మనది ప్రజాస్వామిక సమాఖ్య రాజ్యాంగం. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితేనే దేశం. రాజకీయంగా ఒకే పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉండే రోజుల నుంచి సంకీర్ణ ప్రభుత్వాల దాకా ప్రయాణం సాగుతూనే ఉంది. కేంద్రంలోనూ, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తర్వాత రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క పార్టీ మెజార్టీ సాధించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని చూరగొనలేని పరిస్థితుల్లోనే కొన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయికి, కొన్ని ప్రాంతీయ పార్టీలు చిన్నసైజు జాతీయ పార్టీల స్థాయికి చేరాయి. దీంతో భావసారూప్యం లేకపోయినా, కొన్ని పార్టీలు కలిసి రెండు కూటమిలుగా ఏర్పడి పరిపాలన సాగిస్తున్నాయి. ఈ దశలో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం కష్టంగా మారింది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ఉంటేనే అభివృద్ధి ఫలాలు అందుతాయన్న దిక్కుమాలిన సూత్రీకరణ ఒకటి ఏర్పడింది. దీంతో అందరికీ అందాల్సిన అభివృద్ధి కొందరికి, కొన్ని రాష్ట్రాలకే పరిమితమవుతోంది. డబుల్ ఇంజన్ లేకపోతే ఇక అభివృద్ధి ఢమాల్! అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి, దేశ భవిష్యత్తుకూ అంత మంచిది కాదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో లేకపోతే అంతే సంగతులా? ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు జరగవా? అక్కడి ప్రజలను దేశప్రజలుగా బీజేపీ చూడటం లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే సహకారం అందిస్తారా? ఇప్పుడు బీజేపీ వైఖరి బీజేపేతర రాష్ట్రాల్లో ఇలాగే కనిపిస్తోంది. బీజేపీ తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలపై వివక్ష, కక్షతో వ్యవహరిస్తోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ పట్ల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రజలను పీడించడం, పథకాలను ఆపడం ఎందుకు? గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలోనూ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ ఇదే జరుగుతోంది. అదే ఏపీలో ఈ ఒక్క ఏడాదిలోనే నిధులు వరదలా పారుతున్నాయి. కేంద్ర మంత్రులు ఏపీకి క్యూ కట్టారు. వరాలు కోరకపోవడమే పాపం అన్నట్లుగా అన్నీ నెరవేరుస్తున్నారు. అక్కడా అభివృద్ధి జరగడాన్ని ఎవరూ ఆక్షేపించడం లేదు. కానీ తెలంగాణను నిర్లక్ష్యం చేయడం మాత్రం ఆక్షేపనీయం. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలోని కాంగ్రెస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ లను తిట్టడానికే సరిపోతున్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు తేవడంలో ఏమాత్రం సరిపోలడం లేదు.
నిజంగానే మోడీ తెలంగాణ పట్ల కక్షసాధింపు చాటుకుంటున్నారు. మొన్నటి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు నిధులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ చక్కర్లు కొడుతూ చక్కెర వచ్చినా చిల్లిగవ్వా రాలడం లేదు. రాజకీయాలు, అభివృద్ధి వేర్వేరని అంటున్నా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాపై ఏనాడూ కేంద్ర మంత్రులు కలిసి చర్చించింది కూడా లేదు. తెలంగాణ మాత్రమే కాదు, దేశం మొత్తం మీద బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉంది.
పాలమూరు-రంగారెడ్డి మాత్రమే కాదు తెలంగాణలోని ఏ సాగునీటి పథకానికి జాతీయ హోదాను ఇవ్వలేదు. ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడడంలేదు. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపడంతో పాటు, అనేక పనులను పెండింగ్‌లో పెడుతున్నారు. కంటోన్మెంట్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ రోడ్ల విస్తరణ 12 ఏళ్లయినా ముందుకు సాగడం లేదు. విభజన సమస్యలకు తిలోదకాలిచ్చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా రాష్టాన్రికి నరేంద్ర మోడీ నిధులు కేటాయించకపోవడం గర్హనీయం. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్, వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు ఆర్థిక సాయం, తెలంగాణలోని ఇండస్టియ్రల్ కారిడార్లకు నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పడేశారు. తెలంగాణకు జాతీయ విద్యా సంస్థల కేటాయింపులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఉపాధి హామీ అటకెక్కింది. ధరలు, నిరుద్యోగిత పెరుగుతోంది. జీఎస్టీ పేరుతో బాదుడే బాదుడు. ఇక పేదలు బతికేదెలా?
రాష్ట్రాల అభివృద్ధే దేశం అభివృద్ధి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే కేంద్రం అభివృద్ధి చెందినట్లుగా జాతిపిత గాంధీజీ ఆనాడే చెప్పారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పరిపాలన, అభివృద్ధి నిరాటంకంగా, నిరంతరాయంగా కొనసాగాలి. అందుకు ఎంపీలు పని చేయాలి. పార్టీలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రజాతీర్పుననుసరించి పరిపానల జరగాలి. ప్రజాప్రతినిధులు తాము ఎలాంటి వివక్షకు, పక్షపాతానికి తలొగ్గకుండా పని చేస్తామని ప్రమాణం చేస్తారు. కానీ, ఆ వెంటనే దాన్ని మరిచిపోతున్నారు. డబుల్ ఇంజన్ సర్కారుంటేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రులు నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. ఇలాగైతే వికసిత్ భారత్ సాధ్యమేనా? అభివృద్ధి కేంద్రీక్రుతమైతే, మిగతా ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు చేయరా? రాజకీయాధికార దాహంతో సమాజంలో అశాంతిని ప్రోత్సహిస్తారా? ఇందుకేనా మీకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది? అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారో లేదో చెప్పలేం కానీ, అదే అభివృద్ధికి దూరమైన ప్రజలు మాత్రం కచ్చితంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు.

