-ఇప్పుడు STATE|రాష్ట్ర అప్పుల భారం రూ. 8,06,298 కోట్లు
-అప్పులపై చెల్లించే వడ్డీలు, కిస్తీలు రూ. 39,396 కోట్లు
-రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ. 2,30,346 తలసరి అప్పు
-దేశంలో కేంద్ర ప్రభుత్వాలు చేసే అప్పు భారం అదనం
-రాష్ట్రావతరణ వేళ! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఎలా?
-JUNE 2ND|జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం|STATE FORMATION DAY సందర్భంగా…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తునాయి. మరి రాష్ట్రం సరైన అభివృద్ధి పథంలోనే పయనిస్తున్నదా? నిర్ణీత లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకే పరిపాలన సాగుతోందా? రాష్ట్ర సాధన ఆశయాలు అమలు జరుగుతున్నాయా? రాజకీయ దుమారంలో అన్నీ కొట్టుకుపోతున్నాయా? రాష్ట్రావతరణ జరుపుకోబోతున్న ఈ తరుణంలో ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ పురోగతికి పునరంకితం అవుదాం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తునాయి. మరి రాష్ట్రం సరైన అభివృద్ధి పథంలోనే పయనిస్తున్నదా? నిర్ణీత లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకే పరిపాలన సాగుతోందా? రాష్ట్ర సాధన ఆశయాలు అమలు జరుగుతున్నాయా? రాజకీయ దుమారంలో అన్నీ కొట్టుకుపోతున్నాయా? రాష్ట్రావతరణ జరుపుకోబోతున్న ఈ తరుణంలో ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
సుదీర్ఘ సమిష్టి పోరాటాల అనంతరం, ఎన్నో త్యాగాల పునాదులతో శాంతియుత మార్గంలో రాష్ట్రం సాధించుకున్నాం. మొదటి తొమ్మిదిన్నరేళ్ళు బీఆర్ఎస్ పాలించింది. ఈ ఏడాదిన్నరగా కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు, అవినీతి, బంధుప్రీతి, కుటుంబం పాలన, విపరీతమైన భూ దందాలు, తెలంగాణ ఆత్మగౌవరం, అవమానాలు తట్టుకోలేని ప్రజలు ఆపార్టీ పాలనకి తిలోదకాలిచ్చి, కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మంచి మెజార్టీనిచ్చారు. కేవలం ప్రజాకర్షక పథకాలకు లోనై కాకుండా, ఆత్మాభిమానం, నిజమైన అభివృద్ధి కోసం ప్రజలు మార్పును కోరుకున్నారు. నిజంగా ఇప్పుడు ఆ మార్పుకనుగుణంగానే పరిపాలన సాగుతోందా? రాష్ట్రం ప్రగతి పథంలోనే పయనిస్తోందా? ప్రజాపాలన ప్రజారంజకంగానే ఉందా? ప్రశ్నించుకోవాల్సిన, ప్రయాణాన్ని సరిదిద్దుకోవాల్సిన సరైన సమయం కూడా ఇదే.
రాష్ట్రం ఏర్పడి కేవలం 11 ఏళ్ళే, అంటే శైశవ దశే, తెలంగాణ ఇంకా పసికూనే అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, కాల క్రమంలో ఈ 11ఏళ్ళ ప్రయాణం చిన్నదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రం సహా, గడిచిన పాలన అనుభవాల గుణపాఠాలను గుర్తెరిగి ముందుకు సాగాల్సి ఉంది. ఏర్పడేనాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 75వేల కోట్ల అప్పుతోపాటు, మిగులు బడ్జెట్ తో మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర అప్పుల భారం రూ. 8,06,298 కోట్లు కు చేరింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.5.04 లక్షల కోట్ల అప్పులున్నాయి. కార్పొరేషన్ల పేరిట ఉన్న అప్పు రూ.3.01 లక్షల కోట్లు. వీటికి 2025-26లో చెల్లించే వడ్డీలు, కిస్తీలు కలిపి రూ. 39,396 కోట్లు. ఈ విధంగా చూస్తే, రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ. 2,30,346 తలసరి అప్పు ఉంది. ఇక తాజా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53వేల కోట్లు అవుతుంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు సరేసరి. బడ్జెట్లో సగం జీతాలకు పోతే, ఇక మిగిలేది ఏంటి? 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా, ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది.’ అన్నారు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మనం సాధించింది అభివృద్ధా? అప్పేనా? పునస్సమీక్షించుకోవాలి.
ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు సహా, ఇంకా అనేకానేక సమస్యలు మిగిలే ఉన్నాయి. కొత్తగా సమస్యలు ఎలాగూ వస్తాయి. కానీ పాతవి పాతుకుపోతే, కొత్తవాటిని ఎదుర్కోవడం కూడా కష్టమే. నిజానికి అప్పుల భారం ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదు. ఉన్నంతలో మెరుగైన పాలన ఇవ్వాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది. ఈ క్రమంలో పార్టీపైనా, ప్రభుత్వంపైనా, పాలనపైనా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పట్టు బిగించాల్సి ఉంది. దుబారా ఖర్చులపై కేసీఆర్‌ను నిందించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడుచేస్తున్నది కూడా అదే. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టకపోతే పాతగతే ఇప్పటి పాలకులకు పట్టడం ఖాయం. ఆర్థిక క్రమ శిక్షణ, మరిన్ని కఠిన నిర్ణయాలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి.
ఇదే సందర్భంలో ఖజనాకు, ప్రజలకు భారంగా మారుతున్న పలు పథకాలను సమీక్షించుకోవడం కూడా ముఖ్యమే. విద్యుత్ వాడకంపై నియంత్రణ లేకుంటే ఉచిత పథకాలు మెడకు చుట్టుకుంటాయి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని గుర్తించాలి. మున్ముందు మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ ఆర్థిక స్థితిని బట్టి, ఆలోచించాలి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని రేవంత్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రజల ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటూ ఉండాలి. కాళేశ్వరం లాంటి నిర్మాణాలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయనేది సీఎం వ్యాఖ్యలను బట్టి తెలుస్తూనే ఉంది. ఆర్థిక పరిస్థితిపై మాట్లాడితే, తెలంగాణ పరువు తీస్తున్నారని కేటీఆర్, హరీష్ రావులు అంటున్నారు. అప్పులు చేసేటప్పుడు కూడా వారు పోతున్న పరువు గురించి ఆలోచించి ఉంటే ఇప్పుడు పోయిన పరువు గురించి బాధపడే పరిస్థితి ఉండకపోయేది కదా?
ఉచితానుచితాలపై పునస్సమీక్ష జరిగితే మంచిది. ప్రభుత్వానికి భారంగా మారిన పథకాలు, విధానాలను సవరించుకోవడంలో తప్పులేదు. ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని పథకాలను కొనసాగించడం తప్ప చేసేదేమీ లేదని భావించాల్సిన అక్కర లేదు. సరిగ్గా చెప్పగలిగితే ప్రజలు వింటారు. అర్థం చేసుకుంటారు. ప్రజలు కూడా ప్రభుత్వాలు తద్వారా తాము అప్పుల్లో కూరుకుపోవాని కోరుకోరు కదా? ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని పరిమితం చేయాలి. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కుటుంబం కంటే ప్రభుత్వం సామాజిక బాధ్యతతో కూడినది. అత్యంత జాగ్రత్తగా, క్రమశిక్షణతో నడిపినప్పుడే అటు ప్రభుత్వానికి, ఇటు పాలకులకు, పరిపాలనకు కూడా అర్థం పరమార్థం ఉంటుంది.

