పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పార్లమెంట్ వేదిక మరోసారి రాజకీయ విభేదాల రణరంగంగా మారింది. దేశ ప్రాధాన్య సమస్యలపై చర్చించాల్సిందిపోయి పార్టీల పరస్పర నిందారోపణలు, ఆక్షేపణలు, వాగ్యుద్ధ హద్దులు దాటి సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, విభేదాలు సహజం. కానీ, వాటిని నిర్మాణాత్మక చర్చల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం లక్ష్యం కావాలి. ప్రస్తుత సమావేశాల్లో అది జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశం డిసెంబర్ 1 నుండి 19వరకు అంటే 15 పని దినాలతో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఈ సమావేశాలంలొ13–14 కొత్త బిల్లులను ఆమోదింప చేయాలని నిర్ణయించింది. ఎనర్జీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, ఆటామిక్ ఎనర్జీ-2025 బిల్లు, యూనివర్సిటీ నియంత్రణ వ్యవస్థలను మార్చి, హయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు, కేంద్రానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా పొగాకు, పాన్ మసాలా పన్నుల విధానాన్ని మార్చే సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు, ఆరోగ్య, జాతీభ భద్రత సెస్ బిల్లు, హైవే ప్రాజెక్టుల కోసం, కార్పొరేట్ వ్యవస్థల కోసం పలు బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్ ముందు పెట్టనుంది.
అయితే, చట్టాలు, సంస్కరణలతో పాటు ప్రజల హక్కులు, ఎన్నికల పారదర్శకత, వోటర్ విశ్వసనీయత, వోటర్ ప్రతుల సరిచూడడం వంటి ప్రాథమిక ప్రజాస్వామ్య అంశాలపై చర్చ లేకుండా, కేవలం బిల్లుల మీద మాత్రమే చర్చిస్తే, ప్రజాస్వామ్య విలువ నిలవదని ప్రతిపక్షం భావిస్తోంది. పైగా కేవలం ఇంత విలువైన అంశాలపై చర్చలకు కేవలం 15 పనిదినాల శీతాకాల సమావేశాల సమయం సరిపోదనే వాదన కూడా వినిపిస్తున్నది. చట్టాలు చేయడమే కాదు, వాటిని ప్రజల మనోభావాలతో, హక్కులు, భద్రతలతో అనుసంధానం చేయడం కూడా ముఖ్యం.
ఒకపక్క ప్రభుత్వం ఆర్థిక, భద్రత, సామాజిక సంక్షేమ చట్టాలను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతుండగా, మరోవైపు ప్రతిపక్షం ప్రజాస్వామిక పారదర్శకత, ప్రజల హక్కుల చర్చను ప్రస్తావిస్తూ నిరసనకు దిగుతోంది. ఇరు వైపులా ఎవరి వాదనలు వారికి ఉన్నప్పటికీ, దేశ ప్రాధాన్యతలను పక్కన పెట్టడం ప్రజలకు నష్టం మాత్రమే గాక, ప్రజాస్వామిక వ్యతిరేకం. బిల్లులపై ప్రవేశపెట్టే ముందు సంపూర్ణ చర్చలు జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్ ఆమోదయోగ్యమే అయినా, ప్రతి విషయాన్నీ వాయిదా వేయడం కూడా సముచితం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ పనితీరు దెబ్బతింటోంది.
ఈ సమావేశాల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, డిజిటల్ భద్రత, అంతర్గత సెక్యూరిటీ వంటి కీలక అంశాలపై లోతైన చర్చ జరగాల్సి ఉంది. ఈ అంశాలేవీ చర్చకు రాకుండా నినాదాలు, సస్పెన్షన్లు, అడ్డంకులే ఎక్కువ చర్చకు దారితీస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల రాజకీయ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలపై ఆధిపత్యం చెలాయిస్తే, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.
పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు దేనికి పోటీ పడుతున్నాయి? ప్రజా సమస్యల పరిష్కారానికా? లేక రాజకీయ ఆధిపత్యానికా? ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడుతూ చర్చలకు అవకాశం కల్పించాలి. ప్రతిపక్షం కూడా అన్నింటినీ అడ్డంగా వ్యతిరేకించడం కాకుండా, నిర్మాణాత్మక చర్చకు సిద్ధం కావాలి. ఈ బాధ్యతలను అధికార, విపక్షాలు గుర్తించాలి.
పార్లమెంటు దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసే అత్యున్నత అవకాశం. అది ప్రజాప్రయోజనానికే తప్ప పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు. పార్టీలన్నీ తమ అవసరాలు, అహంకారాలను పక్కన పెట్టి, దేశ ప్రాధాన్యతలపై చర్చ, సహకారం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్లమెంట్ వేడెక్కడం సహజమే, కానీ ఆ వాడీ వేడి, ప్రజాభ్యున్నతికి దోహదపడే జీవనాడి కావాలి.

