మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి వేరు, మానవులు వేరనే అర్థం. కోతులు మనుషులతో సహా సిమీఫార్మీస్ ఇన్ఫ్రా క్రమానికి చెందిన జంతువులు. వీటి పేరున ‘కోతి కొమ్మచ్చి’ అనే ఆట ఉంది.
రామాయణం ప్రకారం త్రేతాయుగంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంలో రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. భక్తి శ్రద్ధలతో పూజించే ఆంజనేయుడు వానర రూపంలోనే వర్ణించబడ్డాడు. మిగిలిన భాషలతో పోలిస్తే భారతీయ సినిమాలో కోతుల పాత్ర అధికం. కోతులను దైవ రూపాలుగా, ఆపదలో సహాయకులుగా ఇప్పటికీ వాడుతున్నారు. సర్కస్ లో ఇవి చేసే విన్యాసాలు పిల్లలు, పెద్దలకు వినోదాన్ని పంచుతాయి. దేవాలయాలలో యాత్రికులకు ముందుగా స్వాగతం చెప్పేవి కోతులే. ఏదైనా ఇస్తే తీసుకొంటాయి లేకపోతే లాక్కుంటాయి. ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధ పరీక్షలను మొదట కోతులపై చేస్తుంటారు. వాటిపై విజయవంతమైన తర్వాతే, మనుషులపై ప్రయోగిస్తారు.
కోతులు ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో, అడవులు, పర్వతాలు, నగరాల్లో నివసిస్తాయి. భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాలలో కోతులు విస్తృతంగా కనిపిస్తాయి. ఆయా దేశాల్లో అనేక జాతులు ఉన్నాయి. కోతులు చెట్లపై నివసిస్తాయి, బాబూన్‌లు వంటివి నేలపై కూడా ఉంటాయి. ఇవి వర్షారణ్యాలు, గడ్డి భూములు, పర్వతాలు, మానవ నివాస ప్రాంతాల దగ్గర కూడా కనిపిస్తాయి. భారతదేశంలో లంగూర్స్, మకాక్‌లు, గిబ్బన్‌లుంటాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో కోతులు ఉన్నాయి. మానవ నివాసాలకు దగ్గరగా జీవిస్తూ, ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణలో 35 లక్షలకు పైగా కోతులు ఉన్నట్లు అంచనా.
కోతుల గురించి ఇంత ఎందుకు? అంటే, కోతుల సమస్యను తెలంగాణ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్థావించి, చర్చనీయాంశం చేశారు. ఆఫ్ట్రాల్ కోతుల గురించి, పార్లమెంట్ లో ప్రస్థావనా? అని కొట్టిపారేయొద్దు. రేగొండలో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ‘మా గ్రామంలో కోతులను పారదోలే వారికే మా ఓటు’ అని ప్రజలు ప్రకటించేంతగా, వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి! 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కోతులు లేకుండా చేస్తానని హామీ ఇవ్వడమే కాదు, కోతులను పట్టించి, మరీ పోటీకి దిగారు. మాజీ సీఎం కేసీఆర్, గ్రామాల నుండి కోతులు వాపస్ పోవాలంటే, అడవుల పెంచాలెనని, కోట్లాది డబ్బు పెట్టి, ‘హరితహారం’ పథకాన్నే ప్రారంభించారు. అయినా కోతులు పోలేదనుకోండి. అది వేరే విషయం. అయితే, కోతుల బెడద తీవ్రతకు ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.
అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, పంట పొలాలు, గ్రామాల శివార్లు మాత్రమే కాకుండా, ఇళ్లు, పశువుల పాకలు వరకు కోతుల దాడులు విస్తరించాయి. పంటలను నాశనం చేయడం, పిల్లలను భయపెట్టడం, మహిళలపై దాడులు, ఆస్తి ధ్వంసం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. అయితే, కోతులను అరికట్టే వ్యూహాలేవీ ప్రభుత్వాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అడవులు తరిగిపోవడం, ఆహార కొరత, మానవ దాడుల కారణంగా నివాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. కోతుల వల్ల అనేక కుటుంబాలు, ముఖ్యంగా రైతులు తమ పంటలు ధ్వంసమవుతుండటంతో ఆర్థికంగా దెబ్బతింటున్నారు.
ప్రధానంగా రైతులు, వ్యవసాయాధారిత కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది. పైగా కోతులు గుంపులుగా దాడి చేసినప్పుడు పిల్లలు, వృద్ధులు గాయపడే ఘటనలు పెరుగుతున్నాయి. మహిళలు ఇంటి పనుల్లో ఉండగా కోతులు లోపలికి చొరబడటం, తినుబండారాలు, ఆభరణాలు, దుస్తులు లాగేయడం రోజువారీ సమస్యగా మారింది. ఇది కేవలం గ్రామీణ జీవనశైలిని దెబ్బతీయడం మాత్రమే కాదు, భద్రత లోపాన్ని కూడా సూచిస్తోంది.
ఈ సమస్యను కొండా విశ్వేశ్వర్ రెడ్డి లోక్‌సభలో ప్రస్థావించడం ఆహ్వానించదగ్గ, ప్రశంసనీయ పరిణామం. సమస్య స్థానికమైనా, జాతీయ వేదికపై చర్చించడం అవసరం. కోతులతో పర్యావరణ అసమతుల్యత, మానవ-జంతు సహజీవనం-సమరం, వ్యవసాయ నష్టం, ఆహార కొరత-భద్రత, ప్రజల భద్రత వంటి కీలక అంశాలు ఇమిడి ఉన్నాయి. రైతులు, జొన్న, మక్కజొన్న, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు సాగు చేయడం మానేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే, సాగు తగ్గి, ఆహార కొరత ఏర్పడటం ఖాయం.
ఈ ప్రస్థావనతోనైనా కోతుల నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే అవకాశం ఉంది. కోతులు, వాటి సంచార మార్గాలపై అధ్యయనం, అడవుల పునరుద్ధరణ, కోతుల పునరావాస కేంద్రాలు, శాస్త్రీయంగా జనాభా నియంత్రణ, గ్రామాల్లో కోతుల ప్రవేశాన్ని నిరోధించడం వంటి సూచనలు అమలు చేయాలి. ఈ సమస్య పరిష్కారానికి దీర్ఘకాల కార్యాచరణ అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ, పశుసంవర్థక శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. రైతులకు నష్ట పరిహార పథకాలు అందించాలి. కోతుల సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందనే ఆశిద్దాం.

