ఎన్నికలంటే ఆర్భాటాలు, ప్రచార పటాటోపాలే కాదు, మేనిఫెస్టోలు, హామీలు కూడా. అమలు చేయలేని, అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నికల్లో హల్ చల్ చేస్తుంటాయి. ఓట్ల కోసం ఏ ఫీట్లయినా చేసే, మన రాజకీయ పార్టీలు, నేతలు, ఉచిత పథకాలు, సబ్సిడీలతో ప్రజల్ని ప్రలోభ పెడుతుంటారు. తాయిలాలు ప్రకటించి, తిలాపాపం తలా పిడికెలా ప్రజా ధనాన్ని దోచేస్తుంటారు. మన దేశంలో ఓట్ల పండుగ అంటే నోట్ల పండుగే!
ఎన్నికల్లో పార్టీల, రాజకీయ నాయకుల ఎజెండాలను నిర్దేశించే స్థాయిలో ప్రజలుండాలి. తమకిచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి నాయకులను నిలదీయాలి. ఒక్కసారి నోటుకు తలొగ్గితే, ఐదేళ్ళు మనం ఎన్నుకున్న నేతకు తలొగ్గాల్సి వస్తుంది. దేశంలో వనుకబడ్డ రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అయితే బీహార్ లో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రంజుగా సాగుతున్నాయి. ఓట్ల చోరీ, దొంగ ఓట్ల చేరికల ఆరోపణలతో వచ్చిన ఈ ఎన్నికలు బీహార్ తోపాటు, దేశ భవితవ్యాన్ని ప్రభావితం చేయనున్నాయి. అందుకే ప్రజలు అత్యంత జాగరూకతతో ఓట్లు వేయాలి. తాయిలాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓట్లు వేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది.
బీహార్‌లో పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తోంది. నితీశ్ సిఎంగా పెద్దగా చేసిందేమీ లేదు. అంతుకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తమ కుటుంబ సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ మొదటి నుండి రాజకీయంగా చురుకుగా ఉండే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కళింగ రాజ్యమైన బీహార్ ను పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు పాలించారు. చాణక్యుడు అక్కడే ఉండేవారు. నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచానికి మార్గం చూపింది. ఇలాంటి నేల బీహార్‌లో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది.
రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన నేల. అక్కడ చోటుచేసుకునే పరిణామాలు అనేక సందర్భాలలో దేశ వ్యాప్తంగా ప్రభావం చూపాయి. దేశ రాజకీయాలకు దిశా నిర్దేశం చేశాయి. బీహార్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ్ జనతా పార్టీని స్థాపించి దేశ రాజకీయాలను మలుపు తిప్పారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే కీలకంగా మారాయి. మరోమారు అధికారం కోసం ఎన్డీఏ ఎత్తులు వేస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నో అడ్డదారులు తొక్కుతోంది. హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ -సర్‌తో ఎన్నికల కమిషన్ స్వతంత్రత ప్రశ్నార్థకం గా మారింది. పెద్దఎత్తున ఓట్ చోరీ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి జవాబిచ్చి, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై దాడికి దిగుతోంది.
అయితే బీహార్ లో బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్య కూడా తీవ్రంగా ఉంది. కొనసాగుతున్న నిరసనల మధ్యే ఓటర్ల తుది జాబితాను, ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభకు నవంబర్ 6, 11 తేదీలలో పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాపై కూడా దుమారం రేగుతోంది. ఈ జాబితాలోని చేర్పులు, తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందచేయడంతో పాటు, వాటిని క్షేత్రస్థాయి వరకు ప్రదర్శించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
ఓట్ల తొలగింపు ఆరోపణలు చేస్తున్న రాహుల్ వాటిని రుజువు చేయడంలో విఫలమయ్యారా? సుప్రీం కూడా తొలగించిన ఓట్లకు సంబంధించి రుజువులతో అఫిడవిట్ వేయాలని సూచించినా అది ముందు పడలేదు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ ఇప్పటికే 9సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పదోసారి కూడా ఆ పదవిని ఆయన ఆశిస్తున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని తేల్చకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలకు మాత్రం నితీష్‌ను పూర్తి బాధ్యుడిని చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను మభ్య పెట్టే కుతంత్రాలకు తెరతీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ తరహా విన్యాసాలు మరింత జోరందుకోనున్నాయి.
2020లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేవలం 0.2 శాతం ఓట్ల ఆధికత్యతను మాత్రమే సాధించింది. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికలలో వ్యతిరేక ఓటు కీలకంగా మారనుంది. అదే సమయంలో ప్రతిపక్షాల మధ్య మరింత ఐక్యత రావాల్సి ఉంది. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవడంతో పాటు, ప్రజలకు నమ్మకం ఇయ్యవలసిన బాధ్యత ప్రతిపక్షాలదే!
అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు విన్యాసాలు చేస్తున్నాయి. తాజాగా 7.42 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. బీహార్ అభివృద్ధికి ఏం చేస్తారన్న దానిపై రాజకీయ పార్టీల్లో స్పష్టత లేదు. కేవలం ఓట్లు కొల్లగొట్టి కుల్లుగుత్తగా అధికారం దక్కించుకోవడం అందరిపనిగా మారింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేతల కుయుక్తులను గమనించాలి. తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.

