యెనకటికి…ఇల్లు కట్టి సూడు.. పెండ్లి సేసి సూడన్నరు. ఇల్లు కట్టుడు, పెండ్లి జేసుడు గంత కనాకష్టం అన్నమాట! మన పెద్దలు మస్తు అనుబవంతోటి గందుకే గా సామెత సెప్పిండ్లు. ఇగ గిప్పుడైతే కట్టిన ఇండ్లు గట్టిగ నిల్తలేవు. ఇగ సేసిన పెండ్లిండ్లు, యిడుపుకాయితమై పుటుక్కున తెగిపోబట్టె. ఏం జేస్తం కలికాలం! గిది సరే గనీ, గీ ఇల్లు సూడుండ్లి. ఎట్లున్నదో. బోర్న ఆన, జోర్గ వర్ద. వస్తనే ఉంది. ముంచెత్తుతనే ఉంది. గా ఇల్లు మాత్రం యేటికి ఎదురీదినట్లు గట్టిన నిలబడ్డది. గింత గూడ కరాబు కాలే. పెట్టిన గోడ పెట్టినట్లు, కట్టిన ఇల్లు కట్టినట్లే ఉన్నది. గంత వర్దల గింత గూడ కదల్ని గీదీన్ని గవాడెవడో యీడియో దీసిండు. తీసినోడు తీయక ‘‘గీ యిల్లు కట్టినోడెవడో గవాడ్ని దొరకబట్టాలె. పెద్ద పెద్ద డ్యాంలు, బిడ్జీలన్నీ గవానికే కట్టమని కాంట్రాక్టు యియ్యాలె.’ అని రాసి, ఎక్స్ కాతాల పెట్టిండు. దీన్ని సూసినోడు సూసినట్టే లైకులు కొట్టిండ్రు. షేర్లు జేసిండ్రు. సూత్తాంటే 12యేల మంది లైకులు కొట్టి, 5 లచ్చల మంది సూసిండ్రట. యిగ సూసినోడు సూసి ఊకుంటాడు. ఏదో ఒకటి రాత్తనే ఉన్నరు. ‘యీ యిల్లెవడో కాంక్రీట్తో కట్టినట్లుందే?’ అని ఒగడు ఆశీరపోయిండు. ‘యేగాదు. గీ యిల్లు కట్టినోనికి దండం పెట్టాలె!? అని మరొకడు ‘ఏమోజీ’లతోని కామెంట్లు పెట్టబట్టిండ్లు. ఇచ్చెంత్రం గాకపోతే, గంత వర్దకు గీ గింత యిల్లు ఎట్లాగిందో గదా!? యెహె, గిదంతెందుకు? మీరూ సూడుండ్లి!

