ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడి పన్నెండు ఏళ్లు పూర్తయ్యాయి. పుష్కరం గడిచినా, ప్రజల జీవితాల్లో మాత్రం ప్రబలంగా జీవన ప్రమాణాలు పెరిగిన గణనీయమైన మార్పేమీ కనిపించలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు, కొందరు నేతలకు మాత్రమే విభజన ప్రయోజనకరంగా మారిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. రాష్ట్రాలు బాగుపడాల్సిన వేళ, ఆ రాజకీయ నాయకులే రాజకీయ సవాళ్ళు–ప్రతిసవాళ్ళతో కాలం గడిపేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు–జగన్ మధ్య, తెలంగాణలో రేవంత్-కేసీఆర్ ల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వాగ్వాదాలు, కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే. రెండు రాష్ట్రాల్లో పాలించిన సీఎంలు తమ పాలనే గొప్పదని చెబుతూనే ఉన్నారు. కాదు మా పాలనలోనే అని ప్రతిపక్ష నేతలు ప్రగల్బాలుపలుకుతున్నారు. “దమ్ముంటే రండి, చర్చిద్దాం” అంటూ పరస్పరం సవాళ్ళు విసురుకుంటున్నారు. ఆ గందరగోళంలో ప్రజలు, వారి ప్రయోజనాలు కొట్టుకుపోతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అంటూ, ఉచిత పథకాలతో ఊదరగొట్టి, ప్రజలను సోమరులను చేసి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాలకూ అప్పుల భారం దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు పోటాపోటీగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి.
అసెంబ్లీకి రాని కేసీఆర్, ఆరునెలలకో, ఏడాదికో మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా ‘రెండేళ్ళు మౌనంగా ఉన్నా, వస్తున్నా, సర్వభ్రష్ట కాంగ్రెస్ తోలు తీస్తా..’ మళ్ళీ మరోసారి తెరమీదకు వచ్చారు. నదీజలాలపై కాంగ్రెస్, టీడీపీలను చెండాడారు. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. ‘దమ్ముంటే అసెంబ్లీకి రా… తెలంగాణ నదీజలాల వాటాకు అన్యాయం, చేసిందెవరో? ప్రాజెక్టులతో ముంచిందెవరో? తేల్చుకుందామని సీఎం రేవంత్ ప్రతి సవాల్ చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి 511 (64%) టీఎంసీలు, తెలంగాణకు 299 (36%) టీఎంసీలు చాలని అంగీకరించిన ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టారని, ఆ నిర్ణయం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పట్టి సీమను పొగిడిందెవరు? ఉమ్మడిలోకన్నా, కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ నిరూపిస్తామంటున్నారు.
కాంగ్రెస్ హయాంలో మొదలైన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామసాగర్, కొడంగల్–నారాయణపేట వంటి కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులలో ఒక్కటినైనా కేసీఆర్ పాలనలో పూర్తి చేయలేకపోయారని కూడా విమర్శిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై జనవరి రెండో తేదీ నుంచి “రోడ్లపై కాదు, అసెంబ్లీలో నీళ్లపై, నిజాలపై చర్చిద్దామ”న్న సీఎం వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.
దీనికి ప్రతిగా కేసీఆర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. తమ పాలనలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, శాంతిభద్రతలతో పురోగతి సాధించిందన్నారు. ఇప్పుడు మాత్రం పాలమూరుకు రెండేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదని, దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.
అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడమే కాక, నిరూపిస్తామని సవాళ్ళు విససురుకోవడమే గానీ, ఎవరూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ‘నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు నటించు’ అన్నట్లుగా రెండు పార్టీల వ్యవహరిస్తున్నాయి. సంచలనాలతో వాళ్ళు చర్చనీయంగా ఉండే సంవాదాలు, సవాళ్లే తప్ప, ప్రజలు, వారి సంక్షేమంపై ఎవ్వరికీ చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనిపించడం లేదు.
ఈ రాజకీయ యుద్ధంలో ప్రజలు, ప్రగతి అయోమయంగా కొట్టుకుపోతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దీనికి గతంలో పాలించినవారు, ప్రస్తుతం పాలిస్తున్నవారే బాధ్యులే. అప్పులు, నదీజలాల వాటాలు, అభివృద్ధి ప్రాధాన్యాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చకు అసెంబ్లీ వేదికైతేనే అది రికార్డు కూడా అవుతుంది. బయట నిరూపించగలిగిన వాళ్ళెవరైనా, అసెంబ్లీలో చర్చకు భయపడాల్సిన అవసరంలేదు. చర్చకు రానంత వరకు, ఆరోపణలు నిరూపణ కానంతవరకు ఈ సవాళ్ళకు సత్తా లేనట్లే! ఆ సవాళ్ళు విసిరే నేతలకు విలువా లేనట్లే!! ప్రజలు వింటున్నారు కదా? అని అదే పనిలో ఉంటే, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు.

