ఒక ఉప ఎన్నిక ఫలితం, మొత్తం రాష్ట్ర ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, రాజకీయాలను ఏమార్చి, ప్రభుత్వాన్ని మార్చేంత ప్రభావవంతంగా ఉంటుందా? ఒక్క ఫలితాన్ని మొత్తం ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇంకా మూడేళ్ళ తర్వాత రానున్న ఎన్నికలకు ఇది ముందస్తు సంకేతం అవుతుందా? నిరతరం వేగంగా మారుతూ ఉన్న చలనశీలమైన వైయక్తిక, సామాజిక అవసరాలు, అభిప్రాయాలు, ప్రభావాలు, మానసిక స్థితిగతులు, పార్టీలు, రాజకీయాలు, మనుషులు, ఓటర్లు, అన్నింటికీ మించి డబ్బు ప్రభావం చూపే మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక్క ఫలితంతో భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయవచ్చా? ఇలా…జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో!
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
ఒక ఉప ఎన్నిక ఫలితం, మొత్తం రాష్ట్ర ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, రాజకీయాలను ఏమార్చి, ప్రభుత్వాన్ని మార్చేంత ప్రభావవంతంగా ఉంటుందా? ఒక్క ఫలితాన్ని మొత్తం ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇంకా మూడేళ్ళ తర్వాత రానున్న ఎన్నికలకు ఇది ముందస్తు సంకేతం అవుతుందా? నిరతరం వేగంగా మారుతూ ఉన్న చలనశీలమైన వైయక్తిక, సామాజిక అవసరాలు, అభిప్రాయాలు, ప్రభావాలు, మానసిక స్థితిగతులు, పార్టీలు, రాజకీయాలు, మనుషులు, ఓటర్లు, అన్నింటికీ మించి డబ్బు ప్రభావం చూపే మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక్క ఫలితంతో భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయవచ్చా? ఇలా…జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో!
రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. అది అయినా, కాకపోయినా రాజకీయ పార్టీలు, మీడియా అన్నీ కలిసి దాన్ని అలా మార్చాయి. పార్టీలు వాటి పబ్బం గడుపుకోవడానికి చేసే వ్యాఖ్యలను పతాకశీర్షికలు చేసి, మీడియా అందులో పావుగా మారిపోతోంది. కొందరు జర్నలిస్టులైతే కండువాలు కప్పుకున్న కార్యకర్తలకు మించి అంగీలాగూ చింపుకుంటున్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనారోగ్య రీత్యా చనిపోతే జూబ్లీ ఉపఎన్నిక వచ్చింది. ఇది సాధారణం. కానీ ఎందుకు అంత అసాధారణంగా మారింది? అంటే ఆ సీటుని ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, మళ్ళీ గెలిచి తీరాలని బీఆర్ఎస్, ఆ రెండు పార్టీలో కొట్లాటలో తామే గెలిస్తే పోలా? అని బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ కోసం పోటీ నుంచి తప్పుకుని ఎంఐఎం వేడుక చూస్తోంది. ఇప్పుడు ఇక్కడి ముస్లిం ఓట్లు కీలకంగా మారి, మహ్మద్ అజహరుద్దీన్ ని మంత్రిని చేసేశాయి. ఇక ఈ ప్రభావం కూడా ఏ మేరకు ఉంటుందో? చూడాలి.
నిజానికి జూబ్లీ ఉప ఎన్నికలో ఎవరు, ఏపార్టీ గెలిచినా, ఓడినా ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. వారి దైనందిన జీవనంలో వచ్చే మార్పులూ ఉండవు. అదరిపోయే అభివృద్ధేమీ జరగదు. చెదిరిపోయే ముఖ చిత్రమమేమీ ఉండదు. కాకపోతే ఈ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న రాజకీయ పార్టీలు ఈ ఒక్క నియోజకవర్గంలో గెలపోటములను బట్టి అధికార మార్పిడికి గురవుతాయి. ఆ తర్వాత అవి ఆ ఫలితాన్నే కాదు. ప్రజల్ని కూడా యథావిధిగా మరచిపోతాయి.
అధికారంలో ఉన్నందున ఈ సీటుని గెలవడం కాంగ్రెస్ కు, సిటింగ్ సీటుని నిలుపుకోవడం బీఆర్ఎస్ కు, తమ బలాన్ని పరీక్షించుకోవడం బీజేపీకి అవసరం. అధికారంలో ఉన్న పార్టీల పంచన ఉండటం ఎంఐఎంకు ముఖ్యం. దీంతో పార్టీలు తమ మనుగడ కోసం జూబ్లీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రజల్ని, వారిచ్చే తీర్పుని అప్రతిష్టపాలు చేసే సవాల్‌గా తీసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.
ఈ ఉప ఎన్నిక ఫలితంతో ప్రజల జీవితాల్లోనే కాదు, రాజకీయ నాయకుల్లోనూ పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదు. రాజకీయ పార్టీలకు గెలుపోటములు యాదిమరుపంత అలకన. అయితే రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు, మీడియా సమీకరణలు వేర్వేరుగా వాటి అవసరాలను బట్టి ఉంటాయి. ఫలితాల చర్చలు ప్రజల దృక్కోణం నుంచి కాకుండానే ఉంటాయి.
జూబ్లీ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనకు, కాంగ్రెస్ రెండేండ్ల పాలనకు ఎలా పోలిక అవుతుంది? పోలికకు సమాన కాలాన్ని కూడా తీసుకోవాలి కదా! ఇక పార్టీల, నేతల పరస్పర ఆరోపణలకు అర్థాలే ఉండవు. అర్థమైనా చర్యలుండవు. ప్రజల్ని పిచ్చోళ్ళను చేస్తన్నారంతే. అయితే ప్రజలు కూడా ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడే పార్టీలు, నేతల పీచమణుస్తారు.
నిజానికి ప్రజలకు తమ అభ్యర్థి ఎంచుకునే అవకాశాలు పరిమితం. నిలబడిన పార్టీలు, నిలబెట్టిన అభ్యర్థుల్లో ఒకరిని మాత్రమే ఎన్నుకోవాలి. నచ్చపోతే ‘నోటా’ ఉన్నప్పటికీ, ప్రజలు పార్టీలంత, నేతలంత సంఘటితం కాదు. కాబట్టి, ఎన్నికేదైనా వాటి ఫలితాలు రాజకీయ పార్టీలు తమ బలాబలాలను పరీక్షించుకోవడానికి, పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి మాత్రమే పనికివస్తాయి.
పార్టీలు తమ ఏజెండాలను నెత్తినెత్తుకుని ఊరేగుతున్నాయి. ప్రజల ఆ పార్టీల నేతలు చేసిన అవినీతిని చూస్తున్నారు. పార్టీల నేతలే ఒకరి అవినీతిని ఒకరు బయట పెట్టుకుంటున్నారు. జనం ఓట్ల కోసం నానా పాట్లూ పడుతున్నారు. ఓట్ల వేటలో ఎవరి సమీకరణాలు వారికున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని చూపి కాంగ్రెస్… కాంగ్రెస్ అవినీతిని చూపి బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. ఈ సమయంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించాల్సి ఉంది. చైతన్యంతో ఓటేయాల్సి ఉంది.

