లెఫ్ట్ పార్టీలకు నెలవైన కేరళ తిరువనంతపురం మున్సిపాల్టీలో బీజేపీ విజయం సాధించిన సమయ, సందర్భంలోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అదే బీజేపీ స్వతంత్రులకంటే తక్కువ సీట్లతో నాల్గో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభసభ్యుడు ఉన్న బీజేపీ, ఇంత దారుణంగా విఫలమవడం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జీర్ణించుకున్నా, మోదీ ఆమోదించలేరు. ఈ ఫలితాలకు రెండు రోజుల ముందే ఢిల్లీలో తెలంగాణ, ఏపీ, అండమాన్ నికోబార్ దీవుల ఎంపీల సమావేశంలో మోదీ ఒకింత అసహనాన్ని ప్రదర్శించారు. ఏపీలో తమ పార్టీ, ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూనే, తెలంగాణ నాయకత్వాన్ని చీల్చి చెండాడారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వ పనితీరుకు ఈ ఘటనలు ఉదాహరణలు.
తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిన పరాభవం నుంచి తేరుకోక ముందే, పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫలితాలతో తెలంగాణలో బీజేపీ బలపడటం ఇప్పట్లో సాధ్యం కాదన్న భావన రాజకీయ వర్గాల్లోనే కాదు ఆ పార్టీ శ్రేణులో బలంగా వ్యక్తమవుతోంది.
బీజేపీకి తెలంగాణలో ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీలతోపాటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలలో రాజాసింగ్ ని పార్టీ దూరం చేసుకున్నది. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు? వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో వారికి సానుకూల ఫలితాలు రాలేదు. ఒకవైపు పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్న సందర్భాలు, మరోవైపు అదే పార్టీకి ఎన్నికల్లో నిరాదరణ దేనికి సంకేతాలు? ఇది కచ్చితంగా ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల లోపమే!
ఏపీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం సమన్వయంతో కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టుకుంటున్నారని కూడా మోదీ నిష్టూరపడ్డారు. ఏపీలో టీడీపీతో జతకట్టడం కలిసి వచ్చిందనీ చెప్పారు. నిజమే, ఇటీవలి కాలంలో ఏపీకి కేంద్రం నుండి లభిస్తున్న సహకారాన్ని చూస్తే మిగతా రాష్ట్రాలకు ఈర్ష్య కలగకమానదు. ఆ రాష్ట్ర ఎంపీలు చొరవతో చేస్తున్న ప్రయత్నాల ఫలితమది. అదే తెలంగాణ బీజేపీకి ఏపీకి మించి రాజ్యసభ సభ్యుడిని కలుపుకుని, 9మంది ఎంపీలనిచ్చింది. అదే బీజేపీ తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులనిచ్చింది. అయినా పరస్పర ప్రయోజనాలేవీ కనిపించడం లేదు. మోదీ నిందించినట్లు, ఎప్పుడు చూసినా ఢిల్లీలో అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో ఉండే కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నట్లు? రాష్ట్ర సమస్యలు పరిష్కరించి, ఢిల్లీ నుంచి నిధులు తేవడంలో, రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో, పార్టీ శ్రేణులతో సమన్వయంలో, చివరకు ప్రజలతో మమేకమవడంలోనూ విఫలమవుతున్నారు. అందుకే కేంద్రమంత్రులను, బీజేపీ నేతలను తరచూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తూనే ఉన్నారు. ప్రతిగా ప్రగల్బాలే తప్ప రాష్ట్ర ప్రగతి కోసం తెచ్చిందీ, సాధించిందీ ఏమీ లేదు.
రాష్ట్రానికి గణనీయమైన ప్రాజెక్టు, నిధులు రాలేదు. కనీసం రోడ్ల పరిస్థితి కూడా మెరుగుపడలేదు. ఇవి ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. కంటోన్మెంట్ భూముల బదలాయింపు పెండింగులోనే ఉంది. రాష్ట్రం ఏదైనా కోరితే కేంద్రం నుంచి కొర్రీలు తప్ప ఫలితం కనిపించడంలేదు.
ఇదిలావుంటే, అత్యంత క్రమశిక్షణ గల బీజేపీలో కాంగ్రెస్ ను మించి అంతర్గత కుమ్ములాటలు గతంలో ఎన్నడూ లేనంతగా బహిర్గతమవుతున్నాయి. కేంద్రమంత్రులిద్దరికీ పడదు. ఎంపీలది, ఎమ్మెల్యేలది ఎవరి దారి వారిదే. కీలక నేతల మధ్య పొసగదు. ప్రజా సమస్యల సాధన అటుంచి సఖ్యత, సమన్వయం ఉండదు. గల్లీలో ప్రజల్లో, ఢిల్లీలో పార్టీలో, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నట్లుగా కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం కనిపించదు.
ఐదేళ్ళ క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ, కారణాలేవైనా అసెంబ్లీ ఎన్నికల నాటికి చతికిల పడింది. అధికారంలోకి వస్తామని ఆశించిన బీజేపీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ముఖం చూసి ఆ మాత్రం ఎంపీలనిచ్చారు. బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైందన్న ప్రచారం బీజేపీకి మరింత నష్టం కలిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి రావాల్సిన బీజేపీ చేజేతులా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది. ఉప ఎన్నికల్లోనూ విఫలమైంది. తాజా సర్పంచ్ ఎన్నికల్లోనూ నాల్గో స్థానానికే పరిమితమైంది. స్వతంత్రులకు కలిపి వచ్చిన స్థానాలు కూడా బీజేపీకి రాకపోవడం దయనీయమే. అయితే, ప్రజలకు రెండో ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన బీజేపీ వరుస వైఫల్యాల వల్ల, రేపు బీఆర్ఎస్ కూడా దూరం పెట్టదనే గ్యారెంటీ లేదు. ప్రజలకు దూరమవుతున్న బీజేపీ, అధికారానికే కాదు, కలిసి రావాల్సిన పార్టీలకు కూడా దూరం కాక తప్పదు. బీజేపీ వైఫల్యాలకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వ విధి విధానాలు, పార్టీ సంస్థాగత లోపాలే కారణం. మరి ఆలోపాలను ఆ నాయకత్వాలు సరిదిద్దుకుంటాయా? వేచి చూడాలి.

