల్సిన సందర్భమిది.
రానురాను జీవనం మరింత కఠినమవుతోంది. ధరలు, నిరుద్యోగం పెరుగుదల, ఉపాధిలేమి, ఆర్థిక అస్థిరత సామాన్యుడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సరైన విధాన నిర్ణయాల లోపం, ప్రజా ప్రయోజనాలపై రాజకీయ లాభాలే ఆధిక్యతను ప్రదర్శించడం, వల్ల దేశం నానాటికీ దిగజారుతోంది. అభివృద్ధి అధికారిక ప్రకటనల్లో మాత్రమే వినిపిస్తోంది.
విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు దాదాపు లేనట్లే. ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు నిర్వీర్యమవుతుండగా, ప్రైవేట్ వ్యాపారం మూడు సంస్థలు, ఆరు బ్రాంచీలుగా విరాజిల్లుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు వసతుల కొరతతో అల్లాడుతుంటే, కార్పొరేట్ సంస్థలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇందుకు పాలకుల లోపభూయిష్ట విధానాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయాలను స్వల్ప, దీర్ఘకాలిక అభివృద్ధికి బదులు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ పథకాల పేరిట దుబారా చేస్తున్నాయి. ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతోంది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని అభివృద్ధికి మించిన సంక్షేమం ఎప్పటికీ అనర్థదాయకమే.
దేశం సహా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరగడం లేదు. యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు భూముల అప్పగింత నిరంతరంగా సాగుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు లభించక, వ్యవసాయం లాభసాటిగా మారకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రై‘వేటు’ అత్యంత దారుణంగా మారింది. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో ప్రైవేటీకరణ ఆయా రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయి. రక్షణ రంగంలోనూ ఈ తంతు దేశ, ప్రజల భవిష్యత్తు భద్రతపై అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దేశ సంపదలో అధిక భాగం కేవలం కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, అధిక సంఖ్యాకులైన కోట్లాది మంది కూడు, గూడు, గుడ్డ విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలకే నిత్యం పోరాడుతున్నారు. ఈ అసమానతలను తగ్గించాల్సిన పాలకులు, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించడం ప్రజల్లో అసంతృప్తిని, అసహనాన్ని పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలాయి. ఈ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి పాలకులు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
దళితులు, ఆదివాసులు, మహిళలపై జరుగుతున్న దాడులకు ముగింపు పలికి, సమానత్వం కాగితాలకే పరిమితం కాకుండా అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. జల్, జంగల్, జమీన్‌పై కార్పొరేట్ ఆక్రమణలు ఆగాలి. పర్యావరణ విధ్వంసం కేవలం ప్రకృతి సమస్య కాదు. అది జీవన, సామాజిక న్యాయ సమస్య. అయితే, న్యాయవ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికైనా ఉచిత పథకాల దుబారాను తగ్గించి, నిజమైన అభివృద్ధికి నిధులు వెచ్చించాలి. కేవలం అవసరమైన పేదలకు మాత్రమే సంక్షేమం అందిస్తూ, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరి, దేశం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయగలదు.

