రాజకీయ పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. అసలు అవినీతే లేదనడం హాస్యాస్పదం. అవినీతి వెలుగు చూస్తుండటం సాధారణం. పెచ్చుమీరిన అవినీతి అసాధారణం. ఇప్పుడు అవినీతి వ్యక్తుల నుండి వ్యవస్థల దాకా వ్యవస్థీకృతమైంది. అవినీతి సర్వత్రా వర్జయేత్! అనే దురవస్థలు వ్యాపించాయి. అవినీతి లేనిదెక్కడ? అంతా అవినీతిమయమే అనేంతగా విస్తరించాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రెండేళ్ల వార్షికోత్సవాలను ప్రజాపాలన దినోత్సవాలుగా ఘనంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే, ప్రభుత్వంలో, పార్టీలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా, దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వంలో, పార్టీలో ఎవరికి వారే యమునాతీరేగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల మధ్య మాటలే లేవు. నేతల మధ్య సఖ్యత లేదు. శాఖలు, అధికారుల మధ్య సమన్వయం లేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపై నడపగలిగే సత్తా ఉన్న నేతలే లేకుండా పోతున్నారు. పార్టీలైనా, నేతలైనా, వ్యక్తులైనా అధికారం అవినీతి చుట్టూ పెనవేసుకుపోతోంది. పదేళ్ళ బీఆర్‌ఎస్ అవినీతిని పదే పదే విమర్శిస్తూ, కాంగ్రెస్ లో పెచ్చరిల్లుతున్న ఆవినీతిని కప్పిపుచ్చుకోలేరు. పైగా బీఆర్ఎస్ అవినీతిని విమర్శలతో పబ్బం గడుపుకోవడం తప్ప, చేతలతో రుజువు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. గడిచిన రెండేళ్ళల్లో బీఆర్ఎస్ ఒక్క అవినీతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఆపార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టలేకపోయింది. పైగా అదే అవినీతిలో కూరుకుపోతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది.
సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మానాన తాను పోతున్నట్లుగా ఉంది. ఇటీవల మంత్రుల మధ్య కుల పంచాయితీ రచ్చకెక్కింది. పొన్నం ప్రభాకర్, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ ని దూషించారు. ఆ మంత్రులిద్దరినీ పిలిచి సయోద్య కుదిర్చారు. మరోవైపు మంత్రులు అడ్లూరి, వివేక్ ల మధ్య కూడా గొడవలు ఉన్నాయి. అసలు మంత్రుల్లో ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనర్హులకు కేటాయించారంటూ పలు జిల్లాల్లో ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. ఎంక్వైరీ చేసిన అధికారులు వందలాది ఇండ్లను రద్దు కూడా చేశారు. సన్న బియ్యం దాదాపు అందరికీ అందుతున్నాయి. అందులోని వ్యయం, దుబారాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు అంతులేకుండా పోతోంది. మొదట్లోనే ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టీపై డబ్బుల విడుదలకు కమిషన్లు తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. పలు శాఖల్లో మంత్రుల చేతి వాటం, వారి ఉద్యోగులపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల్లోనూ అవినీతి పెరిగింది. డబ్బులు లేనిదే ఫైలు కదలడం లేదు. ఏసీబీ నామమాత్రపు దాడులను ఉద్యోగులు లెక్కచేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది 2024లో ఉద్యోగులపై 152 ఏసీబీ కేసులు నమోదు కాగా, 2025 తొమ్మిది నెలల వ్యవధిలోనే 203 కేసులు నమోదు అయ్యాయి. ఉద్యోగుల్లో అవినీతి పెరుగుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణ వేరే అక్కరలేదు.
చేపట్టిన ప్రాజెక్టుల్లోనూ గత ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంచనాలు పెంచుతూ అవినీతికి తెరలేపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, పలు రకాల భూముల వ్యవహరాల్లోనూ ప్రభుత్వంపై అవినీతి మరకలు పడుతున్నాయి. వాటిని కడుక్కోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా కొండా సురేఖ ఓఎస్డీ గన్ పెట్టి చేసిన బెదిరింపుల వల్ల, అతన్ని ఉద్యోగంలోంచి ప్రభుత్వం తీసేసింది. అరెస్టు చేయడానికి పోలీసులు వెళితే, అతడిని తన ఇంట్లోనే దాచి పెట్టి, పోలీసుల ఎదుటి నుంచే అతడిని తన కారులోనే మంతరి సురేఖ తప్పించారు. పైగా ఆమె కూతురు పోలీసులపై బాహాటంగానే విరుచకుపడ్డారు. అవినీతిలో ఇదో బరితెగింపు అంకం. మంత్రులే అవినీతికి ఇంతగా మద్దతుగా నిలిస్తే ప్రభుత్వం పరువేం కాను?
పైగా సీఎం, మంత్రులు తనపై కక్షకట్టారని కొండా కుటుంబం చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. మేడారం కంట్రాక్టు పనులను ఆమె నిర్వహిస్తన్న దేవాదాయ శాఖ నుంచి తప్పించి, రోడ్లు భవనాల శాఖకు అప్పగించిన వైనం ఆశాఖలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం. మంత్రుల మధ్య సమన్వయం లేదనడానికి కూడా మేడారం పనులే దోహదం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటిలో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారని కొండా కుటుంబం ఆరోపిస్తోంది. తమను ’రెడ్డి’ సామాజికవర్గం టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు.
ఎప్పటికైనా, అవినీతి గుట్టు బట్టబయలుకాక మానదు. ఇది సర్కార్ కు అంత మంచిది కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి. నిన్నటి దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని చర్చించుకునే ప్రజలు దాన్ని మరచి, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిని పట్టించుకుంటున్నారు. ఇది వచ్చే ఐదేళ్ళూ అధికారం మాదేనని కలలుగంటున్న కాంగ్రెస్ కు, ప్రస్తుత సీఎంకు దీర్ఘకాలికంగా పెద్ద దెబ్బే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బట్టబయలు అవుతున్న తరుణంలో తమ అవినీతి బయటకు రాదన్న భరోసా బీఆర్ఎస్ ఉంది.

