‘మంత్రాలకే కాదు, మాటలకు కూడా చింతకాయలు రాలవు!’ గడిచిన పదేళ్ళు కేసీఆర్ మాటలకు ఓట్లు రాలాయి. ఉద్యమ సమయం సహా, ఆయన మాటలే తెలంగాణ రాజకీయాలను నడిపించాయి. ఉద్యమ నాయకుడిగా, ఆపై పరిపాలకుడిగా ప్రజలను ప్రభావితం చేసిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ అదే మాటల గారడీతో రాజకీయ పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రజల మనోభావాలు, రాజకీయ సమీకరణలు మారాయి. ఈ దశలో కేసీఆర్ సెంటిమెంట్ భావోధ్వేగాల ప్రయోగాలు ఫలిస్తాయా?
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
‘మంత్రాలకే కాదు, మాటలకు కూడా చింతకాయలు రాలవు!’ గడిచిన పదేళ్ళు కేసీఆర్ మాటలకు ఓట్లు రాలాయి. ఉద్యమ సమయం సహా, ఆయన మాటలే తెలంగాణ రాజకీయాలను నడిపించాయి. ఉద్యమ నాయకుడిగా, ఆపై పరిపాలకుడిగా ప్రజలను ప్రభావితం చేసిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ అదే మాటల గారడీతో రాజకీయ పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రజల మనోభావాలు, రాజకీయ సమీకరణలు మారాయి. ఈ దశలో కేసీఆర్ సెంటిమెంట్ భావోధ్వేగాల ప్రయోగాలు ఫలిస్తాయా?
2023 ఎన్నికల ఫలితాల తర్వాత రెండేళ్ళుగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు ‘తోలు తీస్తా, నేనే స్వయంగా రంగంలోకి దిగుతా’నంటూ చేసిన రాజకీయ పునరాగమనం తెలంగాణలో చర్చనీయాంశమైంది. కానీ విపక్ష నేతగా ఆయన పాత్ర ప్రజాస్వామ్య ప్రమాణాలకు తగినట్టుగా ఉందా? అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో వెనుకడుగు వేయడం వల్ల ఆయన విపక్ష పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు, గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ-కార్ రేసింగ్ వంటి అనేక అవినీతి ఆరోపణలపై మౌనం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, విమర్శకులను బెదిరింపు భాషతో నిలువరించడం సాధ్యమేనా? అది రాజకీయ పరిపక్వతగా భావించవచ్చా? పాలనలో జరిగిన తప్పిదాలను అంగీకరించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయడమే హుందాతనం. స్టేట్స్ మన్ షిప్. కానీ, ఆ దిశగా కేసీఆర్ అడుగులు కనిపించడం లేదు.
ఇప్పుడు మళ్ళీ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అంటూ మరోసారి నినదించాలన్న ఆలోచన వెనుక సెంటిమెంట్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్ళు గడిచిన తర్వాత ఇంకా అదే భావోద్వేగాలపై చలి మంటలు కాగాలనుకోవడం, రాజకీయాలు చేయవచ్చని భావించడం, ప్రజల రాజకీయ అవగాహనను తక్కువగా అంచనా వేయడమే. తెలంగాణపై బీఆర్‌ఎస్‌కే పేటెంట్ ఉన్నట్టు మాట్లాడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
వరుస ఎన్నికల ఓటములు నేపథ్యంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయంలో, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పాత నినాదాలనే ఆశ్రయించడం ఆందోళన కలిగించేదే. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లభించిన ఫలితాలు, కాంగ్రెస్ సాధించిన విజయాలు రాజకీయ సమీకరణాల్లో మార్పును స్పష్టం చేస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావులతో సరిపోదని భావించే, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, కేసీఆర్ కుటుంబ, బీఆర్‌ఎస్ అంతర్గత సమస్యలు గత పాలన లోపాలను బట్టబయలు చేస్తున్నాయి. కవిత జనజాగృతి బాటలో నాటి పాలనా వైఫల్యాలపై, అవినీతిపై, కబ్జాలపై సాక్ష్యాధారాలతో చేస్తున్న విమర్శలు ప్రజలను, ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో జరిగిన ప్రచారం డొల్లతనం గుట్టు విప్పుతుండటం విపరీత వైచిత్రమే. కవిత విమర్శలు, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి పొందే ప్రయత్నమా? లేక నష్ట నివారణ వ్యూహమా? అన్నది కాలమే తేల్చాలి.
అయితే, ప్రస్తుతం మళ్లీ కృష్ణా జలాల అంశాన్ని కేసీఆర్ రాజకీయ ఆయుధంగా ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని, మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం ద్వారా ప్రాంతీయ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలన్న పాత చింతకాయ పచ్చడి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్ వాడైనప్పుడు, తన సొంత జిల్లాకు ద్రోహం చేస్తారని ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయా? ఆధారాలు లేని ఆరోపణలు రాజకీయ లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయేమో!
2018లో చంద్రబాబు బూచీని చూపించి కేసీఆర్ విజయం సాధించారు. 2023లో అదే వ్యూహం పనిచేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పాత ఫార్ములాని కొత్తగా ప్రయోగించడం రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుందన్నది సందేహమే. విభజన జరిగిన పుష్కరకాలం తర్వాత కూడా ప్రజలు ఇప్పుడు, భావోద్వేగాలను కోరుకోవడం లేదు. పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతలను కోరుకుంటున్నారు.
కేసీఆర్ పునరాగమనం కేవలం రాజకీయ సంఘటన మాత్రమే సంచలనం మాత్రం కాదు. ఉద్యమ కాలపు భావోద్వేగాలు శాశ్వతం కావని, ప్రజలు అదేపనిగా మోసపోరని గత వరుస ఎన్నికలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. గత తప్పిదాలను అంగీకరించి, సరిదిద్దుకొని, కొత్త రాజకీయ భాషను, పంథాను ఎంచుకోకపోతే, ఈ పునరాగమనం కూడా మరో విఫల ప్రయోగంగానే మిగిలే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఎప్పుడూ ప్రజలదే.

