బిహార్‌లో రాష్ట్ర ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండోదశ పోలింగ్ మంగళవారం జరగబోతోంది. మరి బిహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వేసిన ‘ఓట్ చోరీ’ పాచిక పారుతుందా? కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందా? అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న నితీశ్ కుమార్ విజయపరంపరకు తెరపడుతుందా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎనే తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఏం జరగనుంది? ఆసక్తిగా మారింది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
బిహార్‌లో రాష్ట్ర ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండోదశ పోలింగ్ మంగళవారం జరగబోతోంది. మరి బిహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వేసిన ‘ఓట్ చోరీ’ పాచిక పారుతుందా? కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందా? అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న నితీశ్ కుమార్ విజయపరంపరకు తెరపడుతుందా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎనే తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఏం జరగనుంది? ఆసక్తిగా మారింది.
బిహార్ లో గెలిచినా, ఓడినా రాహుల్, ఓట్‌చోరీ ఆయుధంగా దేశ వ్యాప్త ఉద్యమానికి బలమైన వ్యూహంతో ఉన్నారు. ఇప్పటికే బిహార్ లో 9సార్లు సీఎంగా గెలిచిన నితీశ్ కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలుగా భావించవచ్చు. గెలిస్తే పదోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. ఆ అవకాశం ఉందా? లేదా? అన్నది ఆ రాష్ట్ర ఓటర్ల తీర్పుని బట్టి ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్ ఓట్ల వాటా 15 శాతంగా ఉన్నది. నితీశ్ మళ్లీ అధికారానికి రావడానికి ఇది విశేషంగా తోడ్పడింది. 2005 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ రెండు ప్రధాన వర్గాలు నితీశ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆ వర్గాలు మహిళలు, బాగా వెనుకబడిన కులాలవారు. మహిళా ఓటర్ల శక్తిని జాతీయ రాజకీయ పార్టీలు అందిపుచ్చుకోకముందే నితీశ్ మహిళా ఓటర్ల ఆదరాభిమానాలను బాగా చూరగొంటున్నారు. మృదుభాషిగా పేరున్న నితీశ్ తన ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు, పల్లెటూరి మనిషిలా వ్యవహరించే లాలూప్రసాద్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఈ కారణంగానే మహిళా ఓటర్లను నితీశ్ ఆకట్టుకున్నారు. అచంచలమైన కుల సంబంధిత విధేయతలతో పాటు మహిళా ఓటర్ల మద్దతు నితీశ్ విజయాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2005లో నితీశ్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చదువుకుంటున్న బాలికలు అందరికీ ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఆనాడు లబ్ది పొందిన బాలికలు ఇప్పుడు వయోజన ఓటర్లుగా ఉన్నారు. ఆ మహిళా ఓటర్లే నితీశ్ నాయకత్వానికి, అధికార ప్రాభవానికి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పకతప్పదు.
ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ నితీశ్‌ను ఎన్‌డిఎ పక్షాన ఉంచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తనను వ్యతిరేకించిన వారిని క్షమించే అలవాటు లేని మోదీ, ఒకప్పుడు నితీశ్ తనను తీవ్రంగా వ్యతిరేకించారన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించడం వెనక బీహార్ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించాలి. బిహార్‌లో బీజేపీ ఎదుగుదలకు నితీశ్‌తో పొత్తు తప్పనిసరని మోదీ గ్రహించారు. మరోమారు బీహార్‌లో ఎన్‌డిఎ విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో బిహార్‌లో కూడా ఏక్‌నాథ్ షిండే లాంటి తిరుగుబాటు సంభవించే అవకాశం లేకపోలేదు. అయినా ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఎన్నికల విజయాలకు నితీశ్ ఆవశ్యకత అమితంగా ఉన్నది. లాలూప్రసాద్ యాదవ్‌తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో నితీశ్ జతకట్టంలో ఆయన స్వార్థం ఆయనకు ఉంది. నిరంతరాయంగా బీహార్ సిఎంగా నిలిచిపోవాలన్న ఆయన కాంక్షను కాదనలేం. రాజకీయ సౌలభ్యం కోసమే ఆయన మళ్లీ మోదీతో చేయి కలిపారు. అలాగని బీజేపీకి నితీశ్ పట్ల ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు.
2013లో ప్రధానమంత్రి పదవికి అవసరమైన అర్హతలు నరేంద్ర మోదీకి లేనేలేవని తొట్టతొలుత నిరసన తెలిపిన నేత నితీశ్‌కుమార్. ఈ విషయాన్ని బీజేపీ మరచిపోయి ఉండదు. అయితే బిహార్‌లో ఎన్డీఏకు సమర్థంగా నేతృత్వం వహించగల నాయకుడు మరొకరు లేరన్న వాస్తవమూ బీజేపీకి బాగా తెలుసు. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా మరెవ్వరూ లేనందునే బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తోంది. వయసు మీద పడడంతో నితీశ్ కూడా తప్పని పరిస్థితుల్లో మోదీయే సర్వం అయిన ఢిల్లీ దర్బార్‌కు విధేయుడుగా ఉంటూ వస్తున్నారు.
అయితే మారుతున్న కాలానుగుణంగా బిహార్ ఓటర్లలో అత్యధికులు మౌలిక మార్పులు కోరుకుంటున్నారు. మరి ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీకి వారు ఓటు వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. తేజస్వి యాదవ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.
బిహార్ ఓటర్ల సవరణ రచ్చ కూడా చర్చకు దారితీస్తోంది. ఎంఐఎం కూడా ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో బరిలోకి దిగింది. మరైతే, బిహార్ ఎన్నికలు ఎవరికి మొగ్గు చూపుతాయి, ప్రజలు ఆలోచన ఏ విధంగా ఉందన్నది కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంలో నితీశ్ రికార్డు సృష్టించారు. మొత్తం తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ బిహార్‌కు ఆయన నాయకత్వం తప్పనిసరి అని పలువురు, ముఖ్యంగా బీజేపీ భావిస్తోంది. ఐదేళ్ళ క్రితం కొత్త తరం బిహారీ రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్ స్థాయిని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించింది. నితీశ్ ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. గత శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్(యు) కేవలం 43 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగా బీజేపీ 74 నియోజక వర్గాలలో జయపతాక నెగురవేసింది. అయినప్పటికీ నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ సంకోచించింది. తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసేందుకు సుముఖత చూపలేదు.
నితీశ్ కుమార్ అపర చాణక్యుడు. బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకున్నారు. ఆ పార్టీతో పొత్తును కొనసాగించడం ప్రమాదకరమని భావించారు. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చివేసిన రీతిలో బిహార్‌లో తన పార్టీని బీజేపీ చీల్చకుండా ఉంటుందా? అని నితీశ్ ఆలోచించారు. అందుకే బీజేపీని తన దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఈసారి ఆయన పదోసారి సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.
తేజస్వీ యాదవ్ సీఎం కావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్ మహాఘట్‌బందన్ కలసివస్తుందా? లేదా? అలాగే రాహుల్ ఓట్‌చోరీ ఆరోపణలు ఏమేరకు ఫలితం ఇస్తాయో? ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోందో? ఫలితాలు వచ్చేదాకా ఆగాలి.

