ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ఈ రెండు ఘోర సంఘటనలు మనం ఏ దిశగా సాగుతున్నామని సమాజాన్నే కాక ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రశ్నిస్తునాయి. నిలదీస్తున్నాయి. మట్టిలో కలుస్తున్న మానవత్వానికి భయానక సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ దారుణాలు కేవలం నేరాలు మాత్రమే కాదు. మన సమాజంలో క్షీణిస్తున్న విలువలు, పెరుగిపోతున్న హింసాత్మక ధోరణులు, చిన్న చిన్న విభేదాలకే భయంకరమైన దాడులకు పాల్పడే దౌర్భాగ్యాన్ని, బాధితులను రక్షించడంలో వ్యవస్థల లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
యూనిసెఫ్-2024 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా పిల్లలు, మహిళలు దాడులకు గురవుతున్నారు. 65 కోట్ల మంది అంటే ప్రతి 5గురిలో ఒకరు పరోక్షంగా ఆన్‌లైన్, మానసిక హింసలకు గురవుతున్నారు. భారతదేశంలో నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2023లోనే మహిళలపై 4,48,211 దాడుల కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మంది మహిళలలో సగటున 66.2 కేసులు నమోదైనట్టు. తెలంగాణలో 2023లో 23,679 కేసులు నమోదయ్యాయి, ప్రతి లక్ష మంది మహిళల్లో 124.9 కేసులు నమోదయ్యాయి. ఇది దేశ సగటు రేటు 66.2తో పోలిస్తే రెండింతలు. ఆంధ్రప్రదేశ్ లో 2023లో 22,418 కేసులు నమోదయ్యాయి. ఇక పిల్లలపై హింస విషయంలో దేశంలో 2023లో 1,77,335 కేసులు నమోదు అయ్యాయి.
ఇలాంటి దాడులు ఆ ఒక్కరికే నష్టం కలిగించవు. ఆ కుటుంబంతోపాటు మొత్తం సమాజం మీద ప్రభావాన్ని చూపుతాయి. భద్రత లేని, నిత్యం ప్రమాదంలోనే ఉన్నామన్న భావన ప్రజల్లో భయానక మానసిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. నేరాలు పెరగడం ఒకవైపు, నేరస్థుల్లో శిక్షల భయం లేకపోవడం మరోవైపు, సమాజాన్ని అశాంతి దిశగా నెట్టేస్తున్నాయి.
న్యాయ వ్యవస్థ, పోలీస్ విభాగం, ప్రభుత్వ యంత్రాంగం పై నమ్మకం సన్నగిల్లడమేగాక, అవి బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు బలపడతాయి. నేరాలు జరిగాకే స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోగల సామర్థ్యం, చొరవ ఆ వ్యవస్థల్లో కనిపించాలి. తీవ్రమైన నేరాలకు దారితీసే సామాజిక కారణాలను గుర్తించి, వాటిపై అవగాహన, కౌన్సెలింగ్, కమ్యూనిటీ పోలిసింగ్ వంటి చర్యలు చేపట్టడం అత్యవసరం.
అన్నింటికంటే స్కూల్ నుండి కాలేజీల వరకు యువతలో విలువల విద్యను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. మహిళలపై దాడులు, చిన్నారులపై హింస వంటి దారుణాల మూలాల్లో పితృస్వామ్య ధోరణులు, కోప నియంత్రణలో వైఫల్యం, అసూయ, అసహనం వంటి మానసిక రుగ్మతలు ఉంటాయి. వీటిని విద్య ద్వారానే మార్చగలం. ఇంటి నుండి పాఠశాల, సమాజం వరకు పిల్లల్లో పరస్పర గౌరవం, బాధ్యత, సానుభూతి వంటి విలువలు పెంపొందితేనే సమాజంలో శాంతి నెలకొంటుంది. మరోవైపు, నేరాలకు పాల్పడినవాళ్ళకు గట్టి శిక్షలు పడి, అవి వెంటనే అమలయ్యేలా ప్రత్యేక కోర్టులు పనిచేయాలి. ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క.