పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ చీరల పంపిణీని మొదలు పెట్టింది. మంగళవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 3.5లక్షల మంది మహిళలకు రూ.300.4 కోట్ల వడ్డీరహిత రుణాలిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం బాగానే ప్రిపేర్ అయింది.
కానీ, బీసీ రిజర్వేషన్లనే వెనక్కి నెట్టేసింది. బీసీలకు రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఊదరగొట్టి, చివరకు పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ఇచ్చింది. దాని అమలు పేరుతో నానా ఫీట్లు చేసి, చివరకు కోర్టుల్లో ఫట్ మనిపించింది. నెపం కేంద్రం మీద, బీజేపీ, బీఆర్ఎస్ ల మీదకు నెట్టారు. రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయినా, సాధించేస్తామని బీరాలు పలికి, లాయర్ల ఫీజుల కింద కోట్లు తగలేశారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు వెనక్కి వెళ్ళకుండా అన్న సాకుతో ఎన్నికలకు సిద్ధ పడింది. బీసీ రిజర్వేషన్ల పేరిట నానా హంగామా చేసి, మళ్లీ పాతపద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
‘1948 చట్టం’ ప్రకారం జన,కులగణన చేపట్టే అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నది. రాష్ట్రాలకు లేదు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. అమలు చేసే అవకాశం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే ‘గణాంకాల సేకరణ చట్టం-2008’ ద్వారా రాష్ట్రాలకు డాటా సేకరణకు పరిమిత అధికారాలను బదలాయించింది. ఒకవేళ జన, కుల గణనను రాష్ట్రం నిర్వహించాలని భావించినా, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతేకాదు, సేకరించిన డాటా వెల్లడిపై కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి సర్వే పేరుతో జన, కుల గణన చేశామని అందరినీ మభ్యపెట్టిందనేది విపక్షాల ఆరోపణలు. కుల గణనకు కేంద్రం పూనుకోవడంతో అదీ తమ ఘనతేనని చెప్పు కున్నది. కేంద్రం మెడలు వంచామని బుకాయించారు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో గందరగోళం నెలకొంది. సర్కారు మార్గదర్శ కాలకు విరుద్ధంగా జిల్లాల్లో అధికారులు రిజర్వేషన్లను ఇష్టారీతిన ఖరారు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. తదనుగుణంగా సర్పంచ్ స్థానాలకు ఆర్డీవోలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారు చేశారు. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ, తదుపరి మహిళా స్థానాలను ఖరారు చేశారు. గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్‌గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలను రిజర్వ్ చేశారు.
ఇదిలాఉంటే వార్డు సభ్యుల స్థానాలకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను, సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వివాదంగా మారింది. రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ కోటాను తగ్గించి జనరల్ కోటను పెంచారని బీసీ సంఘాలు చెప్తున్నాయి. రొటేషన్ ముసుగులో బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నాయి.
ఇప్పటికైనా బీసీ సంఘాల ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలి.

