యుద్ధంలో గెలుపు ఓటములకంటే, యుద్ధ పరిణామాలే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే అనివార్యమైతే తప్ప యుద్ధానికి దిగకూడదని అంటారు. యుద్ధాన్ని నివారించడమే తెలివైన పని. తప్పదనుకున్నప్పుడు యుద్ధాన్ని తెలివిగా చేయాలి. అంతకంటే తెలివిగా ముగించాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశం అంటే కేవలం భావనలు, భూభాగం మాత్రమే కాదు. మనుషులు, విలువైన వాళ్ళ ప్రాణాలు, సంపద, వర్తమానం, భవిష్యత్తు ఎన్నో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా యుద్ధానికి దిగితే, వాటి పరిణామాలను కూడా ఆయా దేశాలు అనుభవించాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అనుభవాలను ఏ దేశమైనా గుణపాఠంగా తీసుకోవాలి. బహుశా, ఇవేవీ దాయాది దేశం పట్టించుకున్నట్లు లేదు. పాక్ కు తమ దేశ ప్రజల భవిష్యత్తు, మనుగడ కంటే కూడా యుద్ధమే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నది. కచ్చితంగా దాని ఫలితాలను ఆ దేశం అనుభవించి తీరుతుంది.
పాక్ లోని ఉగ్ర మూకలపై దాడులు మాత్రమే జరిగాయి. అసలు యుద్ధమే జరగలేదు. కానీ భారత్‌తో యుద్దం గెలిచామని తమ సొంత ప్రజలను నమ్మించేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. చివరకు విజయోత్సవాలను కూడా జరుపుకుంది. ట్రంప్ కూడా తను ఓ అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిని అన్నదే మరచి, వీడియో గేమ్స్ ఆడే పిల్లాడిలా తన టెంపరితనాన్ని చూపిస్తున్నాడు. తనవల్లే భారత్ పాక్ యుద్ధం ఆగిందని ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రచార పటాటోపం, కీర్తి కండూతి తప్ప మరేమీ లేదు. అంత మొనగాళ్ళైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎందుకు ఆపడం లేదు? ఇజ్రాయిల్ ను ఎందుకు కట్టడి చేయడంలేదు? లేని పెత్తనాన్ని నెత్తిన ఎత్తుకొని అమెరికా, లేని యుద్ధాన్ని కొని తెచ్చుకుంటూ పాకిస్తాన్ ఎందుకు కాళ్లబేరానికి వచ్చింది? ప్రపంచాన్ని బెదిరించి పబ్బం గడుపుకునే దుస్థితిలో ట్రంప్ ఉన్నాడు. అడుక్కుతినే దుస్థితిలో పాక్ ఉంది. పైగా యుద్ధాన్ని తానే ఆపానని ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకుంటుంటే, మరో వైపు పాకిస్తాన్ తామే యుద్ధంలో గెలిచామని ప్రచారం చేసుకోవడంలో ఔచిత్యం ఉందా?!
నిజానికి అమెరికా, పాకిస్తాన్‌లు చేసుకుంటున్న చిల్లర ప్రచారంపై అమెరికాతో సహ ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. భారత్ దెబ్బకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిన పాక్, ట్రంప్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవడం మంచిది. ఇండియా పాకిస్తాన్‌ల మధ్య కాల్పులు మొదలైన మూడు రోజులకే తోక ముగిసిన సంగతి ప్రపంచానికి తెలిసిందే! భారత్ దెబ్బకు పాక్ కూసాలు కదిలిపోయాయి. మిస్సైల్స్, డ్రోన్ల దాడి కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించింది. ఒకరకంగా పాక్‌పై కోలుకోలేని దెబ్బ పడింది. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశం సర్వ నాశనం అవుతుందని పాక్ భావించింది. వెంటనే కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాయంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో కాల్పుల కొనసాగింపు ఆగిపోయింది. ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని గట్టిగా హెచ్చరించింది.
ఇప్పుడు అందరి చూపు పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న వైనంపై కేంద్రీకృతం అయింది. ఇవ్వాళ ఉగ్రవాదం కేవలం భారత్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచానికి విస్తరించింది. గతంలో జరిగిన దాడులు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ టెర్రరిజం పై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఉగ్రవాదులకు ఊతమిచ్చే చర్యలను పాక్ పక్కన పెట్టాలి. పాక్ కు మద్దతిస్తే భవిష్యత్తులో అమెరికాకు కూడా ఉగ్ర ముద్ర తప్పదని గుర్తించాలి.
1971 యుద్ధ సమయంలో పాక్‌కు దన్నుగా అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలు నిలిచాయి. మన దేశానికి సమైక్య రష్యా మాత్రమే అండగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అందుకే చైనా భయపడుతోంది. వ్యూహాత్మకంగా పాక్ ను చేరదీస్తోంది. దాయాది దేశానికి వివిధ రూపాల్లో సహాయం చేస్తోంది. ఇదే తరుణంలో అమెరికా చైనాతో విభేదిస్తోంది. పన్నుల యుద్ధాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో చైనాతో తలపడాల్సి వస్తే భౌగోళికంగా పాక్ భూభాగం అమెరికాకు అవసరం. ఈ కారణంగా ఉగ్రవాదంపై తమది రాజీ లేని పోరు అంటూనే అమెరికా దొడ్డి దారిన పాకిస్తాన్‌కు సహాయం చేస్తోంది. పశ్చిమ దేశాలతో ఉన్న వైరం కారణంగా రష్యా కూడా చైనాకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఈ కారణంగానే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేయవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు భారత్ విజ్ఞప్తి చేసినా, వినకుండా వంద కోట్ల డాలర్ల సహాయం అందించడానికి అంగీకారం తెలిపింది.
ఇక యుద్ధాలను భరించే స్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పుడు లేవు. ఏ దేశం ఒంటరిగా మనజాలదు. పరస్పర ఆధారం అనివార్యం. అన్నింటికంటే వాణిజ్య అవసరాలను ఏ దేశం విస్మరించలేదు. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా పెరిగాయి. ఇప్పుడంతా అభివృద్ధి, అర్థిక వృద్ధిపైనే అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. పాక్ ఇందుకు భిన్నంగా ఉగ్రవాదులను ఎగదోస్తోంది. ఇలా ఎంతకాలం చేసినా అది మనుగడ సాగించదని గుర్తిస్తే మంచింది. అలా అని పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పకుండా ఉండలేం. తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఈ యుద్ధం ప్రతిబంధకమే. అలా అని చేతులు ముడుచుకొని కూర్చోలేని సంకట స్థితి.

