
నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని జోవులకే గ్రామానికి చెందిన బోయిన్వాడ్ వినోద్ కుమార్ తన పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మహారాష్ట్రలో ధర్మాబాద్‌లో స్థిరపడ్డ జీవితం వదిలి సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో స్థిర నివాసం లేదని కొందరు గ్రామస్తులు ఆరోపణలు చేసినప్పటికీ, వినోద్ వెనక్కి తగ్గలేదు. వెంటనే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన కంటైనర్ హౌస్‌ను కొనుగోలు చేసి గ్రామంలోని తన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అదే ఇంట్లో నివసిస్తూ, గ్రామంలో తిరుగుతూ జనాలతో మమేకమవుతూ తన ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలోని రహదారులు, మౌలిక వసతులు, శుద్ధినీరు, విద్యుత్ తోపాటు పిల్లలకు నాణ్యమైన విద్య, గ్రామస్తులకు అందుబాటులో వైద్యం వంటి సేవలను సమగ్రంగా అందించే బాధ్యత తీసుకుంటానని వినోద్ నమ్మకంగా చెబుతున్నారు. గ్రామం కోసం ఆయన తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

