నకిలి మకిలి!!
తప్పుడు పోస్టింగ్స్ వద్దు!
ఫ్యాక్ట్ ఫైండింగే ముందు!!
పాక్ గోబెల్స్ ప్రచారంపై భారత రక్షణశాఖ అప్రమత్తం
ఫ్యాక్ట్ ఫైండింగ్ తో నిర్ధారించుకోవాలని ప్రజలకు వినతి
‘నిజం నిద్ర లేచేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందట!’ అబద్ధం వేగం, పవర్ అంతన్నమాట. అందుకేనేమో ‘అబద్ధానికి అడ్డు లేదు’ అన్నారు. ఈ అడ్డూ అదుపూ లేని అబద్ధాన్ని అతికినట్లు చెప్పడం ఓ కళ! కాబట్టి, ‘అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి’ అని కూడా ముందు జాగ్రత్తలు చెప్పారు. అబద్ధాలు అందంగా ఆడటం, అవే నిజమన్నంతగా బుకాయించడం, అబద్ధాలని నమ్మకంగా చెప్పడం వంటి ఎన్నో అబద్ధాల కళలు ఒంట పట్టించుకున్నది పాకిస్తాన్. ఇప్పుడు ఇంతటి విపత్కర విషవలయ యుద్ధ సమయంలోనూ అబద్ధాలనే నమ్ముకుంది. అబద్ధపు ప్రచారాలనే చేస్తోంది. భారత్ పై బురద చల్లుతూనే ఉంది. చివరకు ప్రపంచాన్ని నమ్మించాలని కూడా చూస్తోంది. అయితే, యుద్ధం వంటి సున్నిత జాతీయత, ఐక్యత, భద్రతలతో కూడి భావోధ్వేగ సన్నివేశ సందర్భం కాబట్టి, ‘ఇదిగో తోక! అనగానే అదిగో పులి!!’ అన్నట్లు దేన్నైనా వెంటనే నమ్మేస్తారు. అనుమానిస్తూనైనా సరే, నిజమేమో అనుకుంటారు. వెంటనే దాన్ని పక్కనే ఉన్న పది మందికీ ఐ విట్ నెస్ మనమే అన్నట్లుగా చెప్పేస్తాం. వీలైతే ఒకటి రెండు అదనంగా కలిపేస్తాం. ఇప్పుడు నవీన సాంకేతిక టక్కుటమార విద్యలతో కూడిన అంతర్జాల స్మార్ట్ ఫోన్లు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి క్షణాల్లోనే ఈ విషయాలని ప్రపంచానికి పంచేస్తాం.
ఇక మీడియా మిత్రులైతే అనుకున్నదే తడవు. అందినదే వార్త. అందులో ఏమున్నదన్నది అప్రస్తుతం. అనవసరం. తన పత్రిక/చానల్ కంటే ముందే ఓ పది గ్రూపుల్లో పడేస్తే కానీ, ‘ప్రెస్’ ప్రాణానికి ప్రశాంతత ఉండదు. పైగా అందరికంటే ముందే మనకే ముందు ఇన్ఫర్మేషన్ ఉందన్న గర్వం. ‘మనోడు మరీ ఇన్ఫర్మేటివ్’ అని తోటి విలేకరి అంటే, ఇక ఆకాశంలో విహరింపే! ‘ముందు వచ్చింది పంపేయ్, మేం వేసేస్తాం. తప్పైతే మరచిపో… ఒప్పైతే మనదే స్కోరింగ్’ అనే పెద్దలు కూడా లేకపోలేదు. ఈ లోగా ఎవడి పరువుకు ఎవడు బాధ్యుడు? ఇప్పుడు అంత టైమ్ లేదు గురూ! మనం ఫ్యాక్ట్ ఫైండ్ చేసేలోగా పక్కోడు బ్రేకింగ్ వేసేస్తాడు. ప్రపంచాన్ని చుట్టేస్తాడు. ఎవడి కోసమో ఆగే ప్రపంచం కాదు కదా?
ఇక ఎవరైనా ’సోషల్ మీడియాలో మీరు మరీ యాక్టివ్ గురూ!’ అంటే చాలు మన గురుడు లేచిలేచి గోచీ పెట్టేస్తాడు. పైగా తను పంపిన సమాచారమే పర్ఫెక్ట్ అని పేచీ పెట్టేసుకుంటాడు. ఈ వేగం, ఈ తేజమే ఇప్పుడు జనాల్ని ఆగం చేస్తున్నది. యుద్ధ రంగంలో ఉన్న మనం ఏది అబద్ధమో? ఏది నిజమో తెలుసుకునేలోగా అబద్ధం నిజంగానే ప్రపంచాన్ని చుట్టి వస్తున్నది.
ఇప్పుడు యుద్ధరంగంలో పాక్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలు కూడా ఇలాగే ప్రజల్ని పరేషాన్ చేస్తున్నాయి. ఈ అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టడానికి భారత రక్షణ శాఖ ఓ ప్రత్యేక విభాగాన్నే నడపాల్సి వస్తున్నది. ఎప్పటికప్పుడు ప్రజలకు నిజానిజాలను వెల్లడించాల్సి వస్తున్నది.
‘పాకిస్తాన్ సోషల్ మీడియా సమన్వయంతో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తోంది. భారతదేశంలో అపనమ్మకం, గందరగోళం, భయాందోళనలను పెంచడమే వారి లక్ష్యం. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి బారిన పడకండి. అప్రమత్తంగా ఉండండి’ అంటూ భారత రక్షణ శాఖ హెచ్చరిస్తున్నది. ప్రచారంలో ఉన్న నకిలీ సమాచార ఫోటో/వీడియోతోపాటు లింక్ పోస్టు చేసి, దాని కిందే నిజమైన సమాచారాన్ని ఉటంకిస్తూ దాని ఫోటో/వీడియోతోపాటు ఆ పాత లింక్ ను కూడా పోస్టు చేసి, నిజానిజాల నిగ్గు తేలుస్తున్నది. అంతేకాదు పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా వీడియోలు, ఫోటోల సమాచారం నిజమైనదా? అబద్ధమా? అన్నది తేల్చుకోవాలని సూచిస్తున్నది.
ఫేక్ న్యూస్ : కొన్ని ఉదాహరణలు!
‘జమ్మూపై పాకిస్తాన్ దాడి జరిగిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పాత వీడియో చక్కర్లు కొడుతోంది.’ అంటూ ఆ వీడియోను షేర్ చేస్తూ, ఆ పక్కనే ‘ఈ వీడియో ఫిబ్రవరి 2025 నాటిది ఢాకా నుండి వచ్చింది.’ అన్న సమాచారాన్ని క్లిప్ ను, లింకును కూడా జత చేసి రక్షణశాఖ ప్రచారం చేయాల్సి వచ్చింది. అలాగే, ‘ముజఫరాబాద్‌లో ఒక Su-30MKI విమానం కూలిపోయిందని, అందులో ఒక భారతీయ పైలట్ సజీవంగా ఉన్నాడని పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పేర్కొంటున్నాయి.’ అయితే ‘భారత వైమానిక దళానికి చెందిన ఈ Su-30MKI అక్టోబర్ 14, 2014న మహారాష్ట్రలోని పూణే-అహమద్ నగర్ హైవే సమీపంలోని కుల్వాడి గ్రామంలోని ఉండ్రే వస్తి వద్ద కూలిపోయింది.’ ఈ పోస్టును షేర్ చేయవద్దు. అని వివిరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘భారత్ లోని జమ్మూ వైమానిక దళ స్థావరంలో బహుళ పేలుళ్లు జరిగాయ’నే తప్పుడు వాదనలతో పాత చిత్రం ప్రచారంలో ఉంది. ‘ఈ చిత్రం ఆగస్టు 2021లో కాబూల్ విమానాశ్రయ పేలుడుకు సంబంధించినది.’ చైనా డైలీ వార్తా నివేదికలో ‘కశ్మీర్‌లో కనీసం మూడు భారతీయ జెట్‌లు కూలిపోయాయ’ని తప్పుగా పేర్కొంది. ఈ చిత్రం 2019 నాటి ఒక సంఘటనకు సంబంధించినది. ఇది ప్రజలను భయాందోళనలకు గురిచేసి, తప్పుతోవ పట్టించడం లక్ష్యంగా జరుగుతున్న ప్రచారం.

ఇలా… జలంధర్‌లో డ్రోన్ దాడి, పాకిస్తాన్ సైన్యం ఒక భారత పోస్టును ధ్వంసం చేసిందని, భారతదేశంపై పాక్ క్షిపణి దాడి జరిగిందని, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై ‘ఫిదాయీన్’ దాడి జరిగిందని, ఎయిర్ ఫోర్స్ ప్లేన్ క్రాష్ అయిందని, నకిలీ వార్తలు వ్యాపిస్తున్నాయి. వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీల పేరున ఎక్స్ లో ఫేక్ అక్కౌంట్లను పెట్టారు. ఏకంగా భారత భద్రతా వ్యవహారాల సలహాదారు ధోవల్ పేరున ఫేస్ బుక్ అకౌంట్ నే క్రియేట్ చేశారు. ‘పూర్తి స్థాయి యుద్ధానికి పౌరులు సిద్ధం కావాలని రక్షణశాఖ పిలుపు’నిచ్చినట్లుగా ఓ పోస్టు వైరల్ చేశారు. రాజస్థాన్ లోని హనుమాన్ ఘడ్ లో జరిగిన అగ్రి ప్రమాదాన్ని ఉధంపూర్ ఎయిర్ బేస్ ని పాక్ ధ్వంసం చేసినట్లుగా ప్రసారం చేశారు.

రాబోయే రోజుల్లో మీ సోషల్ మీడియా పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ప్రచారంతో నిండిపోతుంది. ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భారత సాయుధ దళాలకు సంబంధించిన సందేహాస్పద కంటెంట్ లేదా ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఏదైనా సమాచారం మీకు ఎదురైతే, దానిని ఫ్యాక్ట్ చెక్‌కు నివేదించాలని, నిర్ధారించుకోవాలని భారత రక్షణ శాఖ దేశ ప్రజలకు విన్నవిస్తున్నది.

అయితే ఇలాంటి పోస్టులను ప్రజలు, పార్టీలు, కొన్ని సంస్థలు, మీడియా, సోషల్, డిజిటల్ మీడియా తదితర ప్లాట్ ఫామ్స్ లో కొందరు ఉత్సాహంగా, జాతీయ భావంతో, దేశ భక్తితో, అలవాటుగా, అదే పనిగా రకరకాల కారణాలతో భావోధ్వేగాలతో పోస్టులు పెడుతున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళే కాదు. పొరపాటుగా ఏవైనా ఫోటోలు, వీడియోలు, సమాచారం వస్తే ఫ్యాక్ట్ ఫైండ్ అంటే అవి నిజమైనవా? కావా? అన్నది నిర్ధారించుకోవాని రక్షణ శాఖ కోరుతోంది.

‘నిజం నిప్పులాంటిది’ అని కూడా అన్నారు. నివురు కప్పితే కాదు కానీ, నిగ్గు తేలితే నిప్పు కణిక లాగా అసలు నిజం కనిపిస్తుంది. తమ ప్రజలను నమ్మించడానికి పాక్ ఈ పన్నాగాన్ని పన్నింది. సరే, మన ప్రజలకైతే వాస్తవమేదో తెలపాలి కదా? అయ్యా! మనమంతా ‘తొందర వద్దు. నిర్ధారణే ముందు.’ అనుకుందామా!?

