భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రాణం నమ్మకం. శాస్త్రాలు, పురాణాలు, దేవాలయాలు, విగ్రహాలు.. ఇవన్నీ ఆ నమ్మకానికి ప్రతిరూపాలే. అయితే ఈ నమ్మకాన్ని అత్యంత సహజంగా, ప్రకృతితో మమేకమై వ్యక్తపరిచే ఆధ్యాత్మిక ఆచారం ఏదైనా ఉందంటే, అది మేడారం సమ్మక్క–సారలమ్మల గిరిజన జాతరే. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది ప్రజల విశ్వాసానికి, ప్రకృతి పట్ల గౌరవానికి, సామాజిక సమానత్వానికి నిలువెత్తు ప్రతీక.
మేడారం జాతర ప్రత్యేకత గుళ్ళు కాదు, ఘంటల శబ్దం అంతకన్నా కాదు. ఆర్భాట పూజలు అసలే కాదు. అడవి మధ్యలో, రెండు గద్దెలు, కొద్దిపాటి కుంకుమ, బెల్లం అంతే. ఆ స్థలంలో కోట్లాది మంది హృదయాలు భక్తి పారవశ్యంతో కలిసిపోతాయి. ఇది వ్యవస్థాపిత మతాచారాలకు భిన్నంగా, ప్రజల నుంచే పుట్టిన ఆధ్యాత్మిక ఉద్యమం. అందుకే మేడారం జాతరను ఒక ప్రజాస్వామ్య ఆధ్యాత్మికతగా చెప్పవచ్చు.
సమ్మక్క–సారలమ్మల గాథలో దేవతలకంటే ముందుగా మనకు కనిపించేది మానవత్వం, త్యాగం, పోరాటం. వారు రాజులుగా జన్మించలేదు. ఆలయాల్లో ప్రతిష్ఠింపబడలేదు. అడవిలో పుట్టిన గిరిజన మహిళలు. అయినా, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమే వారిని దేవతలుగా మలిచింది. ఈ కథ భారతీయ దేవతా సంప్రదాయంలో ఒక విప్లవాత్మక సందేశాన్ని ఇస్తుంది. దైవత్వం జన్మతో కాదు, గుణంతో వస్తుందని.
కాకతీయుల వంటి శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎదురించిన కోయ గిరిజనుల పోరాటం చరిత్రలో ఓ మరిచిపోయిన అధ్యాయం. ఆయుధాలు లేని ప్రజలు, రాజ్యాధికారానికి ఎదురు నిలబడ్డారు. ఆ పోరాటంలో ఓడిపోయినా, వారి ఆత్మవిశ్వాసం ఓడలేదు. అదే విశ్వాసం తరతరాలుగా జాతర రూపంలో కొనసాగుతోంది. అందుకే మేడారం జాతర ఒక చారిత్రక స్మృతి, ఒక సామూహిక ఆత్మగౌరవ ప్రదర్శన.
ఈ జాతరలో మరో విశేషం ప్రకృతితో ఉన్న అనుబంధం. చెట్టు, పుట్ట, వాగు, వంక, ఆకు, అడవి అన్నీ పూజా స్థలాలే. ఇది మన ఆధునిక సమాజానికి ఇవ్వాల్సిన కీలక సందేశం. అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేస్తున్న ఈ కాలంలో, మేడారం జాతర ప్రకృతి సంరక్షణకు ఒక నైతిక హెచ్చరికలా నిలుస్తుంది. ప్రకృతిని దైవంగా చూసే సంస్కృతి ఉన్నంతకాలం, మనిషి ప్రకృతిని సంపూర్ణంగా విధ్వంసం చేయలేడు.
ప్రభుత్వాలు మేడారం జాతరను నిర్వహణ పరంగా ఒక పెద్ద సవాలుగా చూస్తున్నాయి. రోడ్లు, తాగునీరు, వైద్యం, భద్రత వంటివన్నీ అవసరమే. కానీ, అభివృద్ధి పేరుతో జాతర ఆత్మను దెబ్బతీయకుండా ఉండటం కూడా మరింత ముఖ్యమైన బాధ్యత. మేడారం జాతరను ఒక టూరిస్ట్ ఈవెంట్‌గా నిర్వహించే, మార్చే ప్రయత్నాల వల్ల దాని సహజత్వం సమూలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది గిరిజనుల పండుగ, వారి ఆచారం అనే మూలసూత్రాన్ని మరవకూడదు.
కుంభమేళాతో పోలుస్తున్న మేడారం జాతర సంఖ్యాపరంగా గొప్పదే కావచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఇది భిన్నం. అక్కడ శాస్త్రాల ఆధారం ఉంటే, ఇక్కడ నమ్మకం ఆధారం. అక్కడ పూజారి వ్యవస్థ ఉంటే, ఇక్కడ గిరిజన సంప్రదాయం. ఈ భిన్నత్వమే మేడారాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
మేడారం జాతర మనకిచ్చే సందేశం సుస్పష్టం. దైవత్వం ఎక్కడో లేదు. ప్రజల మధ్యే ఉంటుంది. శక్తి ఆయుధాల్లో కాదు. విశ్వాసంలో ఉంటుంది. దేవుడు ఆలయాల్లోనే కాదు. అడవుల్లోనూ ఉంటాడు. సమ్మక్క–సారలమ్మలు దేవతలయ్యారు కాబట్టి పూజింపబడటం లేదు. ప్రజల కోసం పోరాడారు కాబట్టే దేవతలయ్యారు. ఇదే మేడారం జాతర అసలైన తాత్త్విక సారాంశం.

