రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, నేషనల్ వాలంటీర్ యూనియన్ ‘ లేదా ‘ నేషనల్ వాలంటీర్ కార్ప్స్ ‘ అనేది భారతీయ మితవాద హిందూత్వ స్వచ్ఛంద పారామిలటరీ సంస్థ. ఆర్ఎస్ఎస్ ను సెప్టెంబర్ 27, 1925న స్థాపించిన కేశవ్ బలిరాం హెడ్గేవార్ ముత్తాత నరహర శాస్త్రి ప్రస్తుత తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుండి నాగ్‌పూర్‌కు వలస వెళ్ళారు. హెడ్గేవార్ నాగపూర్ లో మరాఠీగా పుట్టినా, ఆయన మూలాలు మాత్రం తెలంగాణవే. కాగా, సీపీఐ కూడా ఇదే ఏడాది అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ప్రారంభించబడింది. దేశంలో కుడి, ఎడమలు రెండూ కూడా రెండు నెలల తేడాతో ఒకే ఏడాదిలో ఏర్పడటం కాకతాళీయం.
మార్చి 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ రోజువారీ శాఖల సంఖ్య 83,124. అదేవిధంగా, వారపు శాఖల సంఖ్య 32,147. అయితే తన శతాబ్ది ఏడాదిలో తన రోజువారీ శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కోటి మంది స్వయం సేవకులున్నారు. ప్రతి ఏటా 2.23 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు. ‘జాయిన్ ఆర్ఎస్ఎస్’ వెబ్ సైట్ ద్వారా 12.7 మిలియన్ల ప్రజలు సంప్రదించారు.
ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రయాణం అసాధారణమైంది. దేశంలో జాతి, మత, సంస్కృతి, రాజకీయ రంగాలపై ఆర్ఎస్ఎస్ ముద్ర విస్మరించలేనిది సేవ, క్రమశిక్షణ, ఆత్మసంకల్పం వంటి వాటితో పాటు విమర్శలు, సంఘర్షణలు, రాజకీయపరమైన చిక్కులు, దాని చరిత్ర గతిలో గతించిన, ప్రస్తుతిస్తున్న వాస్తవాలు. భవిష్యత్తులోనూ ఆర్ఎస్ఎస్, తన సిద్ధాంతాన్ని మారుతున్న సమాజంతో ఏవిధంగా సమన్వయం చేసుకుంటుంది? హిందుత్వ, “భక్తి- సంస్కృతి” సరే, మైనారిటీలను ఏ విధంగా సమన్వయం చేస్తుంది? వీటన్నింటినీ ఆర్ఎస్ఎస్ సమీక్షించుకుంటుందా? ఆత్మ విమర్శ చేసుకుంటుందా? ప్రజాస్వామిక విలువలను పెంపొందిస్తుందా? స్వీయ మనుగడను కొనసాగిస్తుందా? ‘డా. మార్గం – అడుగు’ ఎడిటోరియల్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, నేషనల్ వాలంటీర్ యూనియన్ ‘ లేదా ‘ నేషనల్ వాలంటీర్ కార్ప్స్ ‘ అనేది భారతీయ మితవాద హిందూత్వ స్వచ్ఛంద పారామిలటరీ సంస్థ. ఇది ‘సంఘ్ పరివార్’ అని పిలువబడే ఒక పెద్ద హిందూత్వ సంస్థల సమూహానికి నాయకత్వం వహించే మూలం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని పాలక బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ మాతృకగా గల జనసంఘ్ నుంచి ఆవిర్భవించిందే. మోహన్ భగవత్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ సర్సంఘ్‌చాలక్- చీఫ్ గా, దత్తాత్రే హోసబాలే సర్కార్యవ: – జనరల్ సెక్రటరీగా ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ ను సెప్టెంబర్ 27, 1925న స్థాపించింది కేశవ్ బలిరాం హెడ్గేవార్. కేబీ హెడ్గేవార్ ఏప్రిల్ 1, 1889న నాగ్‌పూర్, సెంట్రల్ ప్రావిన్స్ బేరార్‌లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ముత్తాత నరహర శాస్త్రి ప్రస్తుత తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుండి నాగ్‌పూర్‌కు వలస వెళ్ళారు. హెడ్గేవార్ నాగపూర్ లో మరాఠీగా పుట్టినా, ఆయన మూలాలు మాత్రం తెలంగాణవే. కాగా, సీపీఐ కూడా ఇదే ఏడాది అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ప్రారంభించబడింది. దేశంలో కుడి, ఎడమలు రెండూ కూడా రెండు నెలల తేడాతో ఒకే ఏడాదిలో ఏర్పడటం కాకతాళీయం.
అయితే, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు 100 రోజులుగా అనేక కార్యక్రమాలుగా జరిగాయి. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన, నాగపూర్ లోని రేషింబాగ్ మైదానంలోనే 2025 అక్టోబర్ 2న విజయదశమి రోజు శతాబ్ది కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ముగింపు ఉత్సవాలలో ప్రధాని మోదీ, ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో రూ.100 నాణాన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. దేశ చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి. నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం ముద్రించగా, మరోవైపు భరతమాత వరద ముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు. 1925 నుంచి 2025 వరకూ 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నాణెంపై రాసి ఉంది. ‘ప్రతీదీ దేశానికి అంకితం, ప్రతీదీ దేశానిదే, నాదంటూ ఏమీలేదు -‘రాష్ట్రీయ స్వాహా, ఇదం రాష్ట్రీయ, ఇదం నమమ’- అనే సంస్థ సిద్ధాంతాన్ని నాణెంపై చిత్రించారు. 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హైలైట్ చేస్తూ రూపొందించిన పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. శతాబ్ద కాలంగా సేవ, అంకితభావంతో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ప్రశంసించారు. దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు ఆర్ఎస్ఎస్ నిదర్శనమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతి పనిలో నేషనల్ ఫస్ట్ అనేది కనిపిస్తుందని తెలిపారు. అయితే, ఇది వివాదంగా మారే అవకాశం ఉంది.
ఇక ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రస్థానం అంత సాఫీగా జరిగిందేమీ కాదు. బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ లో 1947 జనవరి 24న ఆర్ఎస్ఎస్ పై మొదటి నిషేధం విధించబడింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఫిబ్రవరి 4, 1948న నిషేధించబడింది. 1975 అత్యవర పరిస్థితి సమయంలో, ఆ తర్వాత 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం కూడా నిషేధించబడింది. 1977లో అత్యవసర పరిస్థితితోపాటు ఆర్ఎస్ఎస్ పై నిషేధం కూడా ఎత్తివేయబడింది. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత సంస్థకు ఏర్పడిన మరక నుండి, ఆ తరువాతి దశాబ్దాల హిందూత్వ రాజకీయాలకు ‘విత్తనాలు నాటడం’ నుండి భారత రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్రను అత్యవసర పరిస్థితి చట్టబద్ధం చేసిందని చెబుతారు.
ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ తన నాగ్‌పూర్ ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను కేవలం రెండుసార్లు మాత్రమే ఎగురవేసింది, ఆగస్టు 14, 1947న మరియు జనవరి 26, 1950న, కానీ ఆ తర్వాత దానిని ఆపివేసింది. ఈ అంశం ఎల్లప్పుడూ వివాదానికి మూలంగా ఉంది.
హెడ్గేవార్ మృతి తర్వాత, మాధవ సాత్యాంధరా గోల్వాకర్ ఆర్ఎస్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించారు. అనుబంధంగా పలు సంస్థలు ఏర్పడ్డాయి. 1952లో భారతీయ జనసంఘ్, దీని కొనసాగింపుగా, 1980లో బీజేపీ ఆవిర్భవించాయి. వరల్డ్ హిందూ కౌన్సిల్ గా విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి, భారత్ వికాస్ పరిషత్, విద్యా భారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్ఎస్ కు ప్రపంచ వ్యాప్తంగా శాఖలున్నాయి. మార్చి 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ రోజువారీ శాఖల సంఖ్య 83,124. అదేవిధంగా, వారపు శాఖల సంఖ్య 32,147. అయితే తన శతాబ్ది ఏడాదిలో తన రోజువారీ శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కోటి మంది స్వయం సేవకులున్నారు. ప్రతి ఏటా 2.23 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు. ‘జాయిన్ ఆర్ఎస్ఎస్’ వెబ్ సైట్ ద్వారా 12.7 మిలియన్ల ప్రజలు సంప్రదించారు. అందులో చాలా మంది చేరారు. గత ఒక్క ఏడాదిలోనే వాలంటీర్లు, 89.706 సేవా భారతి, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
ఆర్ఎస్ఎస్ విపత్తుల సమయంలో రక్షణ సహాయం, రక్తదానం శిబిరాలు, విద్యా సంస్థలతో పిల్లలకు అవగాహన, గ్రామాభివృద్ధి, మహిళల సమావేశాల వంటివి నిర్వహిస్తుంటాయి. దేశ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్-బీజేపీ అనుబంధం అతీశక్తిగా మారింది. బీజేపీకి పెట్టని కోట సంఘ్ పరివారమే. ఆర్ఎస్ఎస్, దాని పారామిలిటరీ పనితీరు, క్రమశిక్షణ, భావజాలం ఫాసిజానికి నయా రూపంగా కనిపిస్తుంది. హిందూయేతర మతాలు, మైనారిటీలపై వ్యతిరేకంగా ఉండటం, రాజ్యాంగ మౌలిక లౌకిక సూత్రానికి విరుద్ధంగా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ తన ప్రభావాన్ని, విధానాత్మక ఒత్తిడిని కొనసాగిస్తున్నది. ఒకవైపు సేవ, సేవా కార్యక్రమాలు, విపత్తు సహాయాలు చేస్తూ సమాజ హితానికి ఉపయోగకారిగా ఉన్నది. మరోవైపు ఒక మతాన్ని ప్రేరేపిస్తూ, ఇతర మతాలను వ్యతిరేకిస్తూ మత విద్వేషిగా ఉంది. స్వాతంత్ర్యోద్యమంలో సంస్థ పాత్ర లేకపోవడం, తెలంగాణ వంటి ఉద్యమాల్లో క్రీయాశీలకంగా కనిపించకపోవడం ఆ సంస్థపై విమర్శలు.
అయితే, ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రయాణం అసాధారణమైంది. దేశంలో జాతి, మత, సంస్కృతి, రాజకీయ రంగాలపై ఆర్ఎస్ఎస్ ముద్ర విస్మరించలేనిదే కాదు, అత్యంత ప్రభావవంతమైంది కూడా. ఈ శతాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ సేవ, క్రమశిక్షణ, ఆత్మసంకల్పం వంటి వాటితో పాటు విమర్శలు, సంఘర్షణలు, రాజకీయపరమైన చిక్కులు, దాని చరిత్ర గతిలో గతించిన, ప్రస్తుతిస్తున్న వాస్తవాలు. భవిష్యత్తులోనూ ఆర్ఎస్ఎస్, తన సిద్ధాంతాన్ని మారుతున్న సమాజంతో ఏవిధంగా సమన్వయం చేసుకుంటుంది? సమానతను సాధించడం ద్వారా అందరి ఆమోదం పొందగలదా? హిందూయిజం, “భక్తి- సంస్కృతి” సరే, మైనారిటీలను ఏ విధంగా సమన్వయం చేస్తుంది? వీటన్నింటినీ ఆర్ఎస్ఎస్ సమీక్షించుకుంటుందా? ఆత్మ విమర్శ చేసుకుంటుందా? సవాళ్ళను స్వీకరించి ఎదుర్కొంటుందా? ప్రజాస్వామిక విలువలను పెంపొందిస్తుందా? స్వీయ మనుగడను కొనసాగిస్తుందా? చూడాలి.

