బంగారం మనిషి జీవనంలో అత్యంత విలువైన లోహంగా నిలిచింది. ఇది కేవలం ఆభరణాలకే కాకుండా ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడులలో, అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా కీలకం. మరి బంగారం ధరలను ఎవరు? ఎలా నిర్ణయిస్తారు? అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న? మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
బంగారం మనిషి జీవనంలో అత్యంత విలువైన లోహంగా నిలిచింది. ఇది కేవలం ఆభరణాలకే కాకుండా ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడులలో, అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి బంగారం ధరలను ఎవరు? ఎలా నిర్ణయిస్తారు? అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న?
నిజానికి, బంగారం ధరను ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి నిర్ణయించరు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ శక్తులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా నిష్పత్తి, కరెన్సీ మార్పిడి రేట్లు, ప్రభుత్వాల విధానాల, పెట్టుబడిదారుల మనస్తత్వం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలను ‘లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్’ అనే సంస్థ నిర్ణయిస్తుంది. ప్రతి రోజూ రెండుసార్లు, ఉదయం, సాయంత్రం లండన్ సమయం ప్రకారం బంగారం ధరను “లండన్ గోల్డ్ ఫిక్సింగ్” ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా ‘హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, గోల్డ్ మన్ సాక్స్’ వంటి పెద్ద అంతర్జాతీయ బ్యాంకులు, బులియన్ వ్యాపారులు పాల్గొంటారు. వీరు తమ తమ కస్టమర్ల డిమాండ్, సరఫరా వివరాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. ఇది ప్రపంచ బంగారం ధరలకు ప్రామాణికంగా పరిగణిస్తారు.
బంగారం ధరలను ప్రభావితం చేసేది అమెరికా డాలర్ విలువ. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరను డాలర్లలోనే నిర్ధారిస్తారు. ‘డాలర్ విలువ తగ్గినప్పుడు, బంగారం ధర పెరుగుతుంది’, అదే ‘డాలర్ బలపడినప్పుడు, బంగారం ధర తగ్గే’ అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే, బంగారం “సురక్షిత పెట్టుబడి.” అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం రూపంలో పెట్టడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు, యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, స్టాక్ మార్కెట్ పతనం వంటి పరిస్థితుల్లో బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి.
మరొక ప్రధాన అంశం డిమాండ్-సరఫరా నిష్పత్తి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి ఎక్కువగా దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, అమెరికా వంటి దేశాల్లో జరుగుతుంది. కానీ వినియోగం విషయంలో భారత్, చైనా, మధ్య ప్రాచ్య దేశాలు ముందుంటాయి. భారతదేశంలో బంగారం పట్ల ఉన్న ప్రేమ, ఆచారాలు, వివాహాల సందర్భాలు, పండుగలు మొదలైనవి బంగారం డిమాండ్‌ను అధికంగా ఉంచుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. సరఫరా అధికంగా ఉన్నప్పుడు ధరలు తగ్గుతాయి.
అదేవిధంగా, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి సంస్థలు వడ్డీ రేట్లను పెంచినప్పుడు లేదా తగ్గించినప్పుడు బంగారం ధరలు మారుతాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆర్థిక సాధనాల (బాండ్లు, డిపాజిట్లు)లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా భావిస్తారు, దాంతో బంగారం ధరలు తగ్గుతాయి. అదే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బంగారం ఆకర్షణీయ పెట్టుబడి రూపంగా మారి ధరలు పెరుగుతాయి.
స్థానికంగా చూస్తే, దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలకు అనుసంధానమై ఉంటాయి. అయితే వాటికి రూపాయి విలువ, పన్నులు, ఖర్చులు వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర మారకపోయినా దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతుంది. ఎందుకంటే రూపాయలలో కొనుగోలు చేయాల్సిన బంగారం మరింత ఖరీదుగా మారుతుంది. అదేవిధంగా, ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు, జీఎస్టీ వంటి పన్నులు కూడా స్థానిక ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
మరొక ముఖ్యమైన అంశం భావోద్వేగాలు, మార్కెట్ సైకాలజీ. బంగారం పట్ల ప్రజల విపరీతమైన మక్కువ. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు, బంగారంను భద్రతగా భావిస్తారు. ఈ నమ్మకం బంగారం ధరలను క్రమం తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, పెద్ద పెట్టుబడిదారులు లేదా “గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్”లో జరిగే లావాదేవీలు కూడా తాత్కాలికంగా ధరలలో హెచ్చుతగ్గులు కలిగిస్తాయి. బంగారం ధరల నిర్ధారణలో సాంకేతిక పరిణామాలు కూడా ఇటీవల పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ల ద్వారా జరుగుతోంది. ఈ కారణంగా మార్కెట్ ప్రతిస్పందన వేగంగా మారుతుంది. అలాగే క్రిప్టో కరెన్సీల ప్రభావం కూడా కొంతవరకు బంగారం డిమాండ్‌పై చూపిస్తోంది. పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయినప్పటికీ, బంగారం శాశ్వత విలువ, భౌతిక స్వరూపం, ప్రభుత్వ గుర్తింపు కారణంగా అది ఇప్పటికీ అత్యంత నమ్మదగిన ఆస్తిగా నిలిచింది.
ఇంకా దేశంలో బంగారం ధరలు ప్రాంతానికీ ప్రాంతానికి మధ్య మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో ధరల్లో తేడా ఉంటుంది. ఇది రవాణా ఖర్చులు, వ్యాపార లాభాలు, స్థానిక డిమాండ్ మొదలైన కారణాల వల్ల జరుగుతుంది. ఈ మార్పులకు కూడా, అంతర్జాతీయ బంగారం ధరలు ప్రతి రోజూ ఒక ప్రధాన సూచికగా నిలుస్తాయి.
మొత్తంగా, బంగారం ధరలను ఒకే వ్యక్తి లేదా సంస్థ నిర్ణయించదు. బంగారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతిరూపం. డాలర్ విలువ, వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల విధానాలు, డిమాండ్–సరఫరా నిష్పత్తి, రాజకీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల మనస్తత్వం వంటి అనేక అంశాల సమ్మిళిత ప్రభావం వల్ల బంగారం ధరలు నిర్ణయించబడతాయి. బంగారం కేవలం లోహం కాదు, ప్రజల నమ్మకం, భద్రత, ఆర్థిక స్థిరత్వానికి సంకేతం. దీని నియంత్రణ ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదు.

