ఒకప్పుడు రాజకీయమంటే సేవ. సిద్ధాంతాలు. ఇప్పుడు రాద్ధాంతాలు. రాక్షసంగా జనానికి కీడు చేయడమే రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని, పదవులను పొందడమంటే, ఎలాగైనా వాటిని గుంజుకోవడంగా మారింది. అందుకు ఎంతకైనా తెగించడం, ఎంతటి నీచానికైనా ఒడిగట్టడంగా మారింది. రీతి, నీతి, జాతి, నిజాయితీ లేకుండా పోయింది.
ఇప్పుడు రాజకీయ నేతలు అధికారం, పదవులుంటేనే పెదవులు విప్పుతున్నారు. లేకపోతే గోతులు తవ్వుతున్నారు. అధికారం రాకపోతే, అది ప్రజల తప్పు. వస్తే మన గెలుపుగా బాహాటంగా జబ్బలు చరుచుకుంటున్నారు. పార్టీలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలకతీతంగా ఈ దుస్థితి పరివ్యాప్తమై, విపరీతమై, విశృంఖలమై వికృత వికటాట్టహాసం చేస్తోంది.
పార్టీ ఏదైనా వాటి చరిత్రంతా ఒక్కటే! అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!! ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్
రాజకీయాలంటేనే అధికారం, పదవులు పొందటం. ఒకప్పుడు వాటిని పొందడానికి కొన్ని విలువలుండేవి. నైతిక పద్ధతులను పాటించేవారు. మాట మీద నిలబడేవారు. ఆడిన మాట తప్పేవారు కాదు. నమ్మకంగా ఉండేవారు. ప్రజలే కేంద్రంగా ఆలోచించేవారు. అభివృద్ధే పరమావధిగా పని చేసేవారు. అనైతిక పనులకు, బంధుప్రీతి, అవినీతికి దూరంగా మసలేవారు. తాము నిర్వహించే శాఖల్లో అవినీతి జరిగితే, తాము నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవులను త్యజించేవారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ ఏ పదవీని వద్దన్నారు. వద్దన్నా ఇచ్చిన పదవికి రాజీనామా చేసిన ఘనత మన రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ది. ఎక్కడో రైలు పట్టాలు తప్పితే, ఆ తప్పిదాన్ని తనదిగా చెప్పి, రాజీనామా చేసిన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన లాల్ బహదూర్ ది. కేవలం ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతానికి కట్టుబడి, ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చే వరకు ఏ పదవినీ స్వీకరించనని చేసిన శపథాన్ని చివరికంటా నిలబెట్టుకున్న నిట్టనిలువు నిజాయితీ మన కొండా లక్ష్మణ్ బాపూజీది.
కాలం మారింది. అంతా రివర్స్ అయింది. భూతద్దం పెట్టి వెతికినా, ఇప్పుడు గాంధీలు, అంబేద్కర్ లు, లాల్ బహదూర్ లు, లక్ష్మణ్ బాపూజీలు కనిపించడం లేదు. వారి ఆనవాళ్ళను కూడా లేకుండా చేసి, అమాంతం మింగే గుంట నక్కలు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఒకప్పుడు రాజకీయమంటే సేవ. సిద్ధాంతాలు. ఇప్పుడు రాద్ధాంతాలు. రాక్షసంగా జనానికి కీడు చేయడమే రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని, పదవులను పొందడమంటే, ఎలాగైనా వాటిని గుంజుకోవడంగా మారింది. అందుకు ఎంతకైనా తెగించడం, ఎంతటి నీచానికైనా ఒడిగట్టడంగా మారింది. రీతి, నీతి, జాతి, నిజాయితీ లేకుండా పోయింది.
ఇప్పుడు రాజకీయ నేతలు అధికారం, పదవులుంటేనే పెదవులు విప్పుతున్నారు. లేకపోతే గోతులు తవ్వుతున్నారు. అధికారం రాకపోతే, అది ప్రజల తప్పు. వస్తే మన గెలుపుగా బాహాటంగా జబ్బలు చరుచుకుంటున్నారు. పార్టీలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలకతీతంగా ఈ దుస్థితి పరివ్యాప్తమై, విపరీతమై, విశృంఖలమై వికృత వికటాట్టహాసం చేస్తున్నాయి.
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, తనకు విపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానుపో అంటున్నారు. చివరకు హైకోర్టు కడప తొక్కారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు నిబంధనలు తెలియకపోవడం సిగ్గుచేటు. ఇదేం దేబురింపు? ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తేనే కాదా ప్రమోషన్ దొరికేది? పైగా గురువింద గింజ తన నలుపెరనట్లు, ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ప్రథమ కర్తవ్యంగా మారింది. అధికారంలో ఉంటే అక్రమాలకు పాల్పడడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, ఓడితే ఎదుటి పార్టీని విమర్శించడం అలవాటు చేసుకున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్లు, పార్టీల వ్యవహారాలుంటున్నాయి. అధికారం ఉన్నంత కాలం దోచుకోవడం, దాచుకోవడం, దివాలా తీయించడం చివరకు దొంగే, దొంగా దొంగా అని అరచినట్లుగా నానా యాగీ చేసేయడం, అబద్ధాలను పదే పదే చెప్పి, నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ, ఎదుటి పార్టీలపై, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నాయి. దీనికి పార్టీలు, నేతలు, ఎవరూ మినహాయింపు కాదు.
ఇందులో భాగమే పార్టీ పిరాయింపులు, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మించి, చేస్తున్న ఫిరాయింపులు అన్ని పార్టీలను ముంచే స్థాయికి చేరాయి. ఎంతటి నేతలైనా అధికార పార్టీల్లో చేరడానికి ఎంత మాత్రం సిగ్గుపడటం లేదు. రాజకీయ, సిద్ధాంత నిబద్దతలేవీ లేవు. అభివృద్ధి కోసమే అంటే చాలు అన్నీ మాఫీ అనుకుంటున్నారు. నేతలకు పార్టీలు, ప్రజలపై విశ్వాసం కన్నా, పదవులపైనే వ్యామోహం ఎక్కువగా ఉందనడానికి తాజా రాజకీయాలే ఉదాహరణ.
గతంలో కాంగ్రెస్ సృష్టించిన ‘ఆగస్టు సంక్షోభాల’కు లెక్కలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో కాంగ్రెస్ కంటికి నిద్రలేకుండా చేసి, ఏకంగా టీడీపీని విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది. ఇక ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ మారిన తన 10 ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాకుండా, బర్తరఫ్ కోసం పట్టపడుతున్నది. ఏదైనా తనదాకా వస్తే కానీ.. అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. బీజేపీ కూల్చిన విపక్ష రాష్ట్రాల ప్రభుత్వాల లెక్క ఆ పార్టీ కూడా చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ… పార్టీ ఏదైనా వాటి చరిత్రంతా ఒక్కటే! అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!!

